ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 2018 నుంచి ఉత్పత్తి
-
పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్
గోదావరిఖని : రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) పనులను 2018 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించేలా చూస్తామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో జరుగుతున్న పనులను ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. పనుల పురోగతి గురించి డీజీఎం విజయ్‌కుమార్ వివరించారు. అనంతరం ప్లాంట్ నిర్మాణం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత తెలంగాణలో ఎరువుల కొరత ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్‌కు అవసరమైన నీటిని, విద్యుత్‌ను అందించేందుకు సహకారం అందిస్తోందన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ప్లాంట్‌లో పనులు కొంత నెమ్మదిగా సాగుతున్నాయని, వర్షాకాలం తర్వాత వేగంగా పుంజుకుంటాయని ఆయన తెలిపారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు రాష్ట్ర పరిశ్రమల శాఖ నుంచి సంపూర్ణ సహకారం అందించేలా మంత్రి కేటీఆర్‌ను కోరుతామన్నారు. కర్మాగారంలో ఉద్యోగాల కోసం స్థానిక నిరుద్యోగ యువత ఎదురుచూస్తోందన్నారు. ఈ నేపథ్యంలో పనుల కోసం గ్లోబల్ టెండర్లను పిలిచినా.. స్థానికంగా ఉన్న వారికి సబ్ కాంట్రాక్ట్‌లు అప్పగించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేజ్–1లో భాగంగా ఎన్టీపీసీ నిర్మిస్తున్న 1600 మెగావాట్ల ప్లాంట్‌లో కూడా స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆయన కోరారు.