కొత్తగా పాలసీ తీసుకుంటున్నారా..
ఈ మధ్య కాలంలో బీమా రంగంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులలో అతి ముఖ్యమైనది బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐలు) పరిమితి పెంపు. బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ కేంద్రం బీమా బిల్లును తీసుకువచ్చిన విషయం విదితమే. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఈ బిల్లు బీమా రంగ అభివృద్ధికి దోహదపడనుంది. ఈ బీమా బిల్లు వల్ల వినియోగదారులకు చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి.
ప్రస్తుతం ఎవరైతే కొత్తగా పాలసీని తీసుకోవాలని భావిస్తున్నారో వారు తప్పకుండా బీమా బిల్లు ద్వారా బీమా రంగంలో వచ్చిన మార్పులను, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకోవాలి.
పాలసీ విధానాలు మరింత సరళం
గతంతో పోలిస్తే ప్రస్తుతం పాలసీ విధానాలు చాలా సరళంగా ఉన్నాయి. అంటే మనం పాలసీని తీసుకోవడం, పేమెంట్ విధానాలు తదితర అంశాలు మరింత సులభతరం అయ్యాయని దీని అర్థం. గతంలో పాలసీదారు మరణిస్తే వచ్చే మొత్తాన్ని రుణదాతకి, నామినీకి ఇచ్చే అంశంలో కొంత సందిగ్ధత ఉండేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు అలా లేదు. పాలసీదారు మరణిస్తే వచ్చే మొత్తాన్ని బీమా కంపెనీనే బ్యాంకుకు ఇవాల్సిన మొత్తాన్ని క్రెడిటార్ బ్యాంకుకు, నామినీకి ఇవ్వాల్సిన మొత్తాన్ని నామినీకి ఇస్తుంది.
ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.50 లక్షలకు పాలసీ తీసుకున్నాడు. అతను బ్యాంకుకు రూ.20 లక్షలు అప్పు ఉన్నాడు. ఒకవేళ అతను మరణిస్తే వచ్చే రూ.50 లక్షలలో రూ.20 లక్షలను బీమా కంపెనీ బ్యాంకుకు, మిగిలిన మొత్తాన్ని నామినీకి ఇస్తుంది. ఇది గ్రామీణ పాలసీదారులకు ఎంతగానో ఉపయుక్తం.
నామినేషన్ ప్రక్రియలో స్పష్టత
ఇంతకు ముందు నామినీ పేరు తప్పకుండా ఉండాలి అనే నిబంధన ఉండేది కాదు. నామినీ పేరు లేకపోతే పాలసీదారు మరణించిన తర్వాత వచ్చే మొత్తం చట్టపరమైన వారసులకు సమానంగా వేళ్లేది. కానీ ప్రస్తుతం ‘బెనిఫీషియరీ నామినీ’ పేరును తప్పకుండా చేర్చాలి అనే నిబంధన బీమా బిల్లులో ఉంది. దీనివల్ల పాలసీ తీసుకునే సమయంలో నామినీగా పేర్కొన్న సదరు వ్యక్తికి వచ్చే డబ్బుపై పూర్తి అధికారం ఉంటుంది.
3 ఏళ్ల తర్వాత క్లయిమ్ నిరాకరణకు వీల్లేదు
పాలసీని తీసుకున్న మూడేళ్ల తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ క్లయిమ్‌ను నిరాకరించడానికి కానీ, తిరస్కరించడానికి కానీ ప్రస్తుతం బీమా కంపెనీలకు ఎలాంటి అధికారం లేదు. దీని వల్ల పాలసీదారులకు వారి క్లయిమ్స్ విషయంలో స్పష్టత వచ్చింది. కానీ గతంలో పాలసీదారు తప్పుడు సమాచారం ఇచ్చారన్న సాకుతో మూడేళ్లు దాటినా బీమా కంపెనీలు క్లయిమును తిరస్కరించే అవకాశం వుండేది.