న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ల ర్యాలీ (సెకండరీ మార్కెట్)తో ప్రైమరీ మార్కెట్‌లో ఐపీవో ఇష్యూల సందడి మళ్లీ మొదలవుతోంది. ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు ఎంతో అనిశ్చి తులను చవిచూశాయి. ఫలితంగా మొదటి పది నెలల కాలంలో వచ్చిన పేరున్న ఐపీవో ఇష్యూలు 20లోపునకే పరిమితమయ్యాయి. ప్రతికూల పరిస్థితుల్లో ఇష్యూలు పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అవుతాయన్న నమ్మకం ఉన్న కంపెనీలే వాటిని చేపట్టాయి. చాలా కంపెనీలు ఐపీవో ఇష్యూ చేపట్టాలని అనుకుంటున్నా, సానుకూల వాతావరణం కోసం వేచి చూస్తున్నాయి. కొన్ని ఆఫర్ పత్రాలను దాఖలు చేసినా ముందుకు వెళ్లలేకపోయాయి.
సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్ను భారీ తగ్గింపు నిర్ణయం తర్వాత ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ బాటలో పడ్డాయి. దీంతో ఐపీవో ఇష్యూలతో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. గత రెండు నెలల్లో రూట్ మొబైల్, మాంటే కార్లో, మజ్‌గాన్ డాక్ షిప్‌బిల్డర్స్, ఇండియన్ రెన్యువబుల్ డెవలప్‌మెంట్ ఎనర్జీ, ముంబైకి చెందిన పురానిక్ బిల్డర్స్ సంస్థలు సెబీ వద్ద ఐపీవో ఆఫర్ పత్రాలను మరోసారి దాఖలు చేశాయి. తాజాగా ఎస్‌బీఐకి చెందిన ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (క్రెడిట్‌కార్డు కంపెనీ) కూడా ఆఫర్ పత్రాలను దాఖలు చేసింది. వచ్చే కొన్ని నెలల్లో ఐపీవో కోసం యూటీఐ మ్యూచువల్ ఫండ్, పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఐపీవో పత్రాలను సెబీ ముందు దాఖలు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
27 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్...
ఇప్పటి వరకు సెబీ నుంచి ఐపీవో కోసం 27 కంపెనీలు అనుమతి పొందాయి. ఇవి ఐపీవో ఇష్యూల ద్వారా రూ.18,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, బజాజ్ ఎనర్జీ, శ్రీరామ్ ప్రాపర్టీస్, పెన్నా సిమెంట్ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. మరో ఏడు సంస్థల వరకు ఆఫర్ పత్రాలను దాఖలు చేసి, అనుమతి కోసం వేచి ఉన్నాయి. ఈ ఏడాది 14 కంపెనీలు కలసి సుమారు రూ.15,000 కోట్ల వరకు నిధులను ఐపీవో ద్వారా సమీకరించాయి. వీటిల్లో ఒక్కటి మినహా (స్టెర్లింగ్ అండ్ విల్సన్) అన్నీ ఇష్యూ ధర కంటే ఎక్కువలోనే ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో ఐఆర్‌సీటీసీ, యాఫిల్ ఇండియా, ఇండియామార్ట్ ఇంటర్‌మెష్ మాత్రం ఇష్యూ ధర కంటే నూరు శాతం మించి పెరిగాయి. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో ఐపీవో మార్కెట్లో రూ.లక్ష కోట్లకు పైగా నిధుల సమీకరణ జరిగింది.
స్థిరమైన ర్యాలీ ఉంటేనే...
సెకండరీ మార్కెట్లో మంచి ర్యాలీ ఉంటే తప్ప, ప్రైమరీ మార్కెట్లో (ఐపీవోలు) వాతావరణం మారకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా రివకరీ సంకేతాలు ఇవ్వలేదని, కేంద్రం కార్పొరేట్ పన్ను తగ్గింపుతో లిక్విడిటీ (నిధుల రాక) ఆధారంగా జరుగుతున్న ప్రస్తుత మార్కెట్ల ర్యాలీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నది బ్రోకరేజీల అభిప్రాయం. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు 12 శాతం మేర పెరిగింది. ‘‘ఈ ఏడాది పలు ఐపీవోలకు అనుమతుల గడువు కూడా తీరిపోయింది. తాము ఆశిస్తున్న ధరకు తగినంత డిమాండ్ లేని పరిస్థితుల్లో ఇదే వాతావరణం కొనసాగొచ్చు’’ అని ప్రైమ్ డేటా బేస్ ఎండీ ప్రణవ్ హల్దియా పేర్కొన్నారు. ‘‘మార్కెట్‌లో ఇప్పటికీ ఎంతో అనిశ్చితి ఉంది. తిరిగి ఆఫర్ పత్రాలను దాఖలు చేయడం వల్ల ఈ వాతావరణం మెరుగుపడిన వెంటనే ఐపీవోలకు వచ్చేందుకు కంపెనీలకు వీలు కలుగుతుంది’’ అని పీఎల్ మార్కెట్స్ వైస్ ప్రెసిడెంట్ దారా కల్యాణి వాలా చెప్పారు.
మంచి ఇష్యూలకు భారీ డిమాండ్
ఈ ఏడాది మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. మంచి వ్యాపార నమూనాలు కలిగిన కంపెనీలు, ఆకర్షణీయమైన ధరలతో వచ్చిన ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణే దక్కింది. ముఖ్యంగా ఐఆర్‌సీటీసీ, యాఫిల్ ఇండియా, ఇండియామార్ట్, పాలీక్యాబ్, నియోజన్ కెమికల్స్, సీఎస్‌బీ బ్యాంకు ఇష్యూలకు భారీ స్పందనే లభించింది. లిస్టింగ్‌లోనూ లాభాలు కురిపించాయి. ఐఆర్‌సీటీసీ షేరు ఇష్యూ ధర రూ.320 కాగా, లిస్టింగ్‌లోనే వాటాదారులకు 100% లాభాలిచ్చింది. యాఫ్లే ఇండియా కూడా ఇష్యూ ధర నుంచి చూస్తే ఇప్పటికే 119% ర్యాలీ చేసింది. కేరళకు చెందిన సీఎస్‌బీ బ్యాంకు ఇష్యూ ఈ నెల 27న ముగియగా 87 రెట్లు అధికంగా బిడ్లు రావడం గమనార్హం. వచ్చే వారం మొదలయ్యే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఐపీవోకు, త్వరలో రానున్న ఎస్‌బీఐ కార్డ్స్ ఇష్యూకు సైతం మంచి స్పందన ఉంటుందనేది మార్కెట్ వర్గాల అంచనా.
త్వరలో ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీవో...
ఇష్యూ సైజు రూ.9,500 కోట్ల రేంజ్‌లో...
ముంబై: ఎస్‌బీఐకు చెందిన దేశంలోనే రెండో అతి పెద్ద క్రెడిట్ కార్డ్ కంపెనీ... ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీవో పత్రాలను సెబీకి బుధవారం సమర్పించింది. ఇష్యూలో భాగంగా రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్)లో ఎస్‌బీఐ, కార్లైల్ గ్రూప్‌నకు చెందిన సీఏ రోవర్ హోల్డింగ్స్ సంస్థలు 13.05 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తాయి. మొత్తం మీద ఈ ఐపీవో సైజు రూ.8,000–9,500 కోట్ల రేంజ్‌లో ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకుంటే ఈ కంపెనీ విలువ రూ.65,000 కోట్ల మేర ఉండగలదని అంచనా. సెబీ ఆమోదం లభిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి పెద్ద ఐపీవో అవుతుంది. వచ్చే ఏడాది మార్చిలోనే మార్కెట్లో లిస్టింగ్ చేయాలని కంపెనీ భావిస్తోంది.
ఐపీవోలకు అచ్ఛేదిన్!
Published Thu, Nov 28 2019 4:06 AM | Last Updated on Thu, Nov 28 2019 4:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment