Insurance Bill
-
కొత్తగా పాలసీ తీసుకుంటున్నారా..
ఈ మధ్య కాలంలో బీమా రంగంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులలో అతి ముఖ్యమైనది బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐలు) పరిమితి పెంపు. బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ కేంద్రం బీమా బిల్లును తీసుకువచ్చిన విషయం విదితమే. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఈ బిల్లు బీమా రంగ అభివృద్ధికి దోహదపడనుంది. ఈ బీమా బిల్లు వల్ల వినియోగదారులకు చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రస్తుతం ఎవరైతే కొత్తగా పాలసీని తీసుకోవాలని భావిస్తున్నారో వారు తప్పకుండా బీమా బిల్లు ద్వారా బీమా రంగంలో వచ్చిన మార్పులను, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకోవాలి. పాలసీ విధానాలు మరింత సరళం గతంతో పోలిస్తే ప్రస్తుతం పాలసీ విధానాలు చాలా సరళంగా ఉన్నాయి. అంటే మనం పాలసీని తీసుకోవడం, పేమెంట్ విధానాలు తదితర అంశాలు మరింత సులభతరం అయ్యాయని దీని అర్థం. గతంలో పాలసీదారు మరణిస్తే వచ్చే మొత్తాన్ని రుణదాతకి, నామినీకి ఇచ్చే అంశంలో కొంత సందిగ్ధత ఉండేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు అలా లేదు. పాలసీదారు మరణిస్తే వచ్చే మొత్తాన్ని బీమా కంపెనీనే బ్యాంకుకు ఇవాల్సిన మొత్తాన్ని క్రెడిటార్ బ్యాంకుకు, నామినీకి ఇవ్వాల్సిన మొత్తాన్ని నామినీకి ఇస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.50 లక్షలకు పాలసీ తీసుకున్నాడు. అతను బ్యాంకుకు రూ.20 లక్షలు అప్పు ఉన్నాడు. ఒకవేళ అతను మరణిస్తే వచ్చే రూ.50 లక్షలలో రూ.20 లక్షలను బీమా కంపెనీ బ్యాంకుకు, మిగిలిన మొత్తాన్ని నామినీకి ఇస్తుంది. ఇది గ్రామీణ పాలసీదారులకు ఎంతగానో ఉపయుక్తం. నామినేషన్ ప్రక్రియలో స్పష్టత ఇంతకు ముందు నామినీ పేరు తప్పకుండా ఉండాలి అనే నిబంధన ఉండేది కాదు. నామినీ పేరు లేకపోతే పాలసీదారు మరణించిన తర్వాత వచ్చే మొత్తం చట్టపరమైన వారసులకు సమానంగా వేళ్లేది. కానీ ప్రస్తుతం ‘బెనిఫీషియరీ నామినీ’ పేరును తప్పకుండా చేర్చాలి అనే నిబంధన బీమా బిల్లులో ఉంది. దీనివల్ల పాలసీ తీసుకునే సమయంలో నామినీగా పేర్కొన్న సదరు వ్యక్తికి వచ్చే డబ్బుపై పూర్తి అధికారం ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత క్లయిమ్ నిరాకరణకు వీల్లేదు పాలసీని తీసుకున్న మూడేళ్ల తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ క్లయిమ్‌ను నిరాకరించడానికి కానీ, తిరస్కరించడానికి కానీ ప్రస్తుతం బీమా కంపెనీలకు ఎలాంటి అధికారం లేదు. దీని వల్ల పాలసీదారులకు వారి క్లయిమ్స్ విషయంలో స్పష్టత వచ్చింది. కానీ గతంలో పాలసీదారు తప్పుడు సమాచారం ఇచ్చారన్న సాకుతో మూడేళ్లు దాటినా బీమా కంపెనీలు క్లయిమును తిరస్కరించే అవకాశం వుండేది. -
శ్రీరామ్ లైఫ్ నుంచి 3 కొత్త పథకాలు
- కొత్తగా 2,000 మంది ఏజెంట్ల నియామకం - వచ్చే ఏడాది 55 శాఖల ఏర్పాటు - బీమా బిల్లుతో పరిశ్రమ వేగంగా విస్తరిస్తుంది - శ్రీరామ్ లైఫ్ సీఈవో మనోజ్ కుమార్ జైన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాదిలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా 30 శాతం వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను ప్రైవేటురంగ జీవిత బీమా కంపెనీ శ్రీరామ్‌లైఫ్ ప్రకటించింది. ఫిబ్రవరి నాటికి రూ. 415 కోట్ల కొత్త ప్రీమియం వసూళ్లు చేయడం ద్వారా వ్యాపారంలో 26 శాతం వృద్ధిని నమోదు చేశామని, కొత్తగా ప్రవేశపెట్టిన మూడు పథకాలతో పూర్తి ఏడాదికి రూ. 490 కోట్ల మార్కును చేరుకోగలమన్న ధీమాను శ్రీరామ్ లైఫ్ సీఈవో మనోజ్ కుమార్ జైన్ తెలిపారు. గతేడాది కంపెనీ రూ. 395 కోట్ల కొత్త ప్రీమియాన్ని వసూలు చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి వరకు జీవిత బీమా పరిశ్రమలో తొమ్మిది శాతం నెగిటివ్ వృద్ధి నమోదైనప్పటికీ, శ్రీరామ్‌లైఫ్ మాత్రం 26 శాతం అనుకూల వృద్ధిని నమోదు చేయగలిగిందన్నారు. గత రెండేళ్ళలో కొత్తగా 250 శాఖలను ఏర్పాటు చేశామని, వచ్చే ఏడాది మరో 50 శాఖలను ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా 2,000 మంది ఏజెంట్లను నియమించుకునే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం శ్రీరామ్ లైఫ్ 414 శాఖలను, 5,000 మంది ఏజెంట్లను కలిగి ఉంది. త్వరలో వాటా పెంపు బీమా చట్ట సవరణ బిల్లుతో జీవిత బీమా రంగం వేగంగా విస్తరిస్తుందన్న నమ్మకాన్ని జైన్ వ్యక్తం చేశారు. విదేశీ భాగస్వామ్య కంపెనీ సన్లామ్ వాటాను 49 శాతం పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వాటా పెంపు అంశం ఇంకా చర్చల దశలో ఉందని, బిల్లును పూర్తిగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. కొత్త పథకాలు శ్రీరామ్ లైఫ్ కొత్తగా మూడు పథకాలను ప్రవేశపెట్టింది. సింగిల్ ప్రీమియం పాలసీ గ్యారంటీడ్ ప్రిజర్వ్ వెల్త్‌ప్లాన్, ఐదేళ్ళ కాలపరిమితి ఉండే ఈజీ లైఫ్ కవర్ పాలసీలతో పాటు, కంపెనీల గ్రాట్యూటీ ఫండ్ నిర్వహణ కోసం గ్రూపు ఎంప్లాయీ బెనిఫిట్ పథకాలను ప్రవేశపెట్టింది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలను ప్రవేశపెట్టామని, త్వరలో మరో రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. -
బీమా బిల్లుతో మరింత ధీమా
బీమా చట్టాల సవరణల బిల్లును ఇటీవలే కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. బీమా కంపెనీల్లో విదేశీ పెట్టుబడుల పెంపు మొదలైనవి కార్పొరేట్ స్థాయికి చెందినవే అయినా.. పాలసీదారులకు కూడా ప్రయోజనాలు కల్పించే నిబంధనలు సైతం ఇందులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని ఇవి.. మూడేళ్లు దాటితే.. తాజా నిబంధనల ప్రకారం బీమా తీసుకునేటప్పుడు సరైన సమాచారం ఇవ్వలేదనే కారణంతో .. పాలసీ జారీ చేసిన మూడేళ్ల తర్వాత వచ్చే క్లెయిమును కంపెనీ తిరస్కరించడానికి వీల్లేదు. కాబట్టి పాలసీ ఇచ్చేటప్పుడే సంస్థలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సరైన వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఏజెంట్లు మోసం చేసినా.. కొత్త చట్ట సవరణ ప్రకారం.. ఏజెంట్లు చేసే తప్పులకు కూడా బీమా కంపెనీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వారు వ్యవహరించిన పక్షంలో కంపెనీలు ఏకంగా రూ. 1 కోటి దాకా జరిమానా కట్టాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో రికార్డులు: బీమా కంపెనీలు పాలసీ రికార్డులను, క్లెయిములను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని తమ వెబ్సైట్లలో ఉంచాలి. పారదర్శకతను మరింతగా పెంచేందుకు ఈ నిబంధనను ఉద్దేశించారు. ఏజెంట్ల సంఖ్య పెంపు.. ప్రస్తుతం బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ.. ఏజెంట్లకు లెసైన్సులు ఇస్తోంది. అయితే, రాబోయే రోజుల్లో ఐఆర్డీఏ నిర్దేశించిన అర్హతా ప్రమాణాలు కలిగి ఉండి, నిర్దేశిత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని బీమా సంస్థలు నేరుగా ఏజెంట్లు కింద నియమించుకునే వీలు లభించనుంది. దేశవ్యాప్తంగా బీమాను మరింత మందికి చేరువ చేసేందుకు ఉద్దేశించిన సవరణ ఇది. దీని వల్ల బీమా సంస్థలు మరింత మంది ఏజెంట్లను తీసుకోవడం ద్వారా నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకోవచ్చు. అయితే, పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైతే ఏజెంట్లపై చర్యలు తీసుకునేందుకు ఐఆర్డీఏకి పూర్తి అధికారాలు ఉంటాయి. రిక్రూట్మెంట్ విషయంలో పెద్దగా అడ్డంకులేమీ లేకపోయినా.. ఏజెంట్లు తప్పులు చేస్తే భారీ పెనాల్టీలు తప్పవు కాబట్టి, కంపెనీలు అత్యంత జాగ్రత్తగా నియామకాలు జరపాల్సి ఉంటుంది. -
బీమా బిల్లుకు గ్రీన్‌సిగ్నల్
ఎఫ్‌డీఐ పరిమితి పెంపునకు పార్లమెంటరీ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ⇒ఎఫ్‌పీఐ, ఎఫ్‌డీఐ సహా మొత్తం విదేశీ పెట్టుబడులను 49 శాతానికి పరిమితం చేయాలని సిఫార్సు ⇒బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం... ⇒వచ్చే వారంలో రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం న్యూఢిల్లీ: ఏళ్లతరబడి పెండింగ్‌లోఉన్న బీమా బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను 49 శాతానికి పెంచేందుకు మార్గం సుగమమైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రతిపాదించిన కాంపొజిట్ విదేశీ పరిమితి సూచనలను కూడా బీమా చట్టాల సవరణ బిల్లు-2008లో చేర్చడంతో పార్లమెంటరీ కమిటీ దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ కూడా బుధవారం ఆమోద ముద్ర వేసింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత అడ్డంకి తొలగిపోవడంతో ఇక వచ్చేవారం ఆరంభంలో మోదీ సర్కారు బీమా చట్ట సవరణ బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. పెద్దల సభలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ లేనందున బిల్లు ఆమోదం పొందాలంటే కాంగ్రెస్ మద్దతు చాలా కీలకం. ప్రస్తుతం ప్రైవేటు రంగ బీమా కంపెనీల్లో 26 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. అయితే, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌డీఐ) పెట్టుబడితో పాటు మొత్తం ఎఫ్‌డీఐలను 49 శాతానికి పరిమితం చేయాలని రాజ్యసభకు ఇచ్చిన నివేదికలో సెలక్ట్ కమిటీ సూచించింది. అంటే మొత్తం అన్ని రకాల విదేశీ పెట్టుబడులన్నీ ఈ 49 శాతానికి మించకూడదనేది ఈ కాంపొజిట్ పరిమితి ప్రధానోద్దేశం. 2008 నుంచి బిల్లు పెండింగ్‌లో ఉంది. నాలుగు పార్టీల అభ్యంతరం... సెలక్ట్ కమిటీ నివేదికపై నాలుగు పార్టీలు అభ్యంతరం లేవనెత్తాయి. పి. రాజీవ్(సీపీఐ-ఎం), డెరెక్ ఓబ్రియాన్(తృణమూల్ కాంగ్రెస్), రామ్‌గోపాల్ యాదవ్(సమాజ్‌వాదీ పార్టీ), కేసీ త్యాగి(జేడీయూ)లు వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు నివేదికలో డిసెంట్ నోట్స్‌ను పొందుపరిచారు. పరిమితి పెంపువల్ల బీమా రంగం, పాలసీదారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఈ పార్టీల సభ్యులు పేర్కొన్నారు. బిల్లులోని ప్రతిపాదనలను పరిశీలించాల్సిందిగా ఈ ఏడాది ఆగస్టులో రాజ్యసభ 15 మంది సభ్యులతో సెలక్ట్ కమిటీని నియమించింది. కమిటీ ఇతర సిఫార్సులు ఇవీ... ⇒సెలక్ట్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న రాజ్యసభ ఎంపీ చందన్ మిత్రా.. సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో బీమా రంగం నుంచి ఒక నిపుణుడికి స్థానం కల్పించాలని నివేదికలో సూచించారు. ⇒ ఈ మేరకు సెబీ చట్టంలో సవరణలు చేయాలి. ⇒బీమా కంపెనీల పొరపాట్లలో తీవ్రతనుబట్టి... జరిమానాలు విధించాలి. ⇒హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెయిడ్-అప్ ఈక్విటీ మూలధనాన్ని తగ్గించకూడదు. ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ⇒బీమా ఏజెంట్లకు కమిషన్ చెల్లింపులు సక్రమంగా జరిగేవిధంగా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కమిషన్‌ను స్వరూపాన్ని నిర్ణయించే అధికారాన్ని కూడా ఐఆర్డీఏకి ఇవ్వాలి. బ్యాంకుల నిధుల సమీకరణకు ఓకే.. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొత్తగా ఈక్విటీల జారీ ద్వారా రూ. 1.60 లక్షల కోట్లు సమీకరించుకునే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. తద్వారా ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా దశలవారీగా 52%కి పరిమితం కానుంది. బ్యాంకులు బాసెల్ 3 ప్రమాణాలు పాటించేందుకు కావాల్సిన నిధులను సమకూర్చే పరిస్థితి లేనందున.. మార్కెట్ల ద్వారా అవి సమీకరించుకునేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ప్రస్తుతం 22 పీఎస్బీల్లో ప్రభుత్వ వాటాలు 56.26%-88.63% దాకా ఉన్నాయి. చిన్న, మధ్య తరహా సంస్థల ఫ్యాక్టరింగ్ అవసరాల కోసం రూ. 500 కోట్లతో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఏర్పాటు ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది. అయిదేళ్ల ఆఖరు నాటికి ఇది రూ. 20,000 కోట్ల విలువ చేసే లావాదేవీలకు సరిపోగలదని అంచనా. కంపెనీలు తమకు రావాల్సిన బిల్లులను థర్డ్ పార్టీకి కొంత డిస్కౌంటుపై విక్రయించి, ముందుగానే నగదు పొందే వెసులుబాటు కల్పిస్తుంది ఫ్యాక్టరింగ్ విధానం. రూ. 50 వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం... బీమా రంగంలోకి భారీ మొత్తంలో విదేశీ పెట్టుబడులు వేచిచూస్తున్నాయని.. ఎఫ్‌డీఐ పరిమితి పెంపుతో నిధుల ప్రవాహం పెరుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. బీమా బిల్లుకు ఆమోదముద్రపడితే.. రూ.25,000 కోట్ల విదేశీ నిధులు రానున్నాయని కేపీఎంజీ(ఇండియా) పార్ట్నర్ శాశ్వత్ శర్మ అంచనా వేశారు. అయితే, దేశీ కంపెనీల్లో పెట్టుబడులతో పాటు కొత్తగా విదేశీ సంస్థలు బీమా వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉన్నందున.. మొత్తం పెట్టుబడులు 7-8 బిలియన్ డాలర్ల వరకూ(దాదాపు రూ.50 వేల కోట్లు) ఉండొచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. పార్లమెంటులో బీమా బిల్లుకు ఆమోదం పడితే.. పెన్షన్ రంగానికీ దీన్నే వర్తింపజేయనున్నారు. -
శీతాకాల సమావేశాల్లో బీమా బిల్లు: జైట్లీ
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితి పెంపునకు త్వరలోనే చట్టబద్ధత కల్పిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బీమా చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టి.. అమోదింపజేసేలా చూస్తామని శుక్రవారమిక్కడ ఆయన వెల్లడించారు. బీమా రంగంలో ఎఫ్‌డీల పరిమితిని ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఇదివరకే ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. -
ఎన్డీయేకు పేరొస్తుందనే..!
బీమా బిల్లుకు కాంగ్రెస్ అడ్డు: వెంకయ్య న్యూఢిల్లీ: బీమా బిల్లు ఆమోదం పొందితే మోడీ ప్రభుత్వానికి మంచిపేరొస్తుందనే ఆందోళనలో కాంగ్రెస్ ఉన్నట్లు కనిపిస్తోందని, అందుకే బిల్లు అడ్డుకోవడానికి యత్నిస్తోందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. నిజానికి యూపీఏ హయాంలోనే బిల్లు రూపొందిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో వెంకయ్య మాట్లాడారు. ఉభయసభల చర్చల్లో పాల్గొనాలని, అవసరమైతే ఓటింగ్‌లో పాల్గొనేందుకు అందుబాటులో ఉండాలని పార్టీ ఎంపీలను కోరారు. యూపీఎస్సీ వివాదాన్ని కాంగ్రెస్, యూపీఏలు సృష్టించాయన్నారు. ఈనెల 9వ తేదీన ఢిల్లీలో నెహ్రూ స్టేడియంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ భేటీ జరగనుందని వెల్లడించారు. కాగా, బీమా బిల్లుపై విపక్షంతో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ ఆరోపించారు. ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు బీమా బిల్లుపై తాము ద్వంద్వ వైఖరితో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. -
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే: ఏచూరి
కోల్‌కతా: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించడంతో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి విమర్శించారు. బీమా రంగంలోని విదేశీ పెట్టుబడులను యూపీఏ ప్రభుత్వం హయాంలో వ్యతిరేకించిన బీజేపీ- ఇప్పుడు మళ్లీ అదే పని చేస్తోందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని ఎద్దేవా చేశారు. తాము తెచ్చేందుకు ప్రయత్నించిన బిల్లును ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఈ విషయంలో వామపక్ష పార్టీల విధానం మారలేదని ఏచూరి తెలిపారు. పెట్టుబడిదారుల చేతుల్లో బీజేపీ కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. -
ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి: వెంకయ్య
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన విజ్క్షప్తి చేశారు. పట్టణాభివృద్ది కోసం లోకల్ అథారిటీలు కూడా సక్రమంగా పనిచేయాలని ఆయన కోరారు. పార్లమెంట్లో ఇన్సూరెన్స్ యాక్ట్ సవరణ బిల్లును త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు వెంకయ్య తెలిపారు. బీమారంగంలో 49% ఎఫ్‌డీఐలకు అనుమతిస్తామని, ప్రతిపక్షాలు కూడా బీమా బిల్లుకు సహకరించాలని వెంకయ్య సూచించారు. రాజకీయ రంగులను పులుముకోకుండా కేంద్ర నిధులను ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు.