పోలింగ్ రోజు ప్రజలు కేసీఆర్‌కు సినిమా చూపిస్తారు: మోదీ | PM Modi Election Meeting In Karimnagar | Sakshi
Sakshi News home page

పోలింగ్ రోజు ప్రజలు కేసీఆర్‌కు సినిమా చూపిస్తారు: మోదీ

Published Mon, Nov 27 2023 3:41 PM | Last Updated on Mon, Nov 27 2023 4:24 PM

PM Modi Election Meeting In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: పోలింగ్ రోజు ప్రజలు కేసీఆర్‌కు సినిమా చూపిస్తారని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ పని అయిపోయిందని చెప్పారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి చెందినవారే సీఎం అవుతారని స్పష్టం చేశారు. తెలంగాణ అభ్యన్నతి బీజేపీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. 

కరీంనగర్ షోడశమహాజనపదాల్లో ఒకటిగా ఉండేదని ప్రధాని మోదీ చెప్పారు. పదేళ్ల పిల్లల్ల భవిష్యత్‌ కోసమే తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచిస్తారు.. అలాగే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆచితూచి అడుగులు వేయాలని కోరారు. కరీంనగర్‌ ప్రజాస్వామ్యానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. దేశం కోసమే ఓటు వేయాలంటే అది బీజేపీకి మాత్రమే ఓటేయాలని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గమనించినట్లు మోదీ పేర్కొన్నారు. 

రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి ఎక్కడ జరిగింది? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఈ సమయంలో బీజేపీ ప్రభుత్వం ఎంతో అవసరమని వెల్లడించారు. కాంగ్రెస్‌కు ఓటేయడమంటే అది బీఆర్‌ఎస్‌కేనని ప్రజలు గుర్తించాలని చెప్పారు. కేసీఆర్‌ను వద్దనుకుంటే కాంగ్రెస్‌కు ఓటేయొద్దని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పిల్లల భవిష్యత్‌ను నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు.  కరీంనగర్‌ను స్మార్ట్ సిటీని చేస్తామంటే కేసీఆర్‌ అడ్డుపడ్డారని పేర్కొన్న మోదీ.. కరీంనగర్‌ను లండన్ చేస్తానన్న కేసీఆర్‌ మాటలు ఏమయ్యాయని దుయ్యబట్టారు. పీవీ నరసింహారావుని కాంగ్రెస్ ఎప్పుడూ నిర్లక్ష‍్యం చేసిందని చెప్పారు. 

రైతులకు నీళ్లిచ్చేందుకు కూడా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని మోదీ ఆరోపించారు. కుటుంబ పాలకులు వారి పిల్లల గురించే ఆలోచిస్తారు.. ప్రజల పిల్లల గురించి ఆలోచించబోరని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ వంటి సంస్థలు పెరిగిపోయాయని తెలిపారు. ఫిలిగ్రి కళకు కరీంనగర్ పెట్టింది పేరు.. అలాంటి కళలను ప్రోత్సహించేందుకు కేంద్రం విశ్వ కర్మ యోజనను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇందులో భాగంగా లక్షలాది రూపాయలు గ్యారెంటీ లేకుండానే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మోదీ నీడ పడితే కలలన్నీ చెదిరిపోతాయని భయం.. అందుకే తనను సీఎం కేసీఆర్ కలవట్లేదని విమర్శించారు. 

ఇదీ చదవండి: కాంగ్రెస్‌వాళ్లే రైతుబంధు ఆపారు.. సిగ్గుందా?: కేసీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement