న్యూఢిల్లీ: దేశీయంగా బీమా కంపెనీలకు పెట్టుబడులపరమైన తోడ్పాటు లభించేలా ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచే బిల్లుకు పార్లమెంటు సోమవారం ఆమోదముద్ర వేసింది. వాయిస్ వోట్ ద్వారా లోక్‌సభలో దీనికి ఆమోదం లభించింది. ఇప్పటిదాకా జీవిత బీమా, సాధారణ బీమా విభాగాల్లో ఈ పరిమితి 49 శాతంగా ఉంది. బీమా చట్టం 1938ని సవరిస్తూ ప్రతిపాదించిన ఇన్సూరెన్స్ (సవరణ) బిల్లు 2021కి రాజ్యసభ గతవారమే ఆమోదముద్ర వేసింది.
ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచడం .. బీమా కంపెనీలు మరిన్ని నిధులు సమీకరించుకునేందుకు, ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు తోడ్పడగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు అవసరమైన నిధులను కేంద్రం సమకూరుస్తోందని, తమంతట తాము నిధులు సమీకరించుకోవాల్సిన ప్రైవేట్ సంస్థలకు ఎఫ్‌డీఐల పరిమితి పెంపుతో కొంత ఊతం లభించగలదని ఆమె తెలిపారు. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ సిఫార్సులు, సంబంధిత వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన మీదట పరిమితి పెంపు నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. గతంలో బీమా రంగంలో 26 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 2015లో 49%కి పెంచగా.. తాజాగా దాన్ని 74 శాతానికి పెంచినట్లు తెలిపారు.
కంపెనీలకు కోవిడ్ కష్టాలు..
సాల్వెన్సీ మార్జిన్ల నిర్వహణకు (జరపాల్సిన చెల్లింపులతో పోలిస్తే అసెట్స్ నిష్పత్తి) సంబంధించి బీమా కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని మంత్రి చెప్పారు. ‘బీమా సంస్థలు.. ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు.. నిధుల సమీకరణపరంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. కోవిడ్–19 మహమ్మారి కష్టాలు దీనికి తోడయ్యాయి. ఈ నేపథ్యంలో కార్యకలాపాల వృద్ధికి అవసరమైన పెట్టుబడులు రాకపోతే పరిస్థితి మరింత కష్టతరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఎఫ్‌డీఐ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉంది‘ అని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఏడు ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో మూడు కంపెనీల్లో సాల్వెన్సీ మార్జిన్లు నిర్దేశించిన స్థాయికన్నా తక్కువ ఉన్నాయని మంత్రి చెప్పారు. అయితే, వాటికి కావాల్సిన అదనపు మూలధనాన్ని సమకూర్చడం ద్వారా అవి ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం తగు సహాయం చేస్తుందని పేర్కొన్నారు.
ఏయూఎం.. 76 శాతం అప్..
2015 నుంచి బీమా రంగంలోకి రూ. 26,000 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని, నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) పరిమాణం గడిచిన అయిదేళ్లలో 76 శాతం పెరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. బీమా కంపెనీల సంఖ్య 53 నుంచి 68కి పెరిగిందని, గత అయిదేళ్లలో 6 కంపెనీలు స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయని వివరించారు. బీమా సంస్థల్లో 74% ఎఫ్‌డీఐలనేది గరిష్ట పరిమితి మాత్రమేనని, ఆయా కంపెనీలు దీన్ని కచ్చితంగా ఆ స్థాయికి పెంచుకోవాలనేమీ లేదని మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న 2021–22 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐని పెంచేలా సీతారామన్ ప్రతిపాదన చేశారు.
బిల్లులో ప్రత్యేకాంశాలు..
► బీమా సంస్థలు.. పాలసీదారుల సొమ్మును భారత్‌లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. విదేశాలకు తీసుకెళ్లేందుకు కుదరదు. లాభాల్లో కొంత భాగాన్ని భారత్‌లోనే అట్టే ఉంచాలి.
► బోర్డులో మెజారిటీ డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్‌లో కీలక సభ్యులు స్థానిక భారతీయులే ఉండాలి. డైరెక్టర్లలో కనీసం 50 శాతం మంది స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి.
ఇన్‌ఫ్రా కోసం నాబ్‌ఫిడ్ బిల్లు..
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్ (డీఎఫ్‌ఐ) ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (నాబ్‌ఫిడ్) బిల్లు 2021ని సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రూ. 20,000 కోట్లతో ఏర్పాటయ్యే డీఎఫ్‌ఐ రాబోయే కొన్నేళ్లలో రూ. 3 లక్షల కోట్ల దాకా నిధులు సమీకరించవచ్చు. తద్వారా నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కింద దాదాపు 7,000 ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు నిధులను సమకూర్చేందుకు ఇది తోడ్పడనుంది. మరోవైపు, మైనింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలకు ఉద్దేశించిన గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు 2021ని ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment