ధర్నా చేస్తున్న ఆర్‌ఎఫ్‌సీఎల్ బాధితులు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో జరిగిన నియామకాల వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. ఫ్యాక్టరీలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వందలాది మంది నిరుద్యోగుల నుంచి రూ. కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ ఆరోపణలు రావడంతో రామగుండంలో రాజకీయం వేడెక్కుతోంది. ఇటీవల ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి ఉద్యోగులు తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ పలువురు నిరుద్యోగులు నిరసనలకు దిగడం.. పలు కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు వారికి అండగా నిలవడంతో ఈ ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది.
అసలేం జరిగింది?
ఆర్‌ఎఫ్‌సీఎల్ ఎరువుల కర్మాగారం గతేడాది పునఃప్రారంభమైంది. కర్మాగారంలో పనిచేసేందుకు వందలాది మంది సిబ్బందిని నియమించారు. ఒక ప్రముఖ కంపెనీ ఏడాది కోసం మ్యాన్‌పవర్‌ను సరఫరా చేసే కాంట్రాక్టు పొందింది. వారి నుంచి మరో కంపెనీ సబ్‌కాంట్రాక్ట్ సంపాదించింది. ఈ సంస్థ ఫ్యాక్టరీ ప్రారంభమైన సమయంలో 798 మందిని లోడింగ్, అన్‌లోడింగ్ కోసమని నియమించుకుంది.
వారికి 798 గేట్‌పాసులు కూడా ఇచ్చింది. ఏడాది తరువాత సదరు సంస్థ కాంట్రాక్టు పూర్తవడంతో మరో కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. కొత్తగా వచ్చిన సంస్థ అవసరానికి మించి కార్మికులు ఉన్నారని వందలాది మందిని తప్పించింది. దీంతో కొలువులు కోల్పోయిన వారంతా ఆందోళన ప్రారంభించారు. ఈ ఉద్యోగాల కోసం కొందరు నాయకులు తమ వద్ద రూ. లక్షలు వసూలు చేశారని తీరా ఇప్పుడు రోడ్డున పడేస్తే ఎలా? అంటూ నిరసనలకు దిగుతున్నారు.
నిరుద్యోగులు ఏమంటున్నారు?
అధికార పార్టీ నేతలుగా చెప్పుకున్న కొందరు దళారులు ఈ నియామకాల్లో చక్రం తిప్పారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్మాగారంలో టెక్నికల్ ఉద్యోగాలు ఇస్తామని, అవి శాశ్వత కొలువులని, కుటుంబాలకు క్వార్టర్, కుటుంబ సభ్యులకు ఉచిత విద్య, వైద్యం సదుపాయాలు, నెలనెలా రూ. 25 వేల వేతనం ఉంటాయని నమ్మబలికారని వాపోతున్నారు. ఉద్యోగం చేసినంత కాలం స్కిల్డ్ లేబర్ కింద రోజుకు రూ. 610 చెల్లించారని, తీరా ఏడాది తర్వాత సిబ్బంది అధికంగా ఉన్నారని చెప్పి 498 మందిని తప్పించారని వాపోతున్నారు.
ఇప్పుడు కేవలం 300 మందే మిగిలారని, వారికి అన్‌స్కిల్డ్ లేబర్ కింద రోజుకు రూ.440 మాత్రమే చెల్లిస్తున్నారని వివరించారు. 498 మందిలో దాదాపు 400 మంది కార్మికులు అధికార పార్టీకి చెందిన పలువురు నేతలకు రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల చొప్పున ముట్టజెప్పారని ఆర్‌ఎఫ్‌సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేశ్ ఆరోపిస్తున్నారు. రోడ్డున పడ్డ ఉద్యోగులంతా ఆర్‌ఎఫ్‌సీఎల్ బాధితుల సంఘంగా ఏర్పడ్డారు. క్రమంగా నిరసనలను ముమ్మరం చేస్తున్నారు. త్వరలోనే గవర్నర్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఎమ్మెల్యేపై విమర్శలతో!
మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్య నారాయణ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై విమర్శలు చేయడం వివాదం కొత్తమలుపు తిరిగింది. ఆయ నకు ఈ వ్యవహారంతో సంబంధముందని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా లో పెట్టిన పోస్టులు వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు దేల్చేందుకు ఎమ్మెల్యే 18 మందితో కూడిన నిజనిర్ధారణ కమిటీని వేశారు.
మరోసారి ఇలాంటి ఆరోపణలు చేసినా, అసత్యాలు ప్రచారం చేసినా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. మరోవైపు బాధితులు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు లిచ్చి మోసపోయా మంటున్న వారిలో సుమారు 240 మంది వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. తమ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేదాకా ఉద్యమం కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment