ఎస్‌బీఐ లైఫ్ ఐపీవోకు గ్రీన్‌సిగ్నల్
రూ.7,000 కోట్ల నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని ప్రముఖ బీమా కంపెనీ ఎస్‌బీఐ లైఫ్ తొలి పబ్లిక్ ఇష్యూకు (ఐపీవో) సెబీ నుంచి ఆమోదం లభించింది. ఐపీవోకు సంబంధించి ఎస్‌బీఐ లైఫ్ ఈ ఏడాది జూలైలో దరఖాస్తు చేసుకుంది. ఐపీవో ద్వారా రూ.6,500–7,000 కోట్ల వరకు నిధులను సమీకరించే అవకాశాలున్నాయి. ఐపీవోలో భాగంగా 12 కోట్ల షేర్ల (రూ.10 ముఖ విలువ)ను ఎస్‌బీఐ లైఫ్ ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఇది 12 శాతం ఈక్విటీకి సమానం. ఎస్‌బీఐ లైఫ్‌లో ఎస్‌బీఐకి 70.1 శాతం వాటా ఉంది. ఐపీవోలో భాగంగా ఈ సంస్థ 8 కోట్ల షేర్లను విక్రయించనుంది.
26 శాతం వాటా కలిగిన ఫ్రాన్స్ సంస్థ బీఎన్‌పీ పరిబాస్ కార్డిఫ్ 4 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. ఇంకా ఎస్‌బీఐ లైఫ్‌లో కేకేఆర్ ఆసియా ఫండ్, టెమాసెక్ హల్డింగ్స్‌కు 1.95 శాతం చొప్పున మైనారిటీ వాటాలున్నాయి. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.7,000 కోట్ల వరకు సమీకరించే యోచనలో ఉన్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ‘‘ఈక్విటీ షేర్ల లిస్టింగ్‌తో ఎస్‌బీఐ లైఫ్ బ్రాండ్ పేరు విస్తృతం అవుతుంది. కంపెనీ ప్రస్తుత వాటాదారులకు నిధుల లభ్యత ఏర్పడుతుంది. ఈక్విటీ షేర్లకు పబ్లిక్ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది’’ అని కంపెనీ తెలిపింది.
పరిశీలనలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఐపీవో
మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ), న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ సైతం సెబీ వద్ద ఐపీవోకు దరఖాస్తు చేసుకుని అనుమతి కోసం వేచి చూస్తున్న విషయం తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఐపీవో విషయంలో బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) నుంచి కొన్ని వివరణలను సెబీ కోరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, జీఐసీ ఐపీవోకు సంబంధించి మర్చంట్ బ్యాంకర్ల నుంచి కూడా వివరణలు రావాల్సి ఉందని వెల్లడించాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్ దాఖలు చేసిన ఐపీవో పత్రాలు పరిశీలనలో ఉన్నట్టు ఆయా వర్గాలు పేర్కొన్నాయి.