వృత్తి నిపుణులకూ ఉంది రక్ష..! | Amulet is a professional experts ..! | Sakshi
Sakshi News home page

వృత్తి నిపుణులకూ ఉంది రక్ష..!

Published Sun, Aug 14 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

వృత్తి నిపుణులకూ ఉంది రక్ష..!

వృత్తి నిపుణులకూ ఉంది రక్ష..!

ఇండెమ్నిటీ పాలసీలతో ప్రొఫెషనల్స్‌కు భరోసా వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు సహా పలువురికి సేవలు..    బాధితులకు పరిహారం చెల్లించేది బీమా కంపెనీలే.. బాధ్యతారాహిత్యం, తప్పిదం ప్రధానాంశాలే..    కేసుల్లో ఖర్చుల నుంచి, పరిహారం దాకా బీమాదే..


’’ఉన్నదంతా ఊడ్చేశాను. ఆఖరికి అప్పులు కూడా చేశాను. అయినా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. మాకు న్యాయం కావాలి’’  - ఓ దంపతుల ఆవేదన...


‘‘ఈ లాయర్‌ను నమ్ముకుని భారీగా ఖర్చుచేశా.  కానీ లాయర్ తప్పిదం కారణంగా కేసును వీగిపోయా. నాకు నష్టం జరిగింది’’  - కోర్టులో ఒక కక్షిదారు  పిటిషన్

 

‘‘ఆర్కిటెక్ట్ సరిగా డి జైన్ చెయ్యలేదు. డిజైన్ లోపం వల్లే నిర్మాణం దెబ్బతింది. నాకు కోట్ల రూపాయల నష్టం జరిగింది. నాకు పరిహారం కావాలి’’  - కోర్టులో పిటిషన్ ద్వారా ఓ భారీ భవంతి యజమాని అభ్యర్థన...

 

చూడటానికివన్నీ వేరువేరు సంఘటనలే. కాకపోతే మూడింట్లోనూ ఇమిడి ఉన్న ఒకే ఒక అంశమేంటంటే...  ఈ సందర్భాలన్నిట్లో సేవలు పొందిన వారు నష్టపోయారు.  మరి వారికి న్యాయం జరిగేదెలా? ఇదిగో... సరిగ్గా ఇలాంటి సమస్యల్ని పరిష్కరించడం ద్వారా దీన్లోని వ్యాపారాన్ని అందిపుచ్చుకోవటానికి బీమా కంపెనీలు కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వృత్తి నిపుణుల తరఫున బాధితులకు పరిహారం అందించే పాలసీలను అందజేస్తున్నాయి. న్యాయవాదులు, వైద్యులు, ఆర్కిటెక్ట్‌ల వంటి వృత్తి నిపుణులు ఈ పాలసీలను తీసుకునే ధోరణి ఇపుడు పెరుగుతోంది.  ఓ నిపుణుడి నిర్లక్ష్య ధోరణి కారణంగా సేవలు పొందిన వ్యక్తి నష్టపోతే ఇరువురినీ ఆదుకునేందుకు ఈ పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి. వీటినే ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ పాలసీలుగా పిలుస్తున్నారు.


ప్రీమియం కాస్త ఎక్కువే...
పాలసీ ప్రీమియం అనేది... తీసుకునే వారిని బట్టి ఉంటుంది. ఓ వైద్యుడు రూ.50 లక్షల పరిహారం కోసం పాలసీ తీసుకుంటే 1% అంటే రూ. 50 వేల ప్రీమియం చెల్లించుకోవాలి. వైద్యుల్లోనూ ఫీజీషియన్ కంటే సర్జన్‌కు ప్రీమియం అధికంగా ఉంటుంది. ఎందుకంటే శస్త్రచికిత్స విఫలమైన పక్షంలో రోగుల ప్రాణాలకు ముప్పుంటుంది. అదే రిస్క్ తక్కువగా ఉండే వర్గాలకు ఇన్సూరెన్స్ మొత్తంలో 0.30% ప్రీమియంనే బీమా కంపెనీలు వసూలు చేస్తున్నాయి.


ఎవరికి ఈ పాలసీలు..?
స్వతంత్రంగా సేవలందించే ఎవరైనా ఈ పాలసీలు తీసుకోవచ్చు. అంటే లాయర్లు, ఆర్కిటెక్ట్‌లు, వైద్యులు, ఇంజనీర్లు, ప్రకటనల నిపుణులు, కంపెనీ సెక్రటరీలు, ప్రజా సంబంధాల నిపుణులు, మేనేజ్‌మెంట్ నిపుణులు, కళాత్మక వస్తువులకు విలువ కట్టేవారు, వేలందారులు, టూర్ ఆపరేటర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, బీమా బ్రోకింగ్  సేవలందించేవారితో పాటు విద్యా సంస్థలు, ఇంకా సలహా సేవలందించే ఇతర రంగాల నిపుణులు పాలసీలు తీసుకోవచ్చు.

 

పాలసీ ఉందికదా అని నిర్లక్ష ్యం కూడదు!
పాలసీ ఉంది కదా అని వృత్తి నిపుణులు బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా సేవలు అందిస్తే జరిగే నష్టానికి బీమా కంపెనీలు పరిహారం నిరాకరించవచ్చు. పాలసీ నిబంధనల్లో  ఇలాంటి ఎన్నో మినహాయింపులుంటాయి. అందుకే పాలసీ తీసుకునే ముందే పరిహారం విషయమై మినహాయింపుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. అంటే పాలసీ నియమ, నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. అలాగే మోసపూరిత, నేరపూరిత, కాపీరైట్ చట్టాల ఉల్లంఘన ఘటనలకు కూడా పరిహారం రాదు. ఇలాంటివి మినహాయిస్తే బాధ్యతాయుతంగా అందించే సేవల్లో జరిగే నష్టాలకు నిపుణులు బాధితులుగా మారకుండా ఇండెమ్నిటీ పాలసీలు రక్షణనిస్తాయి.

 

ఏ సందర్భంలో పరిహారం..?
ఉదాహరణకు వైద్యుడి సేవా లోపం కారణంగా ఓ రోగి ప్రాణం కోల్పోయాడంటూ బాధితుని కుటుంబం కోర్టును ఆశ్రయించింది. మరి వైద్యుడు కూడా జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని వాదించుకోవటానికి ఒక న్యాయవాదిని పెట్టుకోవాలి కదా? తనకు ఛార్జీలు చెల్లించాలి కదా!! ఒకవేళ కేసులో ఓడిపోయి పరిహారం చెల్లించాల్సి వస్తే తానే చెల్లించాలి కదా!! ఇవన్నీ తప్పనిసరి. కాకపోతే ఇండెమ్నిటీ పాలసీ గనక తీసుకుని ఉంటే... ఈ భారమంతా బీమా కంపెనీ తలకెత్తుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement