పచ్చ సైంధవులు..!
♦ మూడేళ్లుగా పంటల బీమా కోసం రైతుల ఎదురుచూపులు
♦ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో అవిశ్రాంత పోరాటం
♦ రూ.44కోట్లు మంజూరైనా ఖాతాలకు జమకాకుండా పెండింగ్
♦ వైఎస్సార్‌సీపీకి పేరు వస్తుందని టీడీపీ నేతల కొర్రి
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా శనిగ రైతుల పరిస్థితి తయారైంది. కేంద్రం నుంచి బీమా ప్రీమియం నిధులు మంజూరైనా రైతుల ఖాతాలకు జమకాకుండా టీడీపీ అడ్డుపుల్ల వేస్తోంది. రైతులకు న్యాయంగా దక్కాల్సిన బీమా కోసం వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తే.. వచ్చిన మొత్తాన్ని రైతుల ఖాతాలకు జమ కాకుండా జిల్లాకు చెందిన పచ్చనేతలు ముగ్గురు రైతుల పాలిట సైంధవులుగా నిలిచారు. వైఎస్‌ఆర్‌సీపీకి ఆ క్రెడిట్ దక్కుతుందని దాదాపు నెలరోజులుగా రూ.44కోట్లు రైతుల ఖాతాకు పడకుండా చక్రం తిప్పుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో 2012-13 సంవత్సరానికి శనగ రైతులకు రావాల్సిన పంటలబీమా పరిహారం ఇంతవరకూ అందలేదు. మూడేళ్లుగా ఆ డబ్బుల కోసం రైతులు ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చారు. చెల్లించిన ప్రీమియంకు బీమా దక్కక ఆవేదనలో ఉన్న రైతులకు వెస్‌ఆర్‌సీపీ అండగా నిలిచింది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఈ విషయమై ఏఐసీ అధికారులతో అనేక పర్యాయాలు చర్చించారు. అదేరీతిలో వ్యవసాయశాఖ కమిషనర్‌తో మంతనాలు చేపట్టారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఏఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇలా రాష్ట్ర పరిధిలో ఉన్న అడ్డంకులను చేధించుకుని ఏఐసీ జీఎం రాజేశ్వరీ ద్వారా ఢిల్లీలోని కేంద్రకార్యాలయానికి ప్రతిపాదనలు పంపించారు.
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోనూ, కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రెటరీతోనూ ప్రత్యేకంగా కలిసి సమస్య వివరించారు. ఈ నేపథ్యంలో రూ.132కోట్లు మంజూరుకు ఏఐసీ నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా 17,161మంది శనగ రైతులకు రూ.88 కోట్లు బీమా మొత్తం జమ అయింది. రెండవ విడతగా 11,286 మంది రైతులకు రూ.44కోట్లు బీమా మొత్తం జూన్ 21న మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతోరైతులు సైతం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కృషిని కొనియాడారు.
అడ్డుచక్రం సంధించిన ఆ ముగ్గురు..
బీమా ప్రీమియం అన్నదాతల ఖాతాల్లో జమయితే వైఎస్సార్‌సీపీకీ పేరు వస్తుందని ‘పచ్చ’నేతలకు కన్నుకుట్టింది. ఇంకేముంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాకుండా అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు అడ్డుచక్రం సంధించారు. దాదాపు నాలుగువారాలు గడుస్తున్నా రైతులకు ఖాతాకు జమకాకుండా వ్యూహాత్మకంగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై టీడీపీ కండువా కప్పుకున్న ఓ ఎమ్మెల్యే, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ప్రజాతీర్పు వికటించిన నాయకుడు, కాంట్రాక్టర్‌గా ఉంటూ కొత్తగా రాజకీయ ప్రవేశం చేసి జిల్లాలో ముఖ్యబాధ్యతలు నిర్వహిస్తున్న నేత, ఈ వ్యవహారంలో ఒక్కటయ్యారని సమాచారం. వీరు ముగ్గురు ఓ మంత్రి ద్వారా అడ్డుచక్రం వేసినట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపులో నిర్లక్ష్యం
పంటబీమా విషయమై ఏఐసీకి వాటా చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రనిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. చిత్తశుద్ధితో చేపట్టిన పోరాటంతో, ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఏఐసీ సీఎండీ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రప్రభుత్వం తన వాటాను చెల్లిస్తూ హైదరాబాద్‌లో ఉన్న ఏఐసీ జీఎం నుంచి ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. ప్రభుత్వం వాటా చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఇప్పటీకీ ఏఐసీ సిఎండి కార్యాలయానికి 21 వేల రైతుల దరఖాస్తుల ప్రతిపాదనలు చేరడం లేదని సమాచారం. మంజూరైన బీమా రైతుల ఖాతాకు జమకాకుండా అడ్డుకోవడంప రైతులు, రైతు సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇప్పటికైనా రైతుల కోసం, రైతుల పక్షానా అధికారపార్టీ నేతలు నిలవాలని పలువురు కోరుతున్నారు.