బీమా బిల్లుకు గ్రీన్‌సిగ్నల్ | Cabinet Clears Panel Report on Insurance Bill: Top 10 Facts | Sakshi
Sakshi News home page

బీమా బిల్లుకు గ్రీన్‌సిగ్నల్

Published Thu, Dec 11 2014 12:30 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

బీమా బిల్లుకు గ్రీన్‌సిగ్నల్ - Sakshi

బీమా బిల్లుకు గ్రీన్‌సిగ్నల్

ఎఫ్‌డీఐ పరిమితి పెంపునకు పార్లమెంటరీ కమిటీ గ్రీన్‌సిగ్నల్

ఎఫ్‌పీఐ, ఎఫ్‌డీఐ సహా మొత్తం విదేశీ పెట్టుబడులను 49 శాతానికి పరిమితం చేయాలని సిఫార్సు
బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం...
వచ్చే వారంలో రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
 
న్యూఢిల్లీ: ఏళ్లతరబడి పెండింగ్‌లోఉన్న బీమా బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను 49 శాతానికి పెంచేందుకు మార్గం సుగమమైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రతిపాదించిన కాంపొజిట్ విదేశీ పరిమితి సూచనలను కూడా బీమా చట్టాల సవరణ బిల్లు-2008లో చేర్చడంతో పార్లమెంటరీ కమిటీ దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ కూడా బుధవారం ఆమోద ముద్ర వేసింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత అడ్డంకి తొలగిపోవడంతో ఇక వచ్చేవారం ఆరంభంలో మోదీ సర్కారు బీమా చట్ట సవరణ బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

పెద్దల సభలో మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి మెజారిటీ లేనందున బిల్లు ఆమోదం పొందాలంటే కాంగ్రెస్ మద్దతు చాలా కీలకం. ప్రస్తుతం ప్రైవేటు రంగ బీమా కంపెనీల్లో 26 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. అయితే, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌డీఐ) పెట్టుబడితో పాటు మొత్తం ఎఫ్‌డీఐలను 49 శాతానికి పరిమితం చేయాలని రాజ్యసభకు ఇచ్చిన నివేదికలో సెలక్ట్ కమిటీ సూచించింది. అంటే మొత్తం అన్ని రకాల విదేశీ పెట్టుబడులన్నీ ఈ 49 శాతానికి మించకూడదనేది ఈ కాంపొజిట్ పరిమితి ప్రధానోద్దేశం. 2008 నుంచి బిల్లు పెండింగ్‌లో ఉంది.

నాలుగు పార్టీల అభ్యంతరం...
సెలక్ట్ కమిటీ నివేదికపై నాలుగు పార్టీలు అభ్యంతరం లేవనెత్తాయి. పి. రాజీవ్(సీపీఐ-ఎం), డెరెక్ ఓబ్రియాన్(తృణమూల్ కాంగ్రెస్), రామ్‌గోపాల్ యాదవ్(సమాజ్‌వాదీ పార్టీ), కేసీ త్యాగి(జేడీయూ)లు వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు నివేదికలో డిసెంట్ నోట్స్‌ను పొందుపరిచారు. పరిమితి పెంపువల్ల బీమా రంగం, పాలసీదారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఈ పార్టీల సభ్యులు పేర్కొన్నారు. బిల్లులోని ప్రతిపాదనలను పరిశీలించాల్సిందిగా ఈ ఏడాది ఆగస్టులో రాజ్యసభ 15 మంది సభ్యులతో సెలక్ట్ కమిటీని నియమించింది.

కమిటీ ఇతర సిఫార్సులు ఇవీ...
సెలక్ట్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న రాజ్యసభ ఎంపీ చందన్ మిత్రా.. సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో బీమా రంగం నుంచి ఒక నిపుణుడికి స్థానం కల్పించాలని నివేదికలో సూచించారు.
ఈ మేరకు సెబీ చట్టంలో సవరణలు చేయాలి.
బీమా కంపెనీల పొరపాట్లలో తీవ్రతనుబట్టి... జరిమానాలు విధించాలి.
హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెయిడ్-అప్ ఈక్విటీ మూలధనాన్ని తగ్గించకూడదు. ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
బీమా ఏజెంట్లకు కమిషన్ చెల్లింపులు సక్రమంగా జరిగేవిధంగా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కమిషన్‌ను స్వరూపాన్ని నిర్ణయించే అధికారాన్ని కూడా ఐఆర్‌డీఏకి ఇవ్వాలి.
 
బ్యాంకుల నిధుల సమీకరణకు ఓకే..

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) కొత్తగా ఈక్విటీల జారీ ద్వారా రూ. 1.60 లక్షల కోట్లు సమీకరించుకునే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. తద్వారా ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా దశలవారీగా 52%కి పరిమితం కానుంది. బ్యాంకులు బాసెల్ 3 ప్రమాణాలు పాటించేందుకు కావాల్సిన నిధులను   సమకూర్చే పరిస్థితి లేనందున.. మార్కెట్ల ద్వారా అవి సమీకరించుకునేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ప్రస్తుతం 22 పీఎస్‌బీల్లో ప్రభుత్వ వాటాలు 56.26%-88.63% దాకా ఉన్నాయి.

చిన్న, మధ్య తరహా సంస్థల ఫ్యాక్టరింగ్ అవసరాల కోసం రూ. 500 కోట్లతో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఏర్పాటు ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది. అయిదేళ్ల ఆఖరు నాటికి ఇది రూ. 20,000 కోట్ల విలువ చేసే లావాదేవీలకు సరిపోగలదని అంచనా. కంపెనీలు తమకు రావాల్సిన బిల్లులను థర్డ్ పార్టీకి కొంత డిస్కౌంటుపై విక్రయించి, ముందుగానే నగదు పొందే వెసులుబాటు కల్పిస్తుంది ఫ్యాక్టరింగ్ విధానం.
 
రూ. 50 వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం...
బీమా రంగంలోకి భారీ మొత్తంలో విదేశీ పెట్టుబడులు వేచిచూస్తున్నాయని.. ఎఫ్‌డీఐ పరిమితి పెంపుతో నిధుల ప్రవాహం పెరుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. బీమా బిల్లుకు ఆమోదముద్రపడితే.. రూ.25,000 కోట్ల విదేశీ నిధులు రానున్నాయని కేపీఎంజీ(ఇండియా) పార్ట్‌నర్ శాశ్వత్ శర్మ అంచనా వేశారు.  అయితే, దేశీ కంపెనీల్లో పెట్టుబడులతో పాటు కొత్తగా విదేశీ సంస్థలు బీమా వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉన్నందున.. మొత్తం పెట్టుబడులు 7-8 బిలియన్ డాలర్ల వరకూ(దాదాపు రూ.50 వేల కోట్లు) ఉండొచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. పార్లమెంటులో బీమా బిల్లుకు ఆమోదం పడితే.. పెన్షన్ రంగానికీ దీన్నే వర్తింపజేయనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement