సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘గత 8 ఏళ్లలో రామగుండం పరిధిలో కేంద్రం అనేక అభివృద్ధి పనులు చేపట్టింది. రూ. 6,338 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునఃప్రారంభించి మోదీ స్వయంగా జాతికి అంకితం చేయడమే ఇందుకు నిదర్శనం’ అని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం రామగుండం సభలో స్వాగతోపన్యాసం చేసిన ఆయన... రాష్ట్రంలో కేంద్రం సహకారంతో ప్రతి జిల్లా, పట్టణం, గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు మోదీ సర్కారు నిధులు ఇస్తోందని చెప్పారు.
ప్రతి గ్రామ పంచాయతీలో వీధిదీపాల ఖర్చు నుంచి పారిశుద్ధ్య కార్మికుల వేతనం వరకు కేంద్రం తన వంతుగా నిధులు ఇస్తోందన్నారు. తాము రాజకీయాలు చేసే సమయంలోనే చేస్తామని, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు. ఎవరు సహకరించకున్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధే తమ ధ్యేయమన్నారు.
1.42 కోట్ల టన్నుల ధాన్యం కొంటున్నాం..
తెలంగాణ నుంచి కేంద్రం ధాన్యం కొనడం లేదని కొందరు ఆరోపణలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. 2014కు ముందు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు 24 లక్షల టన్నులు ఉంటే.. ప్రస్తుతం తమ ప్రభుత్వం 1.42 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. వాస్తవానికి 2014లో రూ. 1,360గా ఉన్న ధాన్యం క్వింటాలు మద్దతు ధరను మోదీ ప్రభుత్వం వచ్చాక.. 8 ఏళ్లలో క్వింటాలుకు రూ. 2,040 మద్దతు ధర కల్పించామన్నారు.
2014కు ముందు ధాన్యం కొనుగోలుకు రూ.3,750 కోట్లు ఖర్చు పెట్టగా ప్రస్తుతం రూ. 26,000 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. అలాగే పత్తికి 2014కు ముందు క్వింటాలుకు రూ. 3,750 మద్దతు ధర ఉండగా దాన్ని కేంద్రం రూ. 6,080కి పెంచిందని ఆయన గుర్తుచేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద వ్యవసాయానికి రైతుకు దన్నుగా ఉండేలా.. ప్రతి రైతుకూ ఏటా రూ. 6,000 పెట్టుబడి సాయం అందిస్తున్నామని వివరించారు.
2,489 కి.మీ. మేర హైవేలు నిర్మించాం..
తెలంగాణలో 2014కు ముందు 2,511 కి.మీ. జాతీయ రహదారులు ఉంటే తమ ప్రభుత్వం వచ్చాక అదనంగా 2,489 కి.మీ. జాతీయ రహదారులు ఏర్పాటు చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అలాగే రూ. 4 వేల కోట్లతో 1600 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ పనులు మొదలుపెట్టామని, ఇప్పటికే 800 మెగావాట్ల పనులు పూర్తయినట్లు ఆయన వివరించారు. ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ఫ్లోటింగ్ విద్యుదుత్పత్తి యూనిట్‌ను ఇటీవల ప్రధాని ప్రారంభించారని గుర్తుచేశారు. రామగుండంలో కార్మికులకు ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్రం అనుమతిచ్చినా రాష్ట్రం ఇంకా భూమి ఇవ్వలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment