బీమా బిల్లుతో మరింత ధీమా
బీమా చట్టాల సవరణల బిల్లును ఇటీవలే కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. బీమా కంపెనీల్లో విదేశీ పెట్టుబడుల పెంపు మొదలైనవి కార్పొరేట్ స్థాయికి చెందినవే అయినా.. పాలసీదారులకు కూడా ప్రయోజనాలు కల్పించే నిబంధనలు సైతం ఇందులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని ఇవి..
మూడేళ్లు దాటితే..
తాజా నిబంధనల ప్రకారం బీమా తీసుకునేటప్పుడు సరైన సమాచారం ఇవ్వలేదనే కారణంతో .. పాలసీ జారీ చేసిన మూడేళ్ల తర్వాత వచ్చే క్లెయిమును కంపెనీ తిరస్కరించడానికి వీల్లేదు. కాబట్టి పాలసీ ఇచ్చేటప్పుడే సంస్థలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సరైన వివరాలు సేకరించాల్సి ఉంటుంది.
ఏజెంట్లు మోసం చేసినా..
కొత్త చట్ట సవరణ ప్రకారం.. ఏజెంట్లు చేసే తప్పులకు కూడా బీమా కంపెనీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వారు వ్యవహరించిన పక్షంలో కంపెనీలు ఏకంగా రూ. 1 కోటి దాకా జరిమానా కట్టాల్సి వస్తుంది.
ఎలక్ట్రానిక్ పద్ధతిలో రికార్డులు: బీమా కంపెనీలు పాలసీ రికార్డులను, క్లెయిములను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని తమ వెబ్‌సైట్లలో ఉంచాలి. పారదర్శకతను మరింతగా పెంచేందుకు ఈ నిబంధనను ఉద్దేశించారు.
ఏజెంట్ల సంఖ్య పెంపు..
ప్రస్తుతం బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ.. ఏజెంట్లకు లెసైన్సులు ఇస్తోంది. అయితే, రాబోయే రోజుల్లో ఐఆర్‌డీఏ నిర్దేశించిన అర్హతా ప్రమాణాలు కలిగి ఉండి, నిర్దేశిత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని బీమా సంస్థలు నేరుగా ఏజెంట్లు కింద నియమించుకునే వీలు లభించనుంది. దేశవ్యాప్తంగా బీమాను మరింత మందికి చేరువ చేసేందుకు ఉద్దేశించిన సవరణ ఇది. దీని వల్ల బీమా సంస్థలు మరింత మంది ఏజెంట్లను తీసుకోవడం ద్వారా నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకోవచ్చు. అయితే, పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైతే ఏజెంట్లపై చర్యలు తీసుకునేందుకు ఐఆర్‌డీఏకి పూర్తి అధికారాలు ఉంటాయి. రిక్రూట్‌మెంట్ విషయంలో పెద్దగా అడ్డంకులేమీ లేకపోయినా.. ఏజెంట్లు తప్పులు చేస్తే భారీ పెనాల్టీలు తప్పవు కాబట్టి, కంపెనీలు అత్యంత జాగ్రత్తగా నియామకాలు జరపాల్సి ఉంటుంది.