సాక్షి, న్యూఢిల్లీ : ఖరీఫ్ సీజన్‌కుగాను 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం నాడు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఇది చరిత్రాత్మక నిర్ణయమని, ఇది ప్రస్తుత విధాన స్వరూపానే మార్చి వేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో గొప్పగా చెప్పింది. పైగా రైతులకు పంటకయ్యే ఖర్చుకు 50 శాతాన్ని మించే కనీస మద్దతు ధర ఇస్తామంటూ ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీని అక్షరాల అమలు చేస్తున్నామని డాబుసరిగా చెప్పుకుంది. 2020 సంవత్సరం నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదే పదే చేసిన ప్రతిజ్ఞను అమలు చేసే దిశగా ఈ అడుగు వేస్తున్నామని కూడా సగౌరవంగా ప్రకటించుకుంది.
ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం రైతులకు కావాల్సినంత పెంచిందా, లేదా? రైతులు ఎంత డిమాండ్ చేస్తూ వచ్చారు? ప్రభుత్వం ఎంత పెంచింది? అసలు కనీస మద్దతు ధరను పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రాథమిక ప్రమాణాలు ఏమిటీ? గత ప్రభుత్వాల కన్నా నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఎక్కువ పెంచిందా? ఈ పెంపుతో రైతుల కష్టాలు తీరుతాయా? అన్ని కోణాల నుంచి ప్రభుత్వ మద్దతు ధరలను పరిశీలించి చూస్తేగానీ సంగతంతా బోధ పడదు. ఓ పంటకయ్యే మొత్తం ఖర్చును పరిగణలోకి తీసుకొని దానికన్నా ఎక్కువ ధర వచ్చేలా ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. కనీసం ఆ మద్దతు ధరకన్నా మార్కెట్ ఆ పంటను కొనకపోతే ప్రభుత్వమే ఆ ధరకు పంటను రైతు నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
పంట ఖర్చును ఎలా లెక్కిస్తారు?
పంటకయ్యే ఖర్చును ప్రాతిపదికగా తీసుకొని కనీసమద్దతు ధర నిర్ణయిస్తారు. అయితే ఈ ఖర్చును ఏ ప్రమాణాలపై నిర్ణయిస్తారు. మూడు ప్రమాణాలు లేదా మూడు సూత్రాల ప్రకారం పంటకయ్యే ఖర్చును లెక్కిస్తారు.
మొదటి సూత్రం: ఏ2.....విత్తనాలు, ఎరువులు, పురుగుమందలకు రైతులు పెట్టే ఖర్చుతోపాటు వ్యవసాయ కూలీలకు, వ్యవసాయ అద్దె యంత్రాలకు రైతులు చెల్లించే మొత్తంను పరిగణలోకి తీసుకుంటారు.
రెండవ సూత్రం: ఏ2 ప్లస్ ఎఫ్‌ఎల్ (ఫ్యామిలీ లేబర్): మొదటి సూత్రం కింద విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలకు, యంత్రాలకు పెట్టే మొత్తం ఖర్చు ప్లస్ రైతు కుటుంబం ఆ పంటపై పెట్టే మొత్తం శ్రమను పరిగణలోకి తీసుకోవడం.
మూడవ సూత్రం: సీ2. అంటే కాంప్రెహెన్సివ్ కాస్ట్. విత్తనాల దగ్గరి నుంచి రైతు కుటుంబం శ్రమ వరకు అయ్యే ఖర్చు ప్లస్ రైతు ఓ పంటపై పెట్టిన పెట్టుబడికి వచ్చే కనీస వడ్డీ, ఆ పంట పండే భూమి లీజుకయ్యే మొత్తం.
ఈ మూడు సూత్రాల ప్రాతిపదికన ఓ పంటకు కనీస మద్దతు ధరను కేంద్రంలోని ‘కమిషన్ ఫర్ అగ్రికల్టర్స్ కాస్ట్ అండ్ ప్రైసెస్’ నిర్ణయిస్తుంది. పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయించడంలో ప్రభుత్వాల అసలు కిటుకు అంతా ఇక్కడే ఉంది. 2017లో దేశవ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించిన రైతులు కూడా తమ పెట్టుబడులకన్నా యాభై శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండాలని డిమాండ్ చేశారు. మూడవ సూత్రమైన ‘సీ2’ కన్నా 1.5 రెట్లు ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండాలని కోరారు. వారికి ఈ అవగాహన ఎలా వచ్చిందంటే వ్యవసాయ సంస్కరణలపై అధ్యయనం చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ నాయకత్వంలోని జాతీయ కమిషన్ 2006లో సమర్పించిన నివేదికలో ఇదే సిఫార్సు చేశారు కనుక.
ఏ ప్రాతిపదికన మద్దతు ధర నిర్ణయించారు?
స్వామినాథన్ నివేదిక సిఫార్సు మేరకు లేదా రైతుల డిమాండ్ మేరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడవ సూత్రం ప్రకారం కనీస మద్దతు ధరను నిర్ణయించక రెండో సూత్రం ప్రకారం నిర్ణయించింది. కనీస మద్దతు ధర పెంపును ‘సీ2’ సూత్రం ప్రకారం లెక్కిస్తే ఒక్క సజ్జల కనీస మద్దతు ధర పెంపు మాత్రమే పెట్టుబడికి 50 శాతంపైగా ఉంది. మిగతా వాటి ధరలన్నీ 14 శాతం, అంతకన్నా తక్కువే. అత్యంత ముఖ్యమైన వరికి 12.2 శాతం, నువ్వులకు కేవలం మూడు శాతం పెంచింది. గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంతో పోలిస్తే మోదీ ప్రభుత్వం పెంచిందీ ఎక్కువా ? అదీ అంతా నిజం కాదు.
2012–2013లోనే ఎక్కువ పెరిగాయి
దేశంలోని ఎక్కువ పంటలకు కనీస మద్దతు ధరలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న 2012–2013 ఆర్థిక సంవత్సరంలోనే ఎక్కువ పెరిగాయి. సీ2 సూత్రం ప్రకారం మోదీ ప్రభుత్వం వరి మద్దతు ధరను పెట్టుబడులపై 12.2 శాతం పెంచగా, నాడు మన్మోహన్ సర్కార్ 15 శాతం పెంచింది. జొన్నలపై నేటి ప్రభుత్వం 11.3 శాతం పెంచగా, నాటి ప్రభుత్వం 53 శాతం పెంచింది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం సజ్జలు, రాగులు, గడ్డి నువ్వులపైనే కాస్త ఎక్కువ పెంచింది. మోదీ ప్రభుత్వం బుధవారం నాడు 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించినా అందులో పెరిగిందీ 14 పంటలకే.
మద్దతు ధరను అమలు చేస్తుందా ?
అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేది ఎక్కువగా బియ్యం, గోధుమలు మాత్రమే. ఓ మోస్తారుగా పప్పు దినుసులను కొనుగోలు చేస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు చౌక ధరలపై రేషన్‌పై బియ్యం, గోధమలను ప్రభుత్వమే సరఫరా చేస్తున్నందున బియ్యం, గోధుమలను ప్రభుత్వాలు కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. అది కూడా ఉత్తర భారత దేశం నుంచే ఎక్కువగా కొనగోలు చేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నాయి. రైతుల నుంచి మద్దతు ధరకు బియ్యం, గోధుమలను కేంద్రం కొనుగోలు చేసి వాటిని రేషన్ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్నా ప్రభుత్వం వద్ద ధాన్యం వృధా అవుతోంది. ఈ వృధా అరికట్టేందుకు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు కొత్త స్కీమ్‌ను ప్రకటించాయి. కనీస మద్దతు రేటుకు, మార్కెట్ రేటుకున్న వ్యత్యాసాన్ని నేరుగా రైతులకు డబ్బు రూపంలో ప్రభుత్వం చెల్లించడమే ఆ స్కీమ్. అది కూడా ఆయా రాష్ట్రాల్లో అంతంత మాత్రంగానే అమలవుతోంది.
సీ2తో సవరించిన మద్దతు ధరలను పొలిస్తే
పంట | పాత(రూపాయల్లో) | కొత్త(రూపాయల్లో) | పెరిగిన శాతం |
1. వరి | 1,560 | 1,750 | 12.2 |
2. జొన్నలు | 2,183 | 2,430 | 11.3 |
3. సజ్జలు | 1,124 | 1,950 | 47.3 |
4. రాగి | 2,370 | 2,897 | 22.2 |
5. మొక్కజొన్న | 1,480 | 1,700 | 14.9 |
6. కందిపప్పు | 4,981 | 5,675 | 13.9 |
7. పెసరపప్పు | 6,161 | 6,975 | 13.2 |
8. మినపపప్పు | 4,989 | 5,600 | 12.2 |
9. పల్లీలు | 4,186 | 4,890 | 16.8 |
10. పొద్దు తిరుగుడు గింజలు | 4,501 | 5,388 | 19.7 |
11. సోయాబిన్ | 2,972 | 3,399 | 14.4 |
12. నువ్వులు | 6,053 | 6,249 | 3.2 |
13. పత్తి(మీడియం రకం) | 4,514 | 5,150 | 14.1 |
14. నైగర్ సీడ్(కలోంజి) | 5,135 | 5,877 | 14.4 |
Comments
Please login to add a commentAdd a comment