ఎన్డీయేకు పేరొస్తుందనే..!
బీమా బిల్లుకు కాంగ్రెస్ అడ్డు: వెంకయ్య
న్యూఢిల్లీ: బీమా బిల్లు ఆమోదం పొందితే మోడీ ప్రభుత్వానికి మంచిపేరొస్తుందనే ఆందోళనలో కాంగ్రెస్ ఉన్నట్లు కనిపిస్తోందని, అందుకే బిల్లు అడ్డుకోవడానికి యత్నిస్తోందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. నిజానికి యూపీఏ హయాంలోనే బిల్లు రూపొందిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో వెంకయ్య మాట్లాడారు. ఉభయసభల చర్చల్లో పాల్గొనాలని, అవసరమైతే ఓటింగ్‌లో పాల్గొనేందుకు అందుబాటులో ఉండాలని పార్టీ ఎంపీలను కోరారు.
యూపీఎస్సీ వివాదాన్ని కాంగ్రెస్, యూపీఏలు సృష్టించాయన్నారు. ఈనెల 9వ తేదీన ఢిల్లీలో నెహ్రూ స్టేడియంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ భేటీ జరగనుందని వెల్లడించారు. కాగా, బీమా బిల్లుపై విపక్షంతో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ ఆరోపించారు. ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు బీమా బిల్లుపై తాము ద్వంద్వ వైఖరితో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.