Indemnity Policy
-
నో క్లెయిమ్ బోనస్.. విలువైన బహుమానం
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్నో రకాల ప్రయోజనాలతో వస్తుంటాయి. పాలసీదారులు పాలసీ తీసుకున్న తర్వాత కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించినట్టయితే.. ప్రత్యేక రాయితీలతో ప్రోత్సహించేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రీమియంలో తగ్గింపులు, ఔట్ పెషెంట్‌గా తీసుకునే చికిత్సల సమయంలో వినియోగానికి వీలైన రివార్డు పాయింట్లు ఇందులో భాగమే. బీమా కంపెనీలు అందించే ఆఫర్లలో.. ముఖ్యంగా నో క్లెయిమ్ బోనస్‌ను అమూల్యమైనదనే చెప్పుకోవాలి. నో క్లెయిమ్ అంటే.. ఒక పాలసీ ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయకపోవడం. దీనివల్ల బీమా కంపెనీలకు కొంత ఆదా అవుతుంది. దాంతో నో క్లెయిమ్ బోనస్ రూపంలో కొంత ప్రయోజనాన్ని తిరిగి పాలసీదారులకు అందిస్తుంటాయి. ఎక్కువ సంస్థలు బీమా మొత్తాన్ని నిర్ణీత శాతం మేర పెంచుతుంటే.. కొన్ని మాత్రం ప్రీమియంలో రాయితీ ఇస్తున్నాయి. బీమా కవరేజీని బోనస్ గా ఇచ్చినా ఇందుకు అదనపు ప్రీమియం వసూలు చేయవు. కనుక ఆరోగ్య బీమా తీసుకున్నప్పటికీ.. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరాల్సిన అవస్థ తప్పుతుంది. బీమా రక్షణ మొత్తం పెరుగుతుంది. ఈ నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ)ను దాదాపు అన్ని బీమా సంస్థలు అందిస్తున్నాయి. వివిధ బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ ప్రయోజనం విషయంలో వైరుధ్యాలను తెలియజేసే కథనమే ఇది. ఎలా పనిచేస్తుంది..? అన్ని రకాల ఇండెమ్నిటీ హెల్త్ పాలసీలు (ఆస్పత్రిలో చేరడం వల్ల అయిన వైద్య ఖర్చులు చెల్లించేవి) నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) ఫీచర్‌తో వస్తున్నాయి. ఉదాహరణకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్‌గార్డ్ (గోల్డ్ ప్లాన్)లో క్లెయిమ్‌లు లేని ప్రతీ సంవత్సరం తర్వాత బీమా మొత్తం 10 శాతం పెరుగుతుంది. అంటే రూ.5 లక్షల కవరేజీకి పాలసీ తీసుకుని క్లెయిమ్ చేసుకోకపోతే రెన్యువల్ అనంతరం 10 శాతం పెరిగి కవరేజీ రూ.5.50 లక్షలకు చేరుతుంది. ఇలా బేస్ సమ్ ఇన్సూర్డ్ (ఎస్ఐ)కు గరిష్టంగా నూరు శాతం వరకు కవరేజీని ఎన్సీబీ కింద అందుకోవచ్చు. రూ.5 లక్షలను బేసిక్ సమ్ ఇన్సూర్డ్‌గా ఎంచుకున్నారనుకుంటే.. వరుసగా పదేళ్లపాటు ఎటువంటి క్లెయిమ్ చేసుకోని సందర్భాల్లో కవరేజీ రూ.5 లక్షల మేర పెరిగి రూ.10లక్షలు అవుతుంది. అయితే, ఇలా ఎన్సీబీ రూపంలో బీమా కవరేజీ పెరగడం అన్నది అన్ని బీమా సంస్థల్లోనూ ఒకే మాదిరిగా ఉండదు. ఉదాహరణకు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన ‘యాక్టివ్ అష్యూర్డ్ పాలసీ’లో ఎన్సీబీ కింద గరిష్టంగా 50 శాతం వరకే బీమా పెరుగుతుంది. అదే మణిపాల్ సిగ్నా ప్రో హెల్త్ పాలసీలో బేసిక్ ఎస్ఐకు గరిష్టంగా 200 శాతం వరకు అదనపు బీమా కవరేజీని నో క్లెయిమ్ బోనస్ కింద అందుకోవచ్చు. ఎటువంటి క్లెయిమ్ చేసుకోకుండా, సకాలంలో ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేసుకున్న వారికి ఎన్సీబీ కింద సమ్ ఇన్సూర్డ్ పెంపును బీమా సంస్థలు హామీ పూర్వకంగా అందిస్తున్నాయి. క్లెయిమ్ చేసుకుంటే.. ఒకవేళ పాలసీ సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుంటే బోనస్‌గా పెరిగిన సమ్ ఇన్సూర్డ్ నిర్ణీ త శాతం మేర తగ్గిపోతుందని గుర్తించాలి. క్లెయిమ్ చేసుకున్నా కానీ, అప్పటి వరకు బోనస్‌గా పొందిన బీమా కవరేజీని తగ్గించని పాలసీలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఉదాహరణకు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివ్ అష్యూర్ పాలసీలో క్లెయిమ్ చేసుకుంటే.. తదుపరి పాలసీ సంవత్సరంలో ఎన్సీబీ 10% మేర తగ్గిపోతుంది. అంటే బేస్ సమ్ ఇన్సూర్డ్ రూ.10 లక్షలు తీసుకున్నారనుకుంటే.. అప్పటి వరకు ఎన్సీబీ రూపంలో ఏటా 10% చొప్పున రూ.3లక్షల కవరేజీ అదనంగా లభించి ఉంటే.. తర్వాతి సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుంటే బేసిక్ కవరేజీ రూ.10లక్షలు అలాగే ఉంటుంది. ఎన్సీబీ మాత్రం రూ.లక్ష తగ్గి రూ.2లక్షలకు చేరుతుంది. ఎన్సీబీని బేసిక్ ఎస్ఐ ఆధారంగానే పెంచుతారు కనుక.. తగ్గించేటప్పుడూ అదే సూత్రం అమలవుతుంది. క్లెయిమ్‌లు చేసుకున్నా కానీ.. ఎన్సీబీని తగ్గించని పాలసీల్లో మణిపాల్ సిగ్నా ప్రోహెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి. ప్రస్తుతం కోవిడ్–19 వల్ల ఆర్థిక ఇబ్బందులు, హెల్త్రిస్క్ను దృష్టిలో ఉంచుకుని కొన్ని బీమా సంస్థలు పాలసీదారులు క్లెయిమ్ చేసుకున్నా కానీ.. ఎన్సీబీని తగ్గించడం లేదు. ఇందుకు ఉదాహరణ హెచ్డీఎఫ్సీ ఎర్గో. ఈ ఏడాది జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కోవిడ్–19 చికిత్స కోసం క్లెయిమ్ చేసుకున్నా కానీ పాలసీదారుల క్యుములేటివ్ బోనస్ కవరేజీని తగ్గించకూడదని హెచ్డీఎఫ్సీ ఎర్గో నిర్ణయం తీసుకుంది. ఇదే విధమైన నిర్ణయాన్ని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్కూడా తీసుకుంది. అదనపు ఎన్సీబీ నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా కవరేజీ పెంపు ప్రయోజనం ఉచితంగానే లభిస్తుంది. ఇందుకు ఎటువంటి ప్రీమియంను అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, అదనంగా ప్రీమియం చెల్లించడం ద్వారా క్యుములేటివ్ బోనస్ కవరేజీని మరింత పెంచుకునేందుకు కొన్ని బీమా సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. నో క్లెయిమ్ బోనస్‌కు అదనంగా కొంత ప్రీమియం చెల్లించి ఎన్సీబీని ఏటా అదనంగా 5–10 శాతం మేర పెంచుకోవచ్చు. ఉదాహరణకు మణిపాల్ సిగ్నా ప్రోహెల్త్ ప్లాన్‌లో క్యుములేటివ్ బోనస్ బూస్టర్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. సమ్ ఇన్సూర్డ్‌పై కచ్చితంగా 25 శాతం పెంపును, గరిష్టంగా 200 శాతం వరకు పెంపును ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో సైతం అదనపు ప్రీమియంతో క్యుములేటివ్ బోనస్‌ను పెంచుకునేందుకు అనుమతిస్తోంది. పోర్టింగ్ పెట్టుకుంటే ఏంటి పరిస్థితి? మొబైల్ నంబర్ పోర్టబులిటీ మాదిరిగానే హెల్త్ ఇన్సూరెన్స్‌ను కూడా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవచ్చు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ మార్గదర్శకాల మేరకు.. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు హెల్త్ ప్లాన్‌ను పోర్ట్ చేసుకుంటే.. గత సంస్థలో పోగు చేసుకున్న క్యుములేటివ్ బోనస్‌ను కొత్త సంస్థ కూడా ఎటువంటి అదనపు ప్రీమియం లేకుండానే అందించాల్సి ఉంటుంది. దీని గురించి బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ హెల్త్ క్లెయిమ్స్ విభాగం హెడ్ భాస్కర్ నేరుర్కర్ వివరిస్తూ.. ‘‘పోర్టింగ్ సమయంలో బేస్ సమ్ ఇన్సూర్డ్‌తోపాటు క్యుములేటివ్ బోనస్ కూడా నూతన పాలసీకి బదిలీ అవుతుంది. ప్రీమియం మాత్రం బేసిక్ సమ్ ఇన్సూర్డ్కే వసూలు చేస్తారు. అయితే, ఆ తర్వాత నుంచి నూతన సంస్థ నియమ, నిబంధనల మేరకే క్యుములేటివ్ బోనస్ ప్రయోజనం లభిస్తుంది’’ అని తెలిపారు. అంటే ఒక వ్యక్తి ఏ అనే బీమా కంపెనీ నుంచి రూ.5 లక్షల సమ్ ఇన్సూర్డ్‌కు హెల్త్ ప్లాన్ తీసుకుని, రూ.లక్ష సమ్ ఇన్సూర్డ్‌ను ఎన్సీబీ కింద పొంది ఉన్నారనుకుంటే.. మరో సంస్థకు పోర్టింగ్ చేసుకునేట్టయితే నూతన సంస్థ సైతం మొత్తం రూ.6లక్షలకు కవరేజీని (రూ.5 లక్షలు బేసిక్, రూ.లక్ష బోనస్) ఆఫర్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. దీనికి అదనంగా సమ్ ఇన్సూర్డ్‌ను పెంచుకోవాలంటే ప్రత్యేకంగా అండర్రిటన్ చేయాల్సి ఉంటుందని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ప్రసూన్ సిక్దర్ తెలిపారు. అంటే నూతన సంస్థలో బేస్ సమ్ ఇన్సూర్డ్‌ను పెంచుకోవాలంటే అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. -
కరోన 'రక్షణ' ఉందా..?
ఆరోగ్య బీమా అవసరాన్ని మనలో అధిక శాతం మంది ఇంతకాలం గుర్తించలేదు. కానీ, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఆరోగ్య బీమా అవసరాన్ని చాలా మంది గుర్తిస్తున్నారు. అందరికీ ఆరోగ్య బీమాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు.. ముఖ్యంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక విపత్కర పరిస్థితులను దృష్టిలోకి తీసుకుని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కరోనాకు సంబంధించి ప్రత్యేక పాలసీలను ప్రవేశపెట్టాలని నిర్దేశించింది. దీంతో అన్ని ప్రముఖ సంస్థలు కరోనా కవచ్, కరోనా రక్షక్ పేరుతో రెండు రకాల పాలసీలను ప్రవేశపెట్టాయి. కరోనా కోసం బీమా సంస్థలు తీసుకొచ్చిన రెండు ప్రామాణిక పాలసీల్లో ఏది మీకు అనుకూలం..? వీటిల్లో కవరేజీ, మినహాయింపులు తదితర సమగ్ర అంశాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. పాలసీల్లో వైరుధ్యం.. కరోనా కవచ్, కరోనా రక్షక్ రెండు రకాల పాలసీలు కోవిడ్–19 చికిత్సలకు పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించినవి. కరోనా కవచ్ పాలసీ ఇండెమ్నిటీ ప్లాన్. అంటే కరోనా కారణంగా చికిత్సలకు అయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. తీసుకున్న బీమా మొత్తానికి ఇది పరిమితం అవుతుంది. ఇక కరోనా రక్షక్ పాలసీ అనేది బెనిఫిట్ పాలసీ. అంటే కరోనా బారిన పడితే ఎంచుకున్న బీమా మొత్తాన్ని ఒకే విడత చెల్లించేస్తుంది. కరోనా పాజిటివ్ అని తేలి, కనీసం 72 గంటలు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తేనే కరోనా రక్షక్ పాలసీ ప్రయోజనం లభిస్తుంది. ప్రభు త్వం గుర్తింపు కలిగిన ల్యాబ్‌ల్లో పరీక్షల ద్వారా కరోనా నిర్ధారణ అయితేనే ఈ రెండు పాలసీల్లోనూ పరిహారం లభిస్తుంది. కరోనా కవచ్ పాలసీ విడిగా వ్యక్తులకు, లేదా కుటుంబం మొత్తానికి ఫ్లోటర్ పాలసీ రూపంలో అందుబాటులో ఉంటుంది. కరోనా రక్షక్ పాలసీ అనేది కుటుంబానికి కాకుండా ప్రతీ వ్యక్తి విడిగా తీసుకోవాల్సిన పాలసీ. ఈ 2 రకాల పాలసీలు 105 రోజులు (3.5 నెలలు), 195 రోజులు (6.5 నెలలు), 285 రోజుల (9.5 నెలలు) కా లానికి లభిస్తాయి. ఆ తర్వాత అంతే కాలానికి రెన్యువల్ చేసుకోవచ్చు. కనీస బీమా రూ. 50,000 నుంచి మొదలవుతుంది. గరిష్టంగా కరోనా కవచ్ పాలసీలో రూ.5 లక్షల బీమాను ఎంచుకోవచ్చు. కరోనా రక్షక్ ప్లాన్‌లో గరిష్ట బీమా రూ.2.5 లక్షలకు పరిమితం అవుతుంది. కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 65 సంవత్సరాల అర్హత మేరకు పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీల్లో ప్రీమియం వాయిదాల రూపంలో కాకుండా ఒకే విడత చెల్లించాలి. నెట్వర్క్ ఆస్పత్రుల్లో చేరడం ద్వారా కరోనా కవచ్ పాలసీదారులు నగదు రహిత చికిత్సలు పొందొచ్చు. ఈ పాలసీలను ఆయా బీమా సంస్థల పోర్టళ్లు, పంపిణీ చానళ్లు, ఏజెంట్ల ద్వారా తీసుకోవచ్చు. ఈ ప్రత్యేక పాలసీలను తీసుకోవచ్చా..? బీమా కంపెనీ ఏదైనా కానీ ఈ రెండు రకాల పాలసీలకు సంబంధించి అధిక శాతం నిబంధనలు ఒకే విధంగా ఉన్నాయి. ప్రీమియం, బీమా సంస్థ అందించే సేవల నాణ్యత, క్లెయిమ్‌లను వేగంగా ఆమోదించడం వంటి విషయాలను పరిశీలించాలి. అదే విధంగా బీమా కంపెనీల చెల్లింపుల చరిత్రను చూసిన తర్వాతే మీకు అనుకూలమైన సంస్థ నుంచి పాలసీని ఎంచుకోవాలి. ఈ పాలసీల్లో ప్రాంతాల వారీగా ప్రీమియంలో వ్యత్యాసం ఉండదు. రెగ్యులర్ హెల్త్ ప్లాన్లలో ప్రాంతాల వారీగా ప్రీమియం మారిపోవడాన్ని గమనించొచ్చు. కానీ కోవిడ్ పాలసీల్లో ప్రీమియం అన్ని ప్రాంతాల వారికి ఒకే రీతిలో ఉంటుంది. 40 ఏళ్ల వ్యక్తి మూడున్నర నెలల కాలానికి కరోనా కవచ్ పాలసీని ఎంచుకుంటే ప్రీమియం కనిష్టంగా రూ.636 నుంచి గరిష్టంగా రూ.3,831 వరకు ఉంటుంది. అదే 9.5 నెలల కోసం ఇదే వయసున్న వ్యక్తికి ప్రీమియం రూ.1,286–5,172 మధ్య ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పటికే ఓ సమగ్రమైన ఆరోగ్య బీమా ఉండి, అందులో ఔట్ పేషెంట్ చికిత్సలకు కూడా కవరేజీ ఉండుంటే అప్పుడు ప్రత్యేకంగా కరోనా కవచ్ పాలసీని తీసుకోవాల్సిన అవసరం లేనట్టుగానే భావించాలి. ఎందుకంటే ఇప్పటికే అమల్లో ఉన్న అన్ని హెల్త్ ప్లాన్లలో కరోనాకు కవరేజీ లభిస్తుంది. కాకపోతే కరోనా వల్ల ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవాల్సి వస్తే.. అన్ని ప్లాన్లలోనూ పరిహారం రాకపోవచ్చు. కానీ కరోనా రక్షక్ పాలసీ ఎవరికైనా అనుకూలమే. ఎందుకంటే ఇప్పటికే హెల్త్ ప్లాన్ ఉన్నా కానీ.. కరోనా రక్షక్‌లో ఏకమొత్తంలో పరిహారం అందుకోవచ్చు. ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండి, బీమా మొత్తాన్ని మించిపోయినా అప్పుడు కరోనా రక్షక్ ఆదుకుంటుంది. కానీ, కరోనా రక్షక్‌లో పాజిటివ్‌గా తేలిన వ్యక్తి కనీసం మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటేనే పరిహారం లభిస్తుంది. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి హెల్త్ ప్లాన్ లేని వారు ప్రస్తుత కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో కరోనా కవచ్ లేదా కరోనా రక్షక్ను తీసుకోవడాన్ని తప్పకుండా పరిశీలించాల్సిందే. కవరేజీ వేటికి..? కరోనా కవచ్ పాలసీలో.. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నా.. ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నా గరిష్ట బీమా మేరకు పరిహారం పొందొచ్చు. ఆస్పత్రిలో కనీసం 24 గంటల పాటు చికిత్స పొందినప్పుడే ఖర్చులను చెల్లిస్తుంది. రూమ్ అద్దె, బోర్డింగ్, నర్సింగ్ చార్జీలు, ఐసీయూ, అంబులెన్స్ (రూ.2,000వరకు) చార్జీలను కూడా పొందొచ్చు. వైద్య, కన్సల్టెంట్, ఆపరేషన్ థియేటర్, పీపీఈ కిట్లు, గ్లోవ్స్‌కు అయ్యే వ్యయాలకూ బీమా సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ఇంట్లోనే ఉండి చికిత్స పొందితే.. గరిష్టంగా 14 రోజుల చికిత్స వ్యయా లను భరిస్తుంది. అది కూడా వైద్యుల సూచన మేరకు ఇంట్లో ఉండి, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటేనే పరిహారం కోసం క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుంది. ఆయుర్వేద ఆస్పత్రిలో ఇన్ పేషెంట్‌గా చేరి చికిత్స తీసుకున్నా కరోనా కవచ్ పాలసీ కవరేజీనిస్తుంది. ఆస్పత్రిలో చేరడానికి ముందు అయిన ఖర్చులు (15 రోజులు), ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం 30 రోజుల వరకు ఔషధాలు, ఇతర వ్యాధి నిర్ధారణ, వైద్యుల కన్సల్టేషన్ కోసం అయ్యే ఖర్చులనూ పొందొచ్చు. కరోనా కవచ్ పాలసీలు ‘హాస్పిటల్ డైలీ క్యాష్’ రైడర్‌నూ ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఆస్పత్రిలో చేరినప్పుడు వ్యక్తిగతంగా కొన్ని ఖర్చులు అవుతుంటాయి. అటువంటప్పుడు ఈ కవరేజీ అక్కరకు వస్తుంది. దీన్ని ఎంచుకుంటే బీమా మొత్తంలో 0.5 శాతాన్ని ప్రతీ రోజుకు బీమా సంస్థలు అందిస్తాయి. కాకపోతే 24 గంటలకు మించి ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలి. అదే కరోనా రక్షక్పాలసీ విషయంలో పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఎంచుకున్న బీమా పరిహారాన్ని ఏక మొత్తంలో పొందవచ్చు. ఉదాహరణకు రూ.2.5 లక్షల సమ్ ఇన్సూర్డ్ ఎంచుకున్నారనుకుంటే.. కరోనా పాజిటివ్ అయి 72 గంటలు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు ఖర్చు ఎంతయిందన్న దానితో సంబంధం లేకుండా బీమా సంస్థ రూ.2.5 లక్షలను చెల్లించేస్తుంది. 72 గంటల్లోపు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయితే ఈ పాలసీలో పరిహారం రాదు. వీటిని దృష్టిలో ఉంచుకోవాలి ఇతర హెల్త్ ప్లాన్లలో మాదిరే కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీల్లోనూ 15 రోజులు వేచి ఉండే కాలం (వెయిటింగ్ పీరియడ్) అమల్లో ఉంటుంది. అంటే పాలసీ ఇష్యూ చేసిన మొదటి 15 రోజుల్లో కరోనా బారిన పడినా క్లెయిమ్‌కు అర్హత ఉండదు. పరిహారానికి సంబంధించి తగ్గింపు నిబంధనల్లేవు. పోర్టబులిటీ ఆప్షన్ ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవడం అన్నది బీమా సంస్థలను బట్టి నిబంధనలు వేర్వేరుగా అమల్లో ఉండొచ్చు. వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి కరోనా కవచ్ పాలసీ ప్రీమియంలో 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ రెండు రకాల పాలసీల్లో మినహాయింపులు కొన్ని ఉన్నాయి. ఆమోదం లేని చికిత్సా విధానాలకు ఇందులో కవరేజీ లభించదు. కరోనా చికిత్సలో భాగంగా కొన్ని మందులను ప్రయోగాత్మకంగా ఇస్తున్న వార్తలను వింటూనే ఉన్నాం. నియంత్రణ సంస్థల ఆమోదంతో ఇస్తున్న ఔషధాలు, చికిత్సలకు సంబంధించే కవరేజీ లభిస్తుందని గుర్తుంచుకోవాలి. ప్రయాణ పరంగా ఆంక్షలు అమల్లో ఉన్న ఏ ఇతర దేశంలో పర్యటించినా పాలసీ రద్దయిపోతుంది. డే కేర్ చికిత్సలు (ఆస్పత్రిలో చేరకుండా తీసుకునే చికిత్సలు), ఔట్ పేషెంట్ చికిత్సలకు కరోనా కవచ్ పాలసీలో కవరేజీ ఉండదు. కరోనా ప్రత్యేక పాలసీలకు వస్తున్న స్పందన అనూహ్యం. పాలసీబజార్ వెబ్సైట్ నిత్యం 300–500 పాలసీలను విక్రయిస్తోంది. తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది యువతే. – అముత్ చాబ్రా, హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్, పాలసీబజార్ ఎక్కువ మంది తొమ్మిదిన్నర నెలల కాలానికి పాలసీ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ 40 శాతం మంది హాస్పిటల్ డైలీ క్యాష్‌ను ఎంచుకుంటున్నారు. – సుబ్రతా మోండల్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (అండర్‌రైటింగ్), ఇఫ్కోటోకియా జనరల్ ఇన్సూరెన్స్ కుటుంబంలోని ఇతర సభ్యులకు కవరేజీతోపాటు, ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నా ఖర్చులు చెల్లించే ఫీచర్లు ఉండడం ఎక్కువ ఆసక్తికి కారణం. – సుబ్రమణ్యం బ్రహ్మజోస్యుల, అండర్‌రైటింగ్ హెడ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ -
రోడ్డు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షల నష్ట పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రమాదానికి కారణమైన వాహన యజమాని నుంచి బాధితులకు ఈ మొత్తాన్ని ఇప్పిస్తారు. ఈ బిల్లుకు గత లోక్‌సభలోనే ఆమోదం లభించినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందక గడువు చెల్లిపోయింది. దీంతో మళ్లీ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు, ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం అందించే మంచి వ్యక్తులకు ఇబ్బందులు లేకుండా చూడటం తదితర కొత్త నిబంధనలను బిల్లులో కేంద్రం చేర్చింది. ఈ బిల్లు రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలిగిస్తోందని తృణమూల్ ఎంపీలు ఆరోపించారు. కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్చౌధురీ ఈ బిల్లులోని కొన్ని నిబంధనలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. బిల్లులోని నిబంధనలను అమలు చేయాలో లేదో పూర్తిగా రాష్ట్రాల ఇష్టమనీ, అయితే మరిన్ని ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు అందరూ ఆమోదం తెలపాలని రవాణా మంత్రి గడ్కరీ కోరారు. -
వృత్తి నిపుణులకూ ఉంది రక్ష..!
ఇండెమ్నిటీ పాలసీలతో ప్రొఫెషనల్స్‌కు భరోసా వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు సహా పలువురికి సేవలు.. బాధితులకు పరిహారం చెల్లించేది బీమా కంపెనీలే.. బాధ్యతారాహిత్యం, తప్పిదం ప్రధానాంశాలే.. కేసుల్లో ఖర్చుల నుంచి, పరిహారం దాకా బీమాదే.. ’’ఉన్నదంతా ఊడ్చేశాను. ఆఖరికి అప్పులు కూడా చేశాను. అయినా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. మాకు న్యాయం కావాలి’’ - ఓ దంపతుల ఆవేదన... ‘‘ఈ లాయర్‌ను నమ్ముకుని భారీగా ఖర్చుచేశా. కానీ లాయర్ తప్పిదం కారణంగా కేసును వీగిపోయా. నాకు నష్టం జరిగింది’’ - కోర్టులో ఒక కక్షిదారు పిటిషన్ ‘‘ఆర్కిటెక్ట్ సరిగా డి జైన్ చెయ్యలేదు. డిజైన్ లోపం వల్లే నిర్మాణం దెబ్బతింది. నాకు కోట్ల రూపాయల నష్టం జరిగింది. నాకు పరిహారం కావాలి’’ - కోర్టులో పిటిషన్ ద్వారా ఓ భారీ భవంతి యజమాని అభ్యర్థన... చూడటానికివన్నీ వేరువేరు సంఘటనలే. కాకపోతే మూడింట్లోనూ ఇమిడి ఉన్న ఒకే ఒక అంశమేంటంటే... ఈ సందర్భాలన్నిట్లో సేవలు పొందిన వారు నష్టపోయారు. మరి వారికి న్యాయం జరిగేదెలా? ఇదిగో... సరిగ్గా ఇలాంటి సమస్యల్ని పరిష్కరించడం ద్వారా దీన్లోని వ్యాపారాన్ని అందిపుచ్చుకోవటానికి బీమా కంపెనీలు కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వృత్తి నిపుణుల తరఫున బాధితులకు పరిహారం అందించే పాలసీలను అందజేస్తున్నాయి. న్యాయవాదులు, వైద్యులు, ఆర్కిటెక్ట్‌ల వంటి వృత్తి నిపుణులు ఈ పాలసీలను తీసుకునే ధోరణి ఇపుడు పెరుగుతోంది. ఓ నిపుణుడి నిర్లక్ష్య ధోరణి కారణంగా సేవలు పొందిన వ్యక్తి నష్టపోతే ఇరువురినీ ఆదుకునేందుకు ఈ పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి. వీటినే ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ పాలసీలుగా పిలుస్తున్నారు. ప్రీమియం కాస్త ఎక్కువే... పాలసీ ప్రీమియం అనేది... తీసుకునే వారిని బట్టి ఉంటుంది. ఓ వైద్యుడు రూ.50 లక్షల పరిహారం కోసం పాలసీ తీసుకుంటే 1% అంటే రూ. 50 వేల ప్రీమియం చెల్లించుకోవాలి. వైద్యుల్లోనూ ఫీజీషియన్ కంటే సర్జన్‌కు ప్రీమియం అధికంగా ఉంటుంది. ఎందుకంటే శస్త్రచికిత్స విఫలమైన పక్షంలో రోగుల ప్రాణాలకు ముప్పుంటుంది. అదే రిస్క్ తక్కువగా ఉండే వర్గాలకు ఇన్సూరెన్స్ మొత్తంలో 0.30% ప్రీమియంనే బీమా కంపెనీలు వసూలు చేస్తున్నాయి. ఎవరికి ఈ పాలసీలు..? స్వతంత్రంగా సేవలందించే ఎవరైనా ఈ పాలసీలు తీసుకోవచ్చు. అంటే లాయర్లు, ఆర్కిటెక్ట్‌లు, వైద్యులు, ఇంజనీర్లు, ప్రకటనల నిపుణులు, కంపెనీ సెక్రటరీలు, ప్రజా సంబంధాల నిపుణులు, మేనేజ్మెంట్ నిపుణులు, కళాత్మక వస్తువులకు విలువ కట్టేవారు, వేలందారులు, టూర్ ఆపరేటర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, బీమా బ్రోకింగ్ సేవలందించేవారితో పాటు విద్యా సంస్థలు, ఇంకా సలహా సేవలందించే ఇతర రంగాల నిపుణులు పాలసీలు తీసుకోవచ్చు. పాలసీ ఉందికదా అని నిర్లక్ష ్యం కూడదు! పాలసీ ఉంది కదా అని వృత్తి నిపుణులు బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా సేవలు అందిస్తే జరిగే నష్టానికి బీమా కంపెనీలు పరిహారం నిరాకరించవచ్చు. పాలసీ నిబంధనల్లో ఇలాంటి ఎన్నో మినహాయింపులుంటాయి. అందుకే పాలసీ తీసుకునే ముందే పరిహారం విషయమై మినహాయింపుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. అంటే పాలసీ నియమ, నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. అలాగే మోసపూరిత, నేరపూరిత, కాపీరైట్ చట్టాల ఉల్లంఘన ఘటనలకు కూడా పరిహారం రాదు. ఇలాంటివి మినహాయిస్తే బాధ్యతాయుతంగా అందించే సేవల్లో జరిగే నష్టాలకు నిపుణులు బాధితులుగా మారకుండా ఇండెమ్నిటీ పాలసీలు రక్షణనిస్తాయి. ఏ సందర్భంలో పరిహారం..? ఉదాహరణకు వైద్యుడి సేవా లోపం కారణంగా ఓ రోగి ప్రాణం కోల్పోయాడంటూ బాధితుని కుటుంబం కోర్టును ఆశ్రయించింది. మరి వైద్యుడు కూడా జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని వాదించుకోవటానికి ఒక న్యాయవాదిని పెట్టుకోవాలి కదా? తనకు ఛార్జీలు చెల్లించాలి కదా!! ఒకవేళ కేసులో ఓడిపోయి పరిహారం చెల్లించాల్సి వస్తే తానే చెల్లించాలి కదా!! ఇవన్నీ తప్పనిసరి. కాకపోతే ఇండెమ్నిటీ పాలసీ గనక తీసుకుని ఉంటే... ఈ భారమంతా బీమా కంపెనీ తలకెత్తుకుంటుంది.