రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు
రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధాని
అనంతరం వేములవాడ, వరంగల్‌లలో ఎన్నికల ప్రచార సభలు
ప్రధాని పర్యటనతో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు..
నేడు రాత్రి హైదరాబాద్‌కు అమిత్‌షా.. రేపు భువనగిరిలో సభకు హాజరు
రేపు వరంగల్, జహీరాబాద్‌లలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రచారం
సాక్షి, హైదరాబాద్/ వేములవాడ/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోవడంతోపాటు వేములవాడ, వరంగల్‌లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. బుధవారం ఉదయమే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. సుమారు 8 గంటల సమయంలో వేములవాడకు చేరుకుంటారు.
అక్కడి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత వేములవాడలోని బాలానగర్‌లో బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఉదయం 10 గంటల సమయంలో వరంగల్‌కు చేరుకుంటారు. అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌కు మద్దతుగా ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు.
పకడ్బందీగా ఏర్పాట్లు..
వేములవాడలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆలయ సమీపంలోని ఎత్తయిన భవనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇక ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రధాని సభ కోసం బాలానగర్ ప్రాంతంలో భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే మంగళవారం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో టెంట్లు, కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. వాటిని సరిచేస్తున్నారు. వానలు కొనసాగుతాయన్న వాతావరణశాఖ ప్రకటన నేపథ్యంలో.. బుధవారం సభ నిర్వహణ ఎలాగన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేములవాడ ఆలయానికి వస్తున్న తొలి ప్రధాని మోదీయే కావడం గమనార్హం.
అమిత్ షా, రాజ్‌నాథ్‌ల ప్రచారం కూడా..
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. బుధవారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకోనున్న అమిత్ షా.. గురువారం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో భువనగిరికి చేరుకుని, బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇక రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఉదయం 9 గంటలకు వరంగల్‌లో, 11 గంటలకు జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా బాన్సువాడలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.
పీవీ కుటుంబ సభ్యులతో మోదీ డిన్నర్
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం మోదీ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి బస చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు ప్రభాకర్‌రావు, కుమార్తెలు ఎమ్మెల్సీ వాణీదేవి, శారదాంబ, ఇతర కుటుంబ సభ్యులు రాజ్‌భవన్‌కు వచ్చి ప్రధాని మోదీని కలిశారు. మోదీ వారితో కాసేపు మాట్లాడారు, కలిసి డిన్నర్ చేశారు. అనంతరం పీవీ మనవడు ఎన్వీ సుభాష్ మాట్లాడారు. ప్రధానిని కలిసి, అరగంటకుపైగా గడపడం.. సైన్స్, టెక్నాలజీ, ఇతర అంశాలపై మాట్లాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment