
కాటన్ మరిచినందుకు 8 లక్షల ఫైన్
అహ్మదాబాద్
ఆపరేషన్ సమయంలో కడుపులో కత్తెర, కత్తులు, కాటన్, ఆ మధ్య మొబైల్ ఫోన్ మర్చిపోయి కుట్లు వేయడం.. ఆ తర్వాత లబోదిబోమంటూ బాధితులు మళ్లీ ఆస్పత్రుల చుట్టూ తిరగడం మనం వింటూనే ఉన్నాం. ఇలాంటి కేసులో గుజరాత్ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు వెలువరించింది. వినియోగదారుల కోర్టు తీర్పును సవాలు చేస్తూ డాక్టర్ వందన, బీమా కంపెనీ పిటిషన్ను తిరస్కరించడమే కాకుండా.. ఆపరేషన్ సమయంలో కడుపులో కాటన్ మర్చిపోయి కుట్లు వేసేసిన మహిళా డాక్టర్ (గైనకాలజిస్ట్) పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. బాధితురాలికి రూ. 8 లక్షల నష్ట పరిహారంతో పాటు, కోర్టు ఖర్చులకు గాను పదివేల రూపాయలు చెల్లించాల్సిందిగా డాక్టర్ను, బీమా కంపెనీని ఆదేశించింది.
అహ్మదాబాద్కు చెందిన మితాబెన్ పాటిల్ తీవ్రమైన గైనిక్ సమస్యలతో బాధపడుతూ డాక్టర్ వందన అమిన్ను కలిశారు. చివరికి అక్టోబర్ 2002 లో ఆమెకు శస్త్రచికిత్స చేసి గర్భసంచిని తొలగించారు. దీంతో ఆరోగ్యం కుదుటపడుతుందని ఆశపడిన మితాబెన్ను మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. అయితే ఆపరేషన్ సమయంలో పొట్టలో కాటన్ మర్చిపోయినట్టుగా పరీక్షల్లో తేలింది. చివరికి ఏడాది తర్వాత మరో ఆపరేషన్ చేసి ఆ కాటన్ను తొలగించారు.
ఈ వ్యవహారంపై మితాబెన్ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తన జీర్ణవ్యవస్థ దెబ్బతిందని, శరీరంలోని కొన్ని అంతర్భాగాలు పాడయ్యాయని ఆరోపిస్తూ కోర్టులో కేసు వేశారు. 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కోరుతూ పిటిషన్ దాఖలుచేశారు. దీంతో డాక్టర్ వందన స్థానికంగా నడుపుతున్న నర్సింగ్ హోమ్కు బీమా సౌకర్యం కల్పించిన కంపెనీ కూడా ఈ కేసులో ఇరుక్కుంది. వినియోగదారుల కోర్టు మితా బెన్కు రూ. 8 లక్షలు చెల్లించాలంటూ తీర్పుచెప్పింది.
ఈ తీర్పుపై డాక్టర్ వందన, బీమా సంస్థ వినియోగదారుల వివాదాల రిడ్రెసల్ కమిషన్ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ కింది కోర్టు తీర్పును అభినందిస్తూ తీర్పును వెలువరించింది. ఆపరేషన్ సమయంలో అన్నీ జాగ్రత్తగా పరిశీలించాల్సిన బాధ్యత డాక్టర్కు లేదా అని ప్రశ్నించింది. ఇది డాక్టర్ నిర్లక్ష్యం కాకపోతే మరేమిటని మండిపడింది. ఆపరేషన్ సమయంలో రోగి కడుపులో ఏదైనా మర్చిపోతే అది...కచ్చితంగా డాక్టర్ అశ్రద్ధ కిందికే వస్తుందని తేల్చి చెప్పింది. మొత్తం 12 ఏళ్లకు గాను 8 లక్షల రూపాయలకు తొమ్మిది శాతం వడ్డీని కలిపి చెల్లించాలని పేర్కొంది. నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడమే కాకుండా.. బాధితురాలిని కోర్టు కీడ్చినందుకు మరో పదివేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.