కొత్త పంట బీమా రైతుకు వరం: మోదీ
న్యూఢిల్లీ: గతంలో వచ్చిన పంట బీమా పథకాలు విజయవంతం కాలేదని.. అందుకే రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని ప్రధాని మోదీ తెలిపారు. రైతు సమస్యలపై ఇంతవరకు ఎప్పుడూ రానంత పకడ్బందీగా.. భారీగా ప్రభుత్వ భాగస్వామ్యంతో తక్కువ ప్రీమియం చెల్లింపునకే.. ఎక్కువ బీమాను అందించే ఈ పథకంతో సమస్యల్లో ఉన్న అన్నదాతకు మేలు జరుగుతుందన్నారు. జనవరి 13న ఈ పథకాన్ని ప్రధాని ప్రారంభించడం తెలిసిందే .‘ప్రకృతి విపత్తుల వల్ల జరుగుతున్న నష్టం నుంచి అన్నదాతను బయటపడేసేందుకు, పడిపోతున్న మార్కెట్ ధరలనుంచి కాపాడేందుకు మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
అందుకే మీ సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి పథకాలను ప్రవేశపెడుతున్నాం’ అని రైతులకు రాసిన బహిరంగ లేఖలో ప్రధాని పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ పథకాల అమలు, బడ్జెటింగ్, స్వచ్ఛభారత్ అమలు, గంగానది ప్రక్షాళనపై పలు ప్రభుత్వ విభాగాల సెక్రటరీల బృందం ప్రధానికి తమ నివేదికను అందజేసింది.