PM Narendra Modi Key Comments In Ramagundam For Farmers, Details Inside - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు: మోదీ ఆగ్రహం

Published Sat, Nov 12 2022 5:01 PM | Last Updated on Sun, Nov 13 2022 3:02 AM

PM Narendra Modi Key Comments In Ramagundam For Farmers - Sakshi

(రామగుండం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘‘తెలంగాణలో కొందరు రాజకీయ స్వార్థంతో వదంతులు పుట్టిస్తున్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ అబద్ధాలు వారికే ఇబ్బంది అవుతాయని తెలియదేమో. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51%, కేంద్రం వాటా 49%.  అలాంటప్పుడు కేంద్రం ఎలా విక్రయిస్తుంది? ఏమైనా చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన ఏదీ కేంద్రం వద్ద లేదు. ఇలా అబద్ధాలు చెప్పేవారిని హైదరాబాద్‌లోనే ఉంచండి..’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

నకిలీ ఎరువులు, బ్లాక్‌ మార్కెటింగ్‌ వంటి సమస్యల నుంచి రైతులను గట్టెక్కించేందుకు దేశవ్యాప్తంగా ఒకేలా ‘భారత్‌’ బ్రాండ్‌తో యూరియాను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. శనివారం రామగుండంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ మాట్లాడారు. ‘ఈ సభకు విచ్చేసిన రైతులు, సోదర, సోదరీమణులకు నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. తర్వాత హిందీలో మాట్లాడారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. 
 
‘‘రామగుండం నేల నుంచి యావత్‌ తెలంగాణకు నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ భాగస్వాములైన రైతులకు స్వాగతం. ఇక్కడ ప్రారంభించిన ఎరువుల ఫ్యాక్టరీ, రైలు, రోడ్డు మార్గాలతో వ్యవసాయం, వాణిజ్య వ్యాపార రంగాలు అభివృద్ధి చెంది.. తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైతులు, యువతకు ఎంతో మేలు కలుగుతుంది. ఆర్థిక పరిపుష్టి సాధిస్తాం. మూడు జాతీయ రహదారుల విస్తరణతో చెరుకు, పసుపు, ఇతర రైతులకు మేలు చేకూరుతుంది. 

ఒకే బ్రాండ్‌ యూరియాతో.. 
దశాబ్దాలుగా వివిధ బ్రాండ్ల పేరిట నకిలీ ఎరువులు, నల్ల బజారులో విక్రయాలతో దేశంలోని రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. దీనికి పరిష్కారంగా ఇక నుంచి దేశంలో కేవలం ఒకే ‘భారత్‌’ బ్రాండ్‌ యూరియాను నాణ్యత, తక్కువ ధరతో కేంద్రం అందుబాటులోకి తెస్తోంది. రామగుండం ప్లాంట్‌ ద్వారా తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల రైతులకు ఎరువుల సరఫరా జరుగుతుంది. రామగుండం ప్రాంతంలో రవాణా, లాజిస్టిక్‌ రంగాలు అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ భారత్‌లో పెంచలేదు. ప్రతి యూరియా బస్తాపై రూ.1,472, డీఏపీ బస్తాపై రూ.2,500 కేంద్రం సబ్సిడీగా అందిస్తోంది. ఎరువుల కోసం 8 ఏళ్లలో దాదాపు రూ.10 లక్షల కోట్లు, ఈ ఏడాది రెండున్నర లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్నాం. 

శరవేగంగా అభివృద్ధి 
కరోనా, యుద్ధాలు, ఇతర ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉద్భవించే దిశగా వేగంగా పరుగులు పెడుతోంది. ఇంతకుముందటి 30 ఏళ్లతో పోలిస్తే గత 8 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో ఎక్కువగా అభివృద్ధి సాధించింది. ఎనిమిదేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతే ఇందుకు సాక్ష్యం. దేశంలో పాలన తీరు మారింది. సర్కారీ ప్రక్రియలు, ఆలోచనలు మారాయి. మౌలిక సదుపాయాలు వృద్ధి చెందాయి. దేశాభివృద్ధికి దోహదపడే మరో ముఖ్యమైన అంశం రవాణా సదుపాయాల పెంపు. అందుకే అన్ని రాష్ట్రాల్లో రహదారులు, రైల్వే, ఎయిర్‌ వే, వాటర్‌ వే అభివృద్ధి పనులు చేపట్టాం. గత ఎనిమిదేళ్లలో రెట్టింపైన జాతీయ రహదారుల కనెక్టివిటీ.. అన్ని రంగాల్లో వృద్ధికి మార్గం సుగమం చేసింది. భద్రాద్రి–సత్తుపల్లి రైల్వేలైన్‌ను రూ.990 కోట్లతో నాలుగేళ్లలో పూర్తి చేశాం. తక్కువ ఖర్చుతో బొగ్గు రవాణా వల్ల విద్యుత్‌ రంగంలో, వ్యాపార రంగంలో అనేక లాభాలు కలుగుతాయి. జాతీయ రహదారుల విస్తరణ ద్వారా హైదరాబాద్‌–వరంగల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్, కాకతీయ మెగా టెక్సై్టల్‌ పార్క్, పసుపు, మిర్చి రైతులకు ప్రయోజనం కలుగుతుంది..’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  

ఒక రైలు మార్గం.. మూడు హైవేలు 
శనివారం రామగుండం ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో ప్రజల సమక్షంలో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్లాంట్, భద్రాచలం– సత్తుపల్లి కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో రూ.2,268 కోట్లతో నూతనంగా విస్తరిస్తున్న మెదక్‌ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు (హైవే నంబర్‌ 765డీజీ), బోధన్‌ నుంచి బాసర మీదుగా భైంసా వరకు (హైవే నంబర్‌ 161 బీబీ), సిరోంచ నుంచి మహదేవ్‌పూర్‌ వరకు (హైవే నంబర్‌ 353 సి) మూడు నేషనల్‌ హైవేల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 

హైదరాబాద్‌లో ఉన్న కొందరికి ఈ రాత్రి నిద్రపట్టదేమో! 
‘రామగుండం సభకు భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరుకావడంతో హైదరాబాద్‌లో కొందరికి ఇవాళ నిద్ర పట్టదేమో’ అని టీఆర్‌ఎస్‌ పెద్దలను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని, తెలంగాణ అభివృద్ధి కోసం మీ అందరి ఆశీర్వాదం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement