మాట్లాడుతున్న గుజ్జుల రామకృష్ణారెడ్డి
పెద్దపల్లిరూరల్: ఆరుగాలం కష్టపడి పంట దిగుబడులు సాధించిన రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా పంటలకు మద్దతు ధర పెంచుతూ ప్రధాని నరేంద్రమోదీ సాహసోపేత నిర్ణయం తీసుకుని నిజమైన రైతుబంధుగా నిలిచారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. పెద్దపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పంటలను సాగుచేసే రైతులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించిన కేంద్రం మద్దతు ధరను పెంచిందన్నారు. 24 రకాల పంటలకు పెంచాలనుకున్నా తొలిదఫాగా 14 పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుందని వివరించారు.
పెద్దపల్లి జిల్లాలో వరి, పత్తి పంటల సాగు ఎక్కువ విస్తీర్ణంలో చేస్తున్న రైతులకు మద్దతు ధర పెంపు ఎంతో ఉపకరిస్తుందన్నారు. పత్తికి క్వింటాల్‌కు రూ. 1130, వరికి రూ. 200 మద్దతు ధర పెంచడం హర్షనీయమన్నారు. కష్టపడి పని చేసే రైతు, కౌలు రైతులకే నేరుగా లబ్ధి చేకూరేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా రైతాంగం సంతోష పడుతుందన్నారు. అ యితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే అమలులోకి తెచ్చిన రైతుబంధు పథకం భూ యజమానులకే లబ్ధి చేకూర్చేలా ఉందన్నారు. కేంద్రం ఇచ్చే మద్దతు «ధరకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ అధికారం
దేశంలో నీతివంతమైన పాలన అందిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాల సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్న ధీమాను గుజ్జుల వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన ప్రజా జనచైతన్య యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందన్నారు. బుధవారం పెద్దపల్లికి చేరిన ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా చేపట్టిన బైక్‌ర్యాలీకి తరలివచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కొంతం శ్రీనివాస్‌రెడ్డి, మీస అర్జున్‌రావు, కర్రె సంజీవరెడ్డి, పుట్ట మొండయ్య, ఠాకూర్ రాంసింగ్, పిన్నింటి రాజు, ఫహీమ్, జంగ చక్రధర్‌రెడ్డి, కందుల సదానందం, ఠాకూర్ రాజారాంసింగ్, స్వతంత్ర కుమార్, ఆనంద్, బచ్చలి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment