వంద రోజుల ప్రణాళికలో రెండు కీలక రోడ్ల ప్రాజెక్టులకు చోటు
దేశవ్యాప్తంగా 3 వేల కి.మీ. రోడ్డు ప్రాజెక్టుల ఎంపిక
ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్డు, జగిత్యాల–కరీంనగర్ నాలుగు వరసల రోడ్డుకు చోటు
వందరోజుల్లో రూ.6 వేల కోట్ల పనుల ప్రారంభం
యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేలా ప్రణాళిక
ఎన్‌హెచ్ 63, 563లకు రాజయోగం
సాక్షి, హైదరాబాద్: మోదీ 3.0 తొలి ‘వంద రోజుల ప్రణాళిక’లో తెలంగాణకు చెందిన రెండు కీలక రోడ్ల ప్రాజెక్టులకు చోటు దక్కింది. ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే, జగిత్యాల–కరీంనగర్ నాలుగు వరసల జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఇందులో ఎంపిక చేశారు. ఈ వంద రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియతో మందగించిన పురోగతిని వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మూడో విడత పాలనను వంద రోజుల ప్రత్యేక ప్రణాళికతో ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ ప్రణాళికలో దేశవ్యాప్తంగా 3 వేల కి.మీ. నిడివి గల జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులను చేర్చారు. వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే క్రమంలో పనులను ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తారు. వాటిలో తెలంగాణకు సంబంధించి ఈ రెండు జాతీయ రహదారులుండటం విశేషం. ఇందులో ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల రోడ్డుకు సంబంధించి గత ఫిబ్రవరిలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇక జగిత్యాల–కరీంనగర్ రోడ్డు విస్తరణకు సంబంధించి ఆరు నెలల క్రితమే టెండర్లు పూర్తికాగా, ఇప్పుడు వాటిని రద్దు చేసి కొత్తగా మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వేగంగా చర్యలు తీసుకుంటోంది.
రెండు రోడ్ల అనుసంధానం
నిజామాబాద్–ఛత్తీస్‌గడ్‌లోని జగ్దల్‌పూర్ మధ్య విస్తరించి ఉన్న ఎన్‌హెచ్–63ను విస్తరించాలని కేంద్రం గతంలోనే నిర్ణయించింది. ట్రక్కులు అధికంగా తిరిగే ఈ జాతీయ రహదారి రెండు వరసలతో ఇరుకుగా ఉండి ప్రమాదాలకు నిలయంగా మారటంతో నాలుగు వరసలకు విస్తరించనున్నారు. ఇందులో ఆర్మూరు–మంచిర్యాల మధ్య కీలక ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించారు. రాష్ట్రం పరిధిలోని మిగతా నిడివిని రాష్ట్రప్రభుత్వ అ«దీనంలోని జాతీయ రహదారుల విభాగం విస్తరిస్తోంది.
పట్టణాలు, గ్రామాలున్న చోట బైపాస్‌లు నిర్మించి, మిగతా రోడ్డును విస్తరిస్తారు. ఆర్మూరు, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట మీదుగా సాగే ఈ రోడ్డు నిడివి 131.8 కిలోమీటర్లు. ఆర్మూరు, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట, మంచిర్యాల పట్టణాల వద్ద 6–12 కి.మీ. మేర భారీ బైపాస్‌లు ఉంటాయి. ఇవి కాకుండా మరో 8 ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లు నిర్మిస్తారు. ఇతర రోడ్ల క్రాసింగ్స్ ఉన్న ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తారు. ఇక వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్‌ఓబీలు దాదాపు 46 వరకు ఉంటాయి. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు చేయనున్నారు. భూసేకరణ విషయంలో గతంలో స్థానికులు వ్యతిరేకించి ఉద్యమించడంతో రెండుమార్లు దీని డిజైన్ మార్చాల్సి వచి్చంది. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వచి్చంది. ఇప్పుడు ఆలస్యం కాకుండా పనులను వేగంగా పూర్తి చేయనున్నారు.
‘ప్రమాదాల రోడ్డు’కు ప్రాధాన్యం
జగిత్యాల నుంచి ఖమ్మం వరకు విస్తరించి ఉన్న ఎన్‌హెచ్–563లో కీలక భాగమైన 58.86 కి.మీ. నిడివి కూడా ఇప్పుడు వంద రోజుల ప్రణాళికలో చోటు దక్కించుకుంది. ఈ రోడ్డు రెండు వరసలుగా ఉండి ఇరుగ్గా మారటంతో ప్రమాదాలకు నిలయమైంది. దీన్ని విస్తరించాలని చాలాకాలంగా యతి్నస్తున్నా పనుల్లో వేగం రాలేదు. కరీంనగర్ నుంచి వరంగల్ మధ్య ఎట్టకేలకు పనులు మొదలు కాగా, జగిత్యాల–కరీంనగర్ మధ్య టెండర్ల ప్రక్రియతో ఆగిపోయింది. గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్తగా పిలవాలని ఇప్పుడు నిర్ణయించారు. ఆ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి వంద రోజుల గడువులో నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. ఈ నిడివి పనులకు రూ.2,151 కోట్లు ఖర్చవుతుందని గతంలో అంచనా వేయగా, ఇప్పుడు దాని విలువ రూ.2,300 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. అది కూడా పూర్తికావొచి్చంది. కొన్ని అవాంతరాలున్నా, వేగంగా అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment