Rfcl
-
యూరియా ఉత్పత్తి ‘గండం’ దాటేనా?
ఫెర్టిలైజర్‌సిటీ (రామగుండం): స్వదేశీతో పాటు విదేశీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థాపించిన రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో యూరియా ఉత్పత్తికి తరచూ అంతరాయం కలుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు రూ.6,350 కోట్లు వెచ్చించి కర్మాగారం నిర్మించారు. ఇందుకోసం ఇటలీ, డెన్మార్క్ నుంచి ఆధునిక యంత్ర,సామగ్రి తెప్పించారు. రోజుకి 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఆర్ఎఫ్సీఎల్ నిర్మించారు. 2023 డిసెంబర్ 31 నాటికి 8,19,344.70 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. ఇక్కడి యూరియాకు జాతీయస్థాయిలో మంచి డిమాండ్ ఉంది. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ రామగుండంలోని ఈ ప్లాంట్‌ను పర్యవేక్షిస్తుంది. పైప్లైన్లలో లీకేజీలతో ఉత్పత్తికి బ్రేక్ స్టీమ్ ఆధారంగానే ఇక్కడ యూరియా ఉత్పత్తి అవుతోంది. అయితే స్టీమ్ పైప్‌లైన్ లోపాలతో ప్రతీమూడు నెలలకోసారి ప్లాంట్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. సామర్థ్యానికి మించి పైపుల్లో స్టీమ్(ఆవిరి) సరఫరా కావడంతో తరచూ పైపులైన్లలో లీకేజీలు ఏర్పడి, యూరియా ఉత్పత్తి నిలిచిపోతోంది. గతేడాది నవంబర్ 15న ఇలాంటి సమస్య తలెత్తితే.. సుమా రు 15 రోజులపాటు మరమ్మతులు చేసి ప్లాంట్‌ను పునరుద్ధరించారు. ప్లాంట్ ప్రారంభమైన కాసేపటికే మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తడంతో మరో మూడురోజుల పాటు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. నవంబర్ 25న ఉత్పత్తి పునఃప్రారంభమై యూరియా, అమ్మోనియా ఉత్పత్తి సాఫీగానే సాగింది. కానీ, ఈనెల 9న హీట్ స్టీమ్ పైప్‌లైన్‌లో మళ్లీ సమస్య తలెత్తింది. దీంతో ఉత్పత్తి నిలిచిపోవడంతో ప్లాంట్ షట్‌డౌన్ చేశారు. ఈనెల 24లోగా పనులు పూర్తిచేసి యూరియా ఉత్పత్తి పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో గ్యాస్ ఆధారంగా నడిచే రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లి మిటెడ్ కర్మాగారం నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానం వినియోగించిన విషయం తెలిసిందే. ఇటలీ, డెన్మార్క్‌నుంచి తెచ్చిన యంత్ర, సామగ్రి గ్యారంటీ గడువు ముగిసిపోవడంతో మరమ్మతులు, నిర్వహణ భారమంతా కర్మాగారంపైనే పడుతోంది. ప్లాంట్‌పై ఒత్తిడి మన రాష్ట్రంతోపాటు ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్రల్లో యూరియాకు డిమాండ్ పెరగడంతో రామగుండం ప్లాంట్‌లో నిరంతరంగా ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్లాంట్‌లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరడం, డిమాండ్‌కు సరిపడా యూరియా ఉత్పిత్తి చేయలేకపోవడంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోందన్న వాదన వినపడుతోంది. -
ఆర్ఎఫ్సీఎల్ షట్‌డౌన్
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) కర్మాగారంలో మరమ్మతుల కార ణంగా గురువారం రాత్రి నుంచి యూరి యా ఉత్పత్తి నిలిచిపోయింది. హీటర్ సెక్ష న్ పైపులు మరమ్మతులు చేయడానికి వా రంరోజుల దాకా సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్ర వారం మరమ్మతులు ప్రారంభించారు. వానాకాలం సీజన్ కావడంతో తెలు గురాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో యూరియాకు డిమాండ్ అధికంగా ఉంది. నిత్యం సాంకేతిక సమస్యలు: ఫ్యాక్టరీలో జూన్‌లో కూడా సాంకేతిక సమ స్యలతో 20 రోజులపాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం ప్లాంట్ పునరుద్ధరించినా, రెండు రోజులకే మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జూన్ చివరివారంలో ఉత్పత్తి ప్రారంభించారు. సాంకేతిక సమ స్యలతో ఆగస్టులో ఉత్పత్తి కొంత తగ్గింది. మళ్లీ సమస్య తలెత్తడంతో కర్మా గారాన్ని తాత్కాలికంగా వారం పాటు షట్‌డౌన్ చేసి మరమ్మతుల అనంతరం ఉత్పత్తి పునరుద్ధరిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కర్మాగారంలో గడిచిన 4 నెలల్లో 5,01,597.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. 2023– 24లో 12.70 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలనేది టార్గెట్. -
Telangana: రాష్ట్ర అభివృద్ధిపై... మేము రాజకీయాలు చేయం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘గత 8 ఏళ్లలో రామగుండం పరిధిలో కేంద్రం అనేక అభివృద్ధి పనులు చేపట్టింది. రూ. 6,338 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునఃప్రారంభించి మోదీ స్వయంగా జాతికి అంకితం చేయడమే ఇందుకు నిదర్శనం’ అని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం రామగుండం సభలో స్వాగతోపన్యాసం చేసిన ఆయన... రాష్ట్రంలో కేంద్రం సహకారంతో ప్రతి జిల్లా, పట్టణం, గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు మోదీ సర్కారు నిధులు ఇస్తోందని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలో వీధిదీపాల ఖర్చు నుంచి పారిశుద్ధ్య కార్మికుల వేతనం వరకు కేంద్రం తన వంతుగా నిధులు ఇస్తోందన్నారు. తాము రాజకీయాలు చేసే సమయంలోనే చేస్తామని, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు. ఎవరు సహకరించకున్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధే తమ ధ్యేయమన్నారు. 1.42 కోట్ల టన్నుల ధాన్యం కొంటున్నాం.. తెలంగాణ నుంచి కేంద్రం ధాన్యం కొనడం లేదని కొందరు ఆరోపణలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. 2014కు ముందు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు 24 లక్షల టన్నులు ఉంటే.. ప్రస్తుతం తమ ప్రభుత్వం 1.42 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. వాస్తవానికి 2014లో రూ. 1,360గా ఉన్న ధాన్యం క్వింటాలు మద్దతు ధరను మోదీ ప్రభుత్వం వచ్చాక.. 8 ఏళ్లలో క్వింటాలుకు రూ. 2,040 మద్దతు ధర కల్పించామన్నారు. 2014కు ముందు ధాన్యం కొనుగోలుకు రూ.3,750 కోట్లు ఖర్చు పెట్టగా ప్రస్తుతం రూ. 26,000 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. అలాగే పత్తికి 2014కు ముందు క్వింటాలుకు రూ. 3,750 మద్దతు ధర ఉండగా దాన్ని కేంద్రం రూ. 6,080కి పెంచిందని ఆయన గుర్తుచేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద వ్యవసాయానికి రైతుకు దన్నుగా ఉండేలా.. ప్రతి రైతుకూ ఏటా రూ. 6,000 పెట్టుబడి సాయం అందిస్తున్నామని వివరించారు. 2,489 కి.మీ. మేర హైవేలు నిర్మించాం.. తెలంగాణలో 2014కు ముందు 2,511 కి.మీ. జాతీయ రహదారులు ఉంటే తమ ప్రభుత్వం వచ్చాక అదనంగా 2,489 కి.మీ. జాతీయ రహదారులు ఏర్పాటు చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అలాగే రూ. 4 వేల కోట్లతో 1600 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ పనులు మొదలుపెట్టామని, ఇప్పటికే 800 మెగావాట్ల పనులు పూర్తయినట్లు ఆయన వివరించారు. ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ఫ్లోటింగ్ విద్యుదుత్పత్తి యూనిట్‌ను ఇటీవల ప్రధాని ప్రారంభించారని గుర్తుచేశారు. రామగుండంలో కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్రం అనుమతిచ్చినా రాష్ట్రం ఇంకా భూమి ఇవ్వలేదని విమర్శించారు. -
సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు : ప్రధాని మోదీ
-
రామగుండం వేదికగా రైతులకు శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ
(రామగుండం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘‘తెలంగాణలో కొందరు రాజకీయ స్వార్థంతో వదంతులు పుట్టిస్తున్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ అబద్ధాలు వారికే ఇబ్బంది అవుతాయని తెలియదేమో. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51%, కేంద్రం వాటా 49%. అలాంటప్పుడు కేంద్రం ఎలా విక్రయిస్తుంది? ఏమైనా చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన ఏదీ కేంద్రం వద్ద లేదు. ఇలా అబద్ధాలు చెప్పేవారిని హైదరాబాద్‌లోనే ఉంచండి..’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నకిలీ ఎరువులు, బ్లాక్ మార్కెటింగ్ వంటి సమస్యల నుంచి రైతులను గట్టెక్కించేందుకు దేశవ్యాప్తంగా ఒకేలా ‘భారత్’ బ్రాండ్‌తో యూరియాను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. శనివారం రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ మాట్లాడారు. ‘ఈ సభకు విచ్చేసిన రైతులు, సోదర, సోదరీమణులకు నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. తర్వాత హిందీలో మాట్లాడారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రామగుండం నేల నుంచి యావత్ తెలంగాణకు నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ భాగస్వాములైన రైతులకు స్వాగతం. ఇక్కడ ప్రారంభించిన ఎరువుల ఫ్యాక్టరీ, రైలు, రోడ్డు మార్గాలతో వ్యవసాయం, వాణిజ్య వ్యాపార రంగాలు అభివృద్ధి చెంది.. తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైతులు, యువతకు ఎంతో మేలు కలుగుతుంది. ఆర్థిక పరిపుష్టి సాధిస్తాం. మూడు జాతీయ రహదారుల విస్తరణతో చెరుకు, పసుపు, ఇతర రైతులకు మేలు చేకూరుతుంది. ఒకే బ్రాండ్ యూరియాతో.. దశాబ్దాలుగా వివిధ బ్రాండ్ల పేరిట నకిలీ ఎరువులు, నల్ల బజారులో విక్రయాలతో దేశంలోని రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. దీనికి పరిష్కారంగా ఇక నుంచి దేశంలో కేవలం ఒకే ‘భారత్’ బ్రాండ్ యూరియాను నాణ్యత, తక్కువ ధరతో కేంద్రం అందుబాటులోకి తెస్తోంది. రామగుండం ప్లాంట్ ద్వారా తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల రైతులకు ఎరువుల సరఫరా జరుగుతుంది. రామగుండం ప్రాంతంలో రవాణా, లాజిస్టిక్ రంగాలు అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ భారత్‌లో పెంచలేదు. ప్రతి యూరియా బస్తాపై రూ.1,472, డీఏపీ బస్తాపై రూ.2,500 కేంద్రం సబ్సిడీగా అందిస్తోంది. ఎరువుల కోసం 8 ఏళ్లలో దాదాపు రూ.10 లక్షల కోట్లు, ఈ ఏడాది రెండున్నర లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్నాం. శరవేగంగా అభివృద్ధి కరోనా, యుద్ధాలు, ఇతర ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉద్భవించే దిశగా వేగంగా పరుగులు పెడుతోంది. ఇంతకుముందటి 30 ఏళ్లతో పోలిస్తే గత 8 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో ఎక్కువగా అభివృద్ధి సాధించింది. ఎనిమిదేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతే ఇందుకు సాక్ష్యం. దేశంలో పాలన తీరు మారింది. సర్కారీ ప్రక్రియలు, ఆలోచనలు మారాయి. మౌలిక సదుపాయాలు వృద్ధి చెందాయి. దేశాభివృద్ధికి దోహదపడే మరో ముఖ్యమైన అంశం రవాణా సదుపాయాల పెంపు. అందుకే అన్ని రాష్ట్రాల్లో రహదారులు, రైల్వే, ఎయిర్ వే, వాటర్ వే అభివృద్ధి పనులు చేపట్టాం. గత ఎనిమిదేళ్లలో రెట్టింపైన జాతీయ రహదారుల కనెక్టివిటీ.. అన్ని రంగాల్లో వృద్ధికి మార్గం సుగమం చేసింది. భద్రాద్రి–సత్తుపల్లి రైల్వేలైన్‌ను రూ.990 కోట్లతో నాలుగేళ్లలో పూర్తి చేశాం. తక్కువ ఖర్చుతో బొగ్గు రవాణా వల్ల విద్యుత్ రంగంలో, వ్యాపార రంగంలో అనేక లాభాలు కలుగుతాయి. జాతీయ రహదారుల విస్తరణ ద్వారా హైదరాబాద్–వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్సై్టల్ పార్క్, పసుపు, మిర్చి రైతులకు ప్రయోజనం కలుగుతుంది..’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒక రైలు మార్గం.. మూడు హైవేలు శనివారం రామగుండం ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో ప్రజల సమక్షంలో రిమోట్ కంట్రోల్ ద్వారా ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్, భద్రాచలం– సత్తుపల్లి కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో రూ.2,268 కోట్లతో నూతనంగా విస్తరిస్తున్న మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు (హైవే నంబర్ 765డీజీ), బోధన్ నుంచి బాసర మీదుగా భైంసా వరకు (హైవే నంబర్ 161 బీబీ), సిరోంచ నుంచి మహదేవ్పూర్ వరకు (హైవే నంబర్ 353 సి) మూడు నేషనల్ హైవేల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లో ఉన్న కొందరికి ఈ రాత్రి నిద్రపట్టదేమో! ‘రామగుండం సభకు భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరుకావడంతో హైదరాబాద్‌లో కొందరికి ఇవాళ నిద్ర పట్టదేమో’ అని టీఆర్ఎస్ పెద్దలను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని, తెలంగాణ అభివృద్ధి కోసం మీ అందరి ఆశీర్వాదం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
RFCL ప్లాంట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
-
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్న తెలంగాణ అభివృద్ధి ఆగదు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం.. మూడు నేషనల్ హైవేలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, పెద్దపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. రూ.6,338 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగింది. ఈ క్రమంలోనే భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వేలైన్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కాగా, రూ.990 కోట్లతో 54.10 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారు. అలాగే, మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి, బోధన్-బాసర-భైంసా, సిరోంచా-మహదేవ్పూర్ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇక, రూ.2,268 కోట్లతో మూడు జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగనున్నాయి. -
‘సింగరేణి ప్రైవేటీకరణతో కేంద్రానికి సంబంధం లేదు’
సాక్షి, పెద్దపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘ఈ ఫ్యాక్టరీతో ఎరువుల కొరత తీరుతుంది. యూరియా బస్తాపై కేంద్రం రూ. 1470 సబ్సిడీ ఇస్తోంది. 2014లో ధాన్యానికి మద్దతు ధర రూ. 1360 ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రూ.2040కి ధరను మోదీ పెంచారు. గతంలో తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు రూ. 3404 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు 26వేల కోట్లు కేటాయించాము. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తూ రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మిస్తాము. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సింగరేణి ప్రైవేటీకరణతో కేంద్రానికి సంబంధం లేదు. ప్రతీ గ్రామానికి మోదీ ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టే.. గ్రామీణ ప్రాంతాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. రైతుల అకౌంట్లలో ఏడాదికి రూ. 6వేలు జమ చేస్తున్నాము’ అని అన్నారు. -
RFCL ప్లాంట్ ను సందర్శించిన ప్రధాని మోదీ
-
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే మోదీ పర్యటనపై పలు చోట్ల నిరసనలు, నో ఎంట్రీ అంటూ ఫ్లెక్సీలు వంటివి కనిపించాయి. అయితే, ఇదంతా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ కుట్రగా ఆరోపించింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన ముగించుకుని మధ్యాహ్నానికి తెలంగాణ చేరుకోనున్న మోదీ.. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రానికి సుడిగాలి పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై మోదీ ఎలాంటి కామెంట్స్ చేస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణలో మోదీ పర్యటన వివరాలు.. ► మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. ► మధ్యాహ్నం 1.40 నుంచి 2 గంటల వరకు ఎయిర్ పోర్ట్ బయట పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. ► 2.15 గంటలకు రామగుండం బయలుదేరతారు. ► 3.30 నుంచి 4 గంటలకు RFCL ప్లాంట్ సందర్శిస్తారు. ► 4.15 నుంచి 5.15 వరకు రామగుండంలో నిర్వహించే సభలో మాట్లాడతారు. ► 5.30కు రామగుండం నుంచి బేగంపేట బయలుదేరుతారు మోదీ. ► 6.35కు బేగంపేట చేరుకుంటారు. ► 6.40కి బేగంపేట నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు మోదీ. ఇదీ చూడండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. 'మునుగోడు' వేడి చల్లారకముందే.. -
RFCL: వెయ్యి ఎకరాల విస్తీర్ణం.. 5 రాష్ట్రాలకు బాసట.. సగం వాటా తెలంగాణకే
సాక్షి, కరీంనగర్: తెలంగాణ సిగలో మరో మణిహారంగా నిలవనున్న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని (ఆర్ఎఫ్సీఎల్) శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అడుగడుగునా ఏర్పడిన అవాంతరాలను అధిగమిస్తూ పునరుద్ధరించిన ఆర్ఎఫ్సీఎల్ జోరుగా ఉత్పత్తి కొనసాగిస్తూ తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల రైతులకు బాసటగా నిలుస్తోంది. దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మూతపడిన ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించి 2015లో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా రామగుండంలో మూతపడిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కర్మాగారాన్ని కేంద్రప్రభుత్వం రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) పేరుతో పునరుద్ధరించింది. 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ చేతులమీదుగా ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక గత మార్చి 22 నుంచి వాణిజ్యకార్యకలాపాలు ప్రారంభించారు. ఉత్పత్తిలో సగం వాటా తెలంగాణ రాష్ట్ర అవసరాలకే కేటాయించనున్నారు. వేప నూనె, విదేశీ సాంకేతికతతో.. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆర్ఎఫ్సీఎల్ ప్రాజెక్టు విలువ రూ.6,338.16 కోట్లు కాగా, వార్షిక ఉత్పత్తి లక్ష్యం 12.75 లక్షల మెట్రిక్ టన్నులు. ఆర్ఎఫ్సీఎల్ అమ్మోనియాను డెన్మార్క్ దేశానికి చెందిన హల్టోర్ కంపెనీ, యూరియాను ఇటలీ దేశానికి చెందిన సాయ్‌పేయ్ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేస్తోంది. గ్యాస్‌ను ఇంధనంగా మార్చి నీటి నుంచి ఆవిరి ఉత్పత్తి చేసి, వేపనూనెతో యూరియా, అమ్మోనియా తయారుచేయడం ఆర్ఎఫ్సీఎల్ ప్రత్యేకత. చదవండి: మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..! -
ఆర్ఎఫ్సీఎల్ అధికారులతో అఖిలపక్ష కమిటీ భేటీ
ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్టు ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవినీతితోపాటు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ముంజ హరీశ్ కుటుంబ పరిస్థితిపై అఖిలపక్ష కమిటీ గురువారం యాజమాన్యంతో చర్చించింది. దళారుల చేతిలో మోసపోయి ఇటీవల ఆత్మ హత్య చేసుకున్న హరీశ్ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పించాలని, మోసపోయిన కార్మికులకు తిరిగి ఉపాధి కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే చందర్, అఖిలపక్ష కమిటీ సభ్యులు ఆర్ఎఫ్సీఎల్ అధికారులను కోరా రు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆర్ఎఫ్సీఎల్ అధికారులు హరీశ్ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధి చూపేందుకు అంగీకరించారు. -
ఆర్ఎఫ్సీఎల్ కథ కంచికేనా..? బాధితులకు డబ్బులు అందుతాయా!
సాక్షి, కరీంనగర్: రామగుండం ఫెర్టిలైజర్స్ కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో కోట్లు దండుకున్న నలుగురు దళారులను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు డబ్బులు అందుతాయా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బాధితులతో రెండురోజులపాటు మాట్లాడి భరోసా కల్పించారు. కర్మాగారంలో శాశ్వత ఉద్యోగాల పేరుతో సుమారు రూ.45 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసిన దళారులు.. బాధితుల వద్ద ఎలాంటి పత్రాలూ లేకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం నోటిమాట ఆధారంగానే బాధితులు రూ.లక్షలు దళారుల చేతిలో పోశారు. దీంతో కార్మికుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో కొందరు “మీకు ఉద్యోగం కల్పించాం.. డబ్బులిచ్చేది లేదు..’ అని బాధితులతో గొడవకు దిగుతున్న సందర్భాలూ ఉన్నాయి. వారం క్రితం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దళారిపై పెట్రోల్ పోసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. తాజాగా శుక్రవారం ముంజ హరీశ్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు దళారులుగా ఉన్న నలుగురుపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. చదవండి: కు.ని.ఆపరేషన్‌తో నలుగురు మృతి.. ఇంతకూ ట్యూబెక్టమీ అంటే ఏంటి? దళారులు ఎంతమంది..? ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగ నియామకంలో ఎంతమంది దళారులు, మధ్యవర్తులు ఉన్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. కొత్త కాంట్రాక్టర్ కార్మికులను తొలగించడంతో మోసపోయామని గ్రహించిన కార్మికులు ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రమేయం ఉండడంతో అధికారులు చర్యలు చేపట్టడంలో జాప్యం చేశారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. పర్మినెంట్ హమాలి పేరుతో నగదు దండుకున్న కార్మిక సంఘం నాయకుడిపై ఇప్పటివరకూ కేసు నమోదు కాలేదు. వీరితోపాటు మరికొందరు అధికార, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ఉన్నారని ప్రచారం జపరుగుతోంది. ఎవరు చెల్లిస్తారు..? బాధితులకు ఇప్పుడు నగదు ఎవరు చెల్లిస్తారనే వ్యవహారంలో స్పష్టత లేకుండా పోయింది. రెండు రోజులుగా కోరుకంటి చందర్ తన క్యాంపు కార్యాలయంలో బాధితులతో సమావేశం నిర్వహించారు. ప్రధాన దళారులు అధికార పార్టీ నాయకులు కావడంతో బాధితులకు నగదు చెల్లించేలా కృషి చేస్తారో లేదో.. వేచి చూడాల్సి ఉంది. -
నీ పిల్లలు ఏమైపోవాలె బిడ్డా..!
ప్రతిరోజూ నాన్నా నాన్నా అని పిలిచే తన తండ్రికి ఏం జరిగిందో తెలియక ఆ పిల్లలు అమాయకంగా చూస్తుంటే అందరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి ‘మాలాగా కూలీ నాలీ చేసుకొని బతకకుండా... ఉద్యోగం వస్తే కొడుకుకు కష్టాలు తప్పుతాయనుకున్న. అప్పు తెచ్చి డబ్బులు ఇచ్చిన. ఉద్యోగం వచ్చిందని అందరం సంబరపడ్డం. నాలుగు నెలలకే ఆ ఉద్యోగం పోయింది. మోసపోయేసరికి.. నా కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. నువ్వుపోయినవు.. నీ పిల్లలు ఏమైపోవాలె బిడ్డా..’ అంటూ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హరీశ్ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కలకాలం తోడుంటానని బాసలు చేసి అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ మహిళ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు రోడ్డున పడ్డారు. భర్త అకాలమరణం తట్టుకోలేక భార్య రవళి పిల్లలను ఒళ్లో పెట్టుకుని రోదించిన తీరు అందరినీ కదిలించింది. ఉద్యోగం వచ్చిందని ఎంతో ఆశతో వెళ్లిన ఆ యువకుడు.. విగతజీవిగా తిరిగిరావడంతో విషాదం అలుముకుంది. కరీంనగర్‌క్రైం/కరీంనగర్‌టౌన్/శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ గ్రామానికి చెందిన ముంజ శోభ–రవి దంపతులకు ఒక్కగానొక్క సంతానం ముంజ హరీశ్(32). అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగం ఇపిస్తానని ఓ దళారీ చెప్పడంతో ఆశపడి, అప్పుచేసి రూ.7 లక్షల వరకు ముట్టజెప్పాడు. ఉద్యోగం వచ్చినప్పటికీ నాలుగు నెలల్లోనే తొలగించడంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్థాపానికి గురయ్యాడు. తాను మోసపోయానని కుమిలిపోయాడు. ఉద్యో గం ఎలాగూ లేదు.. కనీసం తాను ఇచ్చిన డబ్బులైనా తిరిగి ఇవ్వాలని దళారులను వేడుకున్నాడు. వారు చేతులెత్తేయడంతో పరిస్థితిని తలుచుకొని కుంగిపోయిన హరీశ్ శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ అయింది. తన వాట్సాప్ స్టేటస్‌లో మా త్రం తనకు డబ్బులు వస్తే తన కుటుంబ సభ్యులకు ఇవ్వాల ని.. బై.. బై.. అంటూ.. తాను ఏదో చేసుకుంటున్నట్లు పోస్ట్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో పెద్దపల్లి పోలీసులను ఆశ్రయించారు. వారు వెంటనే లొకేషన్ ట్రేస్ చేసి శని వారం ఉదయం కమాన్‌పూర్ మండలం సిద్దపల్లి శివారులోని బావిలో మృతదేహాన్ని గుర్తించారు. ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత హరీశ్ మృతదేహాన్ని పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు వందల సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. గొడవలు జరిగే పరిస్థితి ఉందని భావించిన పోలీసులు అప్రమత్తమై అదనపు బలగాలను ఆసుపత్రి వద్ద మోహరించారు. అయినప్పటికీ ఆగ్రహానికి గురైన బంధువులు, గ్రామస్తుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మిన్నంటిన రోదనలు చిన్న వయస్సులోనే ఆత్మహత్య చేసుకుని కుటుంబానికి దూరమైన హరీశ్‌ను తలచుకుంటూ కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. ఆసుపత్రి ఆవరణలో బంధువుల రోదనలు మిన్నంటాయి. హరీశ్ ఆత్మహత్య విషయం తెలిసి ఆసుపత్రికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ కాంగ్రెస్ ఇన్చార్జి ఆది శ్రీనివాస్, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మృతుడి బంధువులు, గ్రామస్తులు, స్నే హితులతో కలిసి మంచిర్యాల చౌరస్తాలో సుమా రు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నేతలను సీటీసీకి తరలించారు. మోహరించిన పోలీసులు పోలీసుల పహారా మధ్య శనివారం ముంజ హరీశ్ మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆçస్పత్రినుంచి అంబాల్‌పూర్ గ్రామానికి తీసుకువచ్చారు. కారకులపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్–వరంగల్ రహదారిపై రాస్తారోకో చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్ తరలించారు. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహంపై పడి రోదించారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తుండడంతో హుజూరాబాద్ ఏసీపీ వెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో రూరల్ సీఐ జనార్దన్, ఎస్సై చంద్రశేఖర్, 60 మంది పోలీసులు మోహరించారు. -
‘రామగుండం’లో కొలువుల స్కాం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)లో జరిగిన నియామకాల వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. ఫ్యాక్టరీలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వందలాది మంది నిరుద్యోగుల నుంచి రూ. కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ ఆరోపణలు రావడంతో రామగుండంలో రాజకీయం వేడెక్కుతోంది. ఇటీవల ఆర్ఎఫ్సీఎల్ నుంచి ఉద్యోగులు తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ పలువురు నిరుద్యోగులు నిరసనలకు దిగడం.. పలు కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు వారికి అండగా నిలవడంతో ఈ ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. అసలేం జరిగింది? ఆర్ఎఫ్సీఎల్ ఎరువుల కర్మాగారం గతేడాది పునఃప్రారంభమైంది. కర్మాగారంలో పనిచేసేందుకు వందలాది మంది సిబ్బందిని నియమించారు. ఒక ప్రముఖ కంపెనీ ఏడాది కోసం మ్యాన్‌పవర్‌ను సరఫరా చేసే కాంట్రాక్టు పొందింది. వారి నుంచి మరో కంపెనీ సబ్‌కాంట్రాక్ట్ సంపాదించింది. ఈ సంస్థ ఫ్యాక్టరీ ప్రారంభమైన సమయంలో 798 మందిని లోడింగ్, అన్లోడింగ్ కోసమని నియమించుకుంది. వారికి 798 గేట్పాసులు కూడా ఇచ్చింది. ఏడాది తరువాత సదరు సంస్థ కాంట్రాక్టు పూర్తవడంతో మరో కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. కొత్తగా వచ్చిన సంస్థ అవసరానికి మించి కార్మికులు ఉన్నారని వందలాది మందిని తప్పించింది. దీంతో కొలువులు కోల్పోయిన వారంతా ఆందోళన ప్రారంభించారు. ఈ ఉద్యోగాల కోసం కొందరు నాయకులు తమ వద్ద రూ. లక్షలు వసూలు చేశారని తీరా ఇప్పుడు రోడ్డున పడేస్తే ఎలా? అంటూ నిరసనలకు దిగుతున్నారు. నిరుద్యోగులు ఏమంటున్నారు? అధికార పార్టీ నేతలుగా చెప్పుకున్న కొందరు దళారులు ఈ నియామకాల్లో చక్రం తిప్పారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్మాగారంలో టెక్నికల్ ఉద్యోగాలు ఇస్తామని, అవి శాశ్వత కొలువులని, కుటుంబాలకు క్వార్టర్, కుటుంబ సభ్యులకు ఉచిత విద్య, వైద్యం సదుపాయాలు, నెలనెలా రూ. 25 వేల వేతనం ఉంటాయని నమ్మబలికారని వాపోతున్నారు. ఉద్యోగం చేసినంత కాలం స్కిల్డ్ లేబర్ కింద రోజుకు రూ. 610 చెల్లించారని, తీరా ఏడాది తర్వాత సిబ్బంది అధికంగా ఉన్నారని చెప్పి 498 మందిని తప్పించారని వాపోతున్నారు. ఇప్పుడు కేవలం 300 మందే మిగిలారని, వారికి అన్‌స్కిల్డ్ లేబర్ కింద రోజుకు రూ.440 మాత్రమే చెల్లిస్తున్నారని వివరించారు. 498 మందిలో దాదాపు 400 మంది కార్మికులు అధికార పార్టీకి చెందిన పలువురు నేతలకు రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల చొప్పున ముట్టజెప్పారని ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేశ్ ఆరోపిస్తున్నారు. రోడ్డున పడ్డ ఉద్యోగులంతా ఆర్ఎఫ్సీఎల్ బాధితుల సంఘంగా ఏర్పడ్డారు. క్రమంగా నిరసనలను ముమ్మరం చేస్తున్నారు. త్వరలోనే గవర్నర్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేపై విమర్శలతో! మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్య నారాయణ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై విమర్శలు చేయడం వివాదం కొత్తమలుపు తిరిగింది. ఆయ నకు ఈ వ్యవహారంతో సంబంధముందని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా లో పెట్టిన పోస్టులు వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు దేల్చేందుకు ఎమ్మెల్యే 18 మందితో కూడిన నిజనిర్ధారణ కమిటీని వేశారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేసినా, అసత్యాలు ప్రచారం చేసినా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. మరోవైపు బాధితులు గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు లిచ్చి మోసపోయా మంటున్న వారిలో సుమారు 240 మంది వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. తమ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేదాకా ఉద్యమం కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. -
రామగుండంలో 3.74 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి
ఫెర్టిలైజర్‌సిటీ(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో 2021–22 సంవత్సరం 3,74,728.32 టన్ను ల యూరియా ఉత్పత్తి అయిందని ఆ కర్మాగారం సీజీఎం విజయ్‌కుమార్ బంగార్ మంగళవారం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించిన ఈ కర్మాగారం వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించి ఏడాది పూర్తయింది. దేశీయంగా ఎరువుల కొరత తీర్చడమే ఆర్ఎఫ్సీఎల్ ఉద్దేశం. ఈ ప్లాంట్‌లో ప్రతిరోజూ 2,200 టన్నుల అమ్మో నియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. కర్మాగారం వాణిజ్య ఉత్పత్తుల్లో తెలంగాణకు 2,11,073.13, ఆంధ్రప్రదేశ్‌కు 1,00,321.11, కర్ణాటకకు 63,334.08 టన్నుల యూరియా సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఎరువుల కొరత తగ్గించేందుకు దేశవ్యాప్తంగా మూతపడిన ఎరువుల కర్మాగారాలను కేంద్రం పునరుద్ధరించిందని, వాటిల్లో ఆర్ఎఫ్సీఎల్ (నాటి ఎఫ్‌సీఐ) కూడా ఒకటని తెలిపారు. -
‘ఆర్ఎఫ్సీఎల్’లో లీకవుతున్న గ్యాస్
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో వారంరోజులుగా అమ్మోనియా, యూరియా ఉత్పత్తిపై ట్రయల్ ర న్ నిర్వహిస్తున్నారు. అమ్మోనియా ప్లాంట్‌లో పై ప్లైన్ నిర్మాణంలో ఏర్పడిన సమస్య కారణంగా క ర్మాగారం నుంచి గ్యాస్ లీకవుతోంది. వారం క్రితం నైట్రోజన్ పైప్ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మార్చి నెలాఖరులో యూరియా ప్లాంట్‌ను షట్‌డౌన్ చేశారు. 45 రోజుల మరమ్మతు అ నంతరం తిరిగి యూరియా ప్లాంట్‌లో ఉత్పత్తిపై అ ర్ధరాత్రి సమయంలో ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారు. భయం గుప్పిట్లో ప్రభావిత గ్రామాలు.. కర్మాగారానికి ఆనుకుని వీర్లపల్లి, లక్ష్మీపురం, ఎల్కలపల్లి గేట్, విఠల్‌నగర్, శాంతినగర్, తిలక్‌నగర్, గౌతమినగర్, చైతన్యపురికాలనీ, సంజయ్‌గాంధీనగర్ ఉంటాయి. ట్రయల్ రన్ సమయంలో లీకవుతున్న గ్యాస్ సమీప గ్రామాలను చుట్టేస్తోంది. దీంతో ఊపిరాడడం లేదని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. హై పవర్ టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలి రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో ట్రయల్ రన్ సమయంలో ప్లాంట్ నుంచి రెండు రోజులుగా బయటకు వస్తున్న గ్యాస్‌తో ప్రభావిత ప్రాంతాలలో శ్వాస ఆడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిర్మాణ క్రమంలో నాణ్యత పాటించకపోవడంతోనే నిత్యం ఇలాంటివి జరుగుతున్నాయని ఆర్ఎఫ్సీఎల్ వర్కింగ్ యూనియన్ ప్రెసిడెంట్ అంబటి నరేష్ అన్నారు. కేంద్ర ఎరువులు రసాయనాల శాఖామంత్రి స్పందించి కర్మాగా రంలో జరుగుతున్న ప్రమాదాలపై హై పవర్ టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు చేపట్టాలి రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో రెండురోజులుగా వెలువడుతున్న నైట్రోజన్ గ్యాస్‌తో ప్రభావిత గ్రామాలతోపాటు గోదావరిఖని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మంగళవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇంజినీర్ కె.రవిదాస్‌కు వినతిపత్రం అందించారు. ప్లాంట్ నుంచి వెలువడుతున్న గ్యాస్‌తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలుష్య నియంత్రణ అధికారికి వినతులు జ్యోతినగర్: ఆర్ఎఫ్సీఎల్లో అమ్మోనియా గ్యాస్ లీకేజీపై సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫైట్‌ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్, ఉపాధ్యక్షుడు కొమ్మ చందు యాదవ్ ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి రవిదాస్‌కు మంగళవారం వినతిపత్రం అందించారు. సోమవారం ఉదయం గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు గంటపాటు వాసనతో ఉలిక్కిపడ్డారని, పెంచికల్‌పేట, లక్ష్మీపురం, వీర్లపల్లిలో ప్రభావం అధికంగా ఉందని, గౌతమినగర్, ఇందిరానగర్, తిలక్‌నగర్, విఠల్‌నగర్, అడ్డగుంటపల్లి, ఐదో ఇంక్లైన్, గోదావరిఖని, లక్ష్మీనగర్, కళ్యాణ్‌నగర్ వరకూ గ్యాస్ వ్యాపించిందని పేర్కొన్నారు. అమ్మోనియం లీక్ అవుతున్నా యాజమాన్యం స్పందించడం లేదన్నారు. దీనికి కాలుష్య నియంత్రణ అధికారి రవిదాస్ విచారణ చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
'తెలంగాణకే తలమానికం ఆర్ఎఫ్సీఎల్'
సాక్షి, పెద్దపల్లి: రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్) నిర్మాణ పనులను గురువారం కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి సదానందగౌడ పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణకే తలమానికం రామగుండం ఎరువుల కర్మాగారం' అని అన్నారు. మరో నాలుగు నెలల్లో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దక్షిణ భారత రైతులకు ఎరువుల కొరత లేకుండా కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా సదానందగౌడ చెప్పుకొచ్చారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాల కల్పనకు డిసెంబర్ 13న అధికారికంగా నోటిఫికేషన్ వెలువడనుందనీ ఆయన ప్రకటించారు. స్థానికులకు ఉద్యోగాల విషయమై కేంద్రంతో చర్చించి న్యాయం చేస్తామని ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. -
ఆర్ఎఫ్సీఎల్లో 2018 నుంచి ఉత్పత్తి
పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ గోదావరిఖని : రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) పనులను 2018 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించేలా చూస్తామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఆర్ఎఫ్సీఎల్లో జరుగుతున్న పనులను ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. పనుల పురోగతి గురించి డీజీఎం విజయ్‌కుమార్ వివరించారు. అనంతరం ప్లాంట్ నిర్మాణం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత తెలంగాణలో ఎరువుల కొరత ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్‌కు అవసరమైన నీటిని, విద్యుత్‌ను అందించేందుకు సహకారం అందిస్తోందన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ప్లాంట్‌లో పనులు కొంత నెమ్మదిగా సాగుతున్నాయని, వర్షాకాలం తర్వాత వేగంగా పుంజుకుంటాయని ఆయన తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్కు రాష్ట్ర పరిశ్రమల శాఖ నుంచి సంపూర్ణ సహకారం అందించేలా మంత్రి కేటీఆర్‌ను కోరుతామన్నారు. కర్మాగారంలో ఉద్యోగాల కోసం స్థానిక నిరుద్యోగ యువత ఎదురుచూస్తోందన్నారు. ఈ నేపథ్యంలో పనుల కోసం గ్లోబల్ టెండర్లను పిలిచినా.. స్థానికంగా ఉన్న వారికి సబ్ కాంట్రాక్ట్‌లు అప్పగించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేజ్–1లో భాగంగా ఎన్టీపీసీ నిర్మిస్తున్న 1600 మెగావాట్ల ప్లాంట్‌లో కూడా స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆయన కోరారు.