Parliament Approval
-
బిల్లు ఆమోదంతోనే సరిపోతుందా?
అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళల శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా ఉపయోగించుకొనేందుకు బహుముఖ వ్యూహాలను అనుసరిస్తున్నారు. లింగ వైవిధ్యం కలిగిన రంగాలు వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది చట్ట సభలకు సైతం వర్తిస్తుంది. ఎక్కువ మంది మహిళలు భాగస్వాములైతే – నేర, అవినీతిమయ స్వభావాల నుంచి ప్రేమ, వాత్సల్య స్వభావాలకు రాజకీయాలను మార్చడా నికి దోహదపడుతుందని సామాజికవేత్తల అంచనా. మహిళా బిల్లు ఆమోదం పొందడం ఓ చరిత్రాత్మక ఘట్టమే. కానీ, ఈ చట్టం విజయవంతం కావాలంటే పార్టీల స్వరూప స్వభావాలు మారాలి. అన్ని పార్టీలూ మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించి, వారి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం పొందడం దేశ చరిత్రలో మైలురాయి. పార్టీలకు అతీతంగా విస్తృత స్థాయిలో ఈ బిల్లుకు ఆమోదం లభించినందున రెండో దశలో కనీసం 15 రాష్ట్రాల అసెంబ్లీలు ఈ బిల్లుకు అడ్డు చెప్పేందుకు ఆస్కారం లేదు. ఆ ప్రక్రియ కూడా పూర్తయితే 2026 నుంచి రిజ ర్వేషన్లు అమలులోకి వస్తాయి. ఆ లోగా కులగణన, నియోజక వర్గాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియలు ముగియాలి. ఎంతో వ్యవధి పట్టే ఈ కార్యక్రమాలు 2026 లోపు పూర్తవుతాయా? అందుకే కాబోలు,కాంగ్రెస్ నేత ఒకరు ఈ బిల్లును ‘పోస్ట్ డేటెడ్ చెక్’తో పోల్చారు. ప్రాంతీయ పార్టీలపై నెపాన్ని నెట్టి 2004–14 మధ్య పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును అటకెక్కించింది. ఆ విధంగా చూసిన పుడు చెల్లని చెక్కు కంటే పోస్ట్ డేటెడ్ చెక్ మేలు కదా? తాము అధికా రంలో ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టం చేసే అవకాశాన్ని జారవిడుచుకొన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ బిల్లులో ఓబీసీ మహిళలకు ఉపకోటా ఉండాలన్న డిమాండ్ దాదాపుగా అన్ని రాజ కీయ పార్టీలు చేస్తున్నందున భవిష్యత్తులో అందుకు అవసరమైన సవరణలు జరుగుతాయనే ఆశించాలి. భారతదేశంలో అనాది నుంచి మహిళల పట్ల భిన్నమైన దృక్ప థాలు చూపడం కనిపిస్తుంది. ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు మహిళను మాతృమూర్తిగా చూపిస్తూ ఉన్నత స్థానాన్ని కల్పించాయి. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ సిరులు పండుతా యని భారతీయులు పవిత్రంగా భావించే వేదాలు ఘోషించాయి. అదే సమయంలో ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హసి’ అంటూ మహిళల స్వేచ్ఛను అణచివేసే అనేక దురాగతాలు భారత ఉపఖండంలో జరిగాయి. స్వాతంత్య్రానంతరం వివిధ చట్టాల ద్వారా బాల్య వివాహాలు, సతీసహగమనం, వితంతు వివాహాల నిషేధం వంటి దురాచారాలను సరిదిద్దడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ చట్టాల కంటే సంప్రదాయాలకే మొగ్గుచూపే భారతీయ సమాజంలో చట్టాల వల్ల ఒనగూరిన ప్రయోజనం తక్కువే! చట్టాల అమలు కంటే ప్రజా చైతన్యం ద్వారా మొదలయిన సంస్కరణోద్యమాలు చక్కని ఫలితాలు అందించాయి. సావిత్రీబాయి ఫూలే మహిళా విద్య కోసం చేసిన కృషి, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు వంటి రచయితలు, సంఘసంస్కర్తలు తెలుగునాట వితంతు వివాహాలు జరగడానికి చేసిన కృషి చెప్పుకోదగ్గది. జాతీయోద్యమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడానికి గాంధీజీ కృషిచేశారు. ఆయన తన సతీమణి కస్తూర్బాను వివిధ ఉద్యమాలలో పాల్గొనేలా ప్రోత్సహించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలలో మహిళలు గణనీయ సంఖ్యలో పాలుపంచుకొన్నారు. గొప్ప కవయిత్రిగా పేరు తెచ్చుకొన్న సరోజినీ నాయుడు గాంధీజీ చొరవతోనే అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలై, రాజకీయాలలో మహిళలు ప్రవేశించడానికి ప్రేరణగా నిలిచారు. ప్రపంచంలోనే అతిగొప్ప ఉద్యమాలలో ఒకటిగా చెప్పుకొనే తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రాంత గ్రామీణ పేద మహిళలు ప్రముఖ పాత్ర పోషించారు. వీరమహిళ చాకలి ఐలమ్మ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇందిరా గాంధీ, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ, విజయరాజె సింథియా వంటి వారు రాజకీయాలలో మహిళలు చురుకైన భాగ స్వామ్యం వహించడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇక 1983లో నందమూరి తారక రామారావు మహిళలకు తండ్రి ఆస్తిలో సగభాగం దక్కేలా చట్టం చేయడం, స్థానిక సంస్థలలో తొలి సారిగా 9 శాతం రిజర్వేషన్లు అందించడం చారిత్రాత్మక ఘట్టాలుగానే పరిగణించాలి. ఆ తర్వాత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, అభయహస్తం వంటి పథకాలు మహిళల్ని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్ని రకాల నామినేటెడ్ పదవులలో పార్టీ పరంగా 40 శాతంకు పైగా అందిస్తూ, చిత్తశుద్ధి ఉంటే మహిళలకు రిజర్వేషన్లే ఉండాలన్న నిబంధన అవసరం లేదని రుజువు చేశారు. ‘జిందా తిలిస్మాథ్’ కాదు! మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఒక్క ఎంఐఎం తప్ప పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం విశేషం. దీనిని బట్టి ఆయా పార్టీలలో ఉన్న పురుషాధిక్యత తొలగిపోయిందనుకుంటే పొరపాటే! ముఖ్యంగా అధికార భారతీయ జనతా పార్టీ ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడం ద్వారా మహిళల సమస్యలన్నింటినీ పరిష్కరించేసినట్లు ప్రచారం చేసుకొంటోంది. కాంగ్రెస్ పార్టీ, ఇంకా కొన్ని పార్టీలు తాము ఎక్కడ వెనకబడిపోతామో అనే భయంతో అసలు మహిళా బిల్లును ముందుకు తెచ్చింది ‘మేమంటే మేము’ అని తమను తామే అభినందించుకోవడం విడ్డూరం. చట్టసభలలో మహిళల సంఖ్య పెరిగినంత మాత్రాన వారికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం కాజాలవు. అదే నిజమైతే స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్లు పొందుతున్న మహిళలు తమ ప్రాంతాలలో ఏవైనా అద్భుతాలు సాధించారా? వారికి ఆ అవకాశం లభించకపోవడానికి కావడమేమిటి? జిల్లా పరిషత్‌ల పరిధిలో బాలికల విద్య, వైద్యం, ఉపాధికి సంబంధించి ఏవైనా ప్రత్యేక ప్రణాళికలు అమలు జరుగుతున్నాయా? ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు తగినన్ని మరుగుదొడ్లు లేనందున ‘డ్రాపవుట్లు’ ఎక్కువగా ఉంటున్నాయి. స్థానిక ప్రభుత్వాలలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగినప్పటికీ ఎందువల్ల మహిళలకు సముచిత న్యాయం జరగడం లేదు? కొన్ని ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను మహిళల పేరిట అందజేస్తున్న మాట నిజమేగానీ, మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, గృహæహింస, మహిళల అదృశ్యం (ఉమెన్ ట్రాఫికింగ్) మొదలైన కేసుల్లో ఎంతో వెనుకబడి ఉన్నాం. మహిళా బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం ఓ చారిత్రాత్మక ఘట్టమే. కానీ, ఈ చట్టం విజయవంతం కావాలంటే రాజకీయ పార్టీల స్వరూప స్వభావాలు మారాలి. సమ సమాజమే ధ్యేయం అని చెప్పుకొంటూ మహిళల సమస్యలపై ఉద్యమించడానికి ప్రత్యేక అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసుకొన్న కమ్యూనిస్టు పార్టీల పొలిట్ బ్యూరోలలో, సెంట్రల్ కమిటీలలో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రం. మహిళా బిల్లు ఘనత తమదేనని చాటుకొంటున్న బీజేపీ కార్యవర్గంలోకి 33 శాతం మంది మహిళల్ని ఎప్పుడు నియమిస్తారు? రాజకీయ పార్టీలలో ముందుగా భాగస్వామ్యం లేకుండా వారిని చట్టసభలకు పంపడం ఏ విధంగా సాధ్యపడుతుంది? మహిళా బిల్లు అమలు కావడానికి ఇంకా సమయం ఉంది కనుక, ఈలోపే అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు సముచిత భాగ స్వామ్యం కల్పించి వారి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. కీలకమైన పదవులలో వారికి స్థానం కల్పించాలి. ప్రతి నిర్ణయంలో వారికి భాగ స్వామ్యం ఉండాలి. ఇదంతా ఓ సుదీర్ఘ ప్రక్రియ. ఇందుకు భారతీయ జనతా పార్టీతోపాటు అన్ని రాజకీయ పార్టీలు తగిన కార్యాచరణ చేపడితేనే, మహిళా సాధికారత పట్ల వారికున్న చిత్తశుద్ధి తేటతెల్లం అవుతుంది. ఈ రాజకీయ ప్రక్రియ లేకుండా మహిళా బిల్లును కేవలం ఓ ‘స్కీమ్’లా అమలు చేయాలని చూస్తే ఫలితాలు అందవు. లేకుంటే, ఆపరేషన్ విజయవంతమేగానీ రోగి బతకలేదన్నట్టు ఇదొక ప్రహస నంలా మిగిలిపోతుంది. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
తాత్సారంలో ఆంతర్యమేమిటి?
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నూతన పార్లమెంట్ భవనంలో అట్టహాసంగా తెచ్చిన తొలి బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో చట్టరూపం దాల్చింది. ‘నారీ శక్తి వందన్ యాక్ట్–2023’గా పిలుస్తున్న దీన్ని సెప్టెంబర్ 19న లోక్‌సభ, సెప్టెంబర్ 21న రాజ్యసభ ఆమోదించాయి. అయితే దీన్ని నియోజక వర్గాల పునర్విభజన తర్వాత, అంటే 2029 ఎన్నికల వరకు గానీ అమలుచేయకపోవడం గమనార్హం. కాబట్టి, ఈ రిజర్వేషన్లను జాప్యం చేయాలన్న ఉద్దేశం ఇందులో కనబడుతోంది. స్త్రీలు పార్లమెంట్‌లోకి వెళ్తే సమాజ భవితవ్యమే మారిపోతుంది. వీరు కుటుంబాన్ని తీర్చిదిద్దినట్లే సమాజాన్ని తీర్చిదిద్దగలరు. స్త్రీలనూ, బీసీలనూ, దళితులనూ నిర్లక్ష్యం చేసినంతకాలం ఆ పార్లమెంటుకు అర్థంలేదు. నూతన పార్లమెంటు భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం ఒక చారిత్రా త్మకమైన విషయంగా చెప్పవచ్చు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లును కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన రోజున తొలి బిల్లుగా ప్రవేశపెట్టడం విశేషం. ఈ బిల్లు ప్రకారం రాజ్యసభ, పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటాను అమలు చేస్తారు. 33 శాతంలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు వారి రిజర్వేషన్ల కోటా ఆధారంగా కేటాయిస్తారు. 15 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఈ రిజర్వేషన్లను వెంటనే కాకుండా నియో జకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) తర్వాత అమల్లోకి తేవాలని నిర్ణయించడం గమనార్హం. 2026లో డీలిమిటేషన్ చేపట్టాల్సి ఉంది. అది పూర్తయ్యి రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టడం ఖాయం. అంటే 2024 ఎన్నికల నాటికి రిజర్వేషన్లు అమల్లోకి రావు. 2029 లోనే ఈ కోటా అమలయ్యే అవకాశముంది. ఆశ్చర్యకరమైన బిల్లు ఈ రిజర్వేషన్ల బిల్లు చాలాసార్లు సభల ముందుకు వచ్చింది. ప్రతిసారీ ఏకాభిప్రాయం కుదరక ఆమోదం పొందలేదు. దాదాపుగా 27 ఏళ్లుగా అది పెండింగ్‌లోనే ఉండిపోయింది. కనీసం 50 శాతం రాష్ట్రాలు ఈ బిల్లును ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ బిల్లులో చాలా లొసుగులు వున్నాయి. ఆవ్‌ు ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఆతిషి మహిళా రిజర్వేషన్ బిల్లును 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలను మోసం చేసేందుకు తెచ్చిన బిల్లు అని ఆరోపించారు. నిజానికి ఈ బిల్లులో పితృస్వామిక ఆధిపత్యం ఉంది. దళిత బహుజన వివక్ష ఉంది. ముఖ్యంగా బీసీలను అధికారం లోనికి రాకుండా చేసే కుట్ర దాగి ఉంది. డీలిమిటేషన్ అయిన తర్వాత ఎప్పుడో 2029లో రిజర్వేషన్లు అమలు చేయబడతాయి అనడంలోనే వీటిని జాప్యం చేయాలనే ఆలోచన వుంది. నిజానికి హిందుత్వవాదులు మనుస్మృతి అనుచరులు. మనుçస్మృతిని క్రీ.పూ. రెండవ శతాబ్దంలో రాసివుంటారని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేర్కొన్నారు. బౌద్ధయుగం అంతరించి హిందూ రాజ్యాలు ఆవిర్భవించే క్రమములో పుష్యమిత్రులు ఈ మనుస్మృని బ్రాహ్మణ రాజ్య నిర్మాణానికి సాధనంగా వాడుకున్నారు. వర్ణవ్యవస్థ పున రుద్ధరణ, స్త్రీ అణచివేత యిందులో ప్రధానమైన అంశాలుగా ముందుకు వచ్చాయి. ‘పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే రక్షంతి స్థావిరే పుత్రాన స్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అని చెబుతుంది మనుస్మృతి. బాల్యమున తండ్రి స్త్రీలను రక్షించును. యౌవనమున మగడు రక్షించును. ముసలితనమున పుత్రుడు రక్షించును. కావున స్త్రీ స్వతంత్రురాలిగా నుండటానికి వీల్లేదు. (భర్త, కుమారులు లేనప్పుడు బంధువులు రక్షింతురు). దీన్నిబట్టి మనకేమి అర్థమౌతుందంటే హిందూ పురుషుడు స్త్రీకి భయపడ్డాడు. ఈ భావజాలానికి ప్రతీకగా వున్న పార్టీ మహిళా బిల్లు ప్రవేశపెట్టిందంటే, నమ్మశక్యంగా లేదు. రాజకీయాల్లోకి స్త్రీలను అసలు రాకుండా అడ్డుకోవడం జరుగు తూనే ఉంది. ఆయా పార్టీలు స్త్రీలకు సీట్లు ఇవ్వడమే తక్కువ. ఆ రాజకీయ ప్రాతినిధ్యం కూడా అగ్రకులాల స్త్రీలకే లభ్యం అయ్యింది. భారతదేశంలో ఇప్పుడు 5 శాతం కంటే తక్కువ స్త్రీలు పార్లమెంట్లో ఉన్నారు. జెకోస్లేవేకియా, సోవియట్ రష్యాల చట్టసభలలో 27 నుండి 28 శాతం వరకు స్త్రీలకు ప్రాతినిధ్యం ఉంది. పశ్చిమ యూరప్‌లో, యూఎస్ఏలో 3 నుండి 4 శాతం స్త్రీల ప్రాతినిధ్యం మాత్రమే చట్ట సభలలో ఉంది. పార్టీలు 10 నుండి 15 శాతం సీట్లు కేటాయించినట్లు ప్రకటించినా, భారతదేశంలో స్త్రీలకు 7 శాతం కంటే సీట్లు మించలేదు. వారిలోనూ ఎన్నికైన స్త్రీల అభ్యర్థుల సంఖ్య ఇంకా తక్కువగా ఉంటోంది. నామమాత్ర రిజర్వేషన్లు పట్టణీకరణ ప్రభావం స్త్రీల రాజకీయ ప్రవేశానికి ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. స్టేటస్ ఆఫ్ వుమెన్ కమిటీ 1977లో చేసిన సర్వే ప్రకారం, గ్రామీణ స్త్రీలే ఎక్కువ రాజకీయ చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. స్త్రీల రిజర్వేషన్‌కు సంబంధించిన విషయాలే ఇలా ఉంటే, ఇక స్త్రీలు ఓపెన్ కాంపిటిషన్లో సీట్లు గెలవడం కష్టంగా ఉంది. గ్రామ పంచాయితీల్లో పురుషుల ప్రాతి నిధ్యం ఎక్కువ ఉండడం వలన ఎన్నికైన స్త్రీలు కూడా నామమాత్రంగానే తమ ప్రాతినిధ్య విలువను వ్యక్తీకరించగలుగుతున్నారు. మొత్తం రాజకీయ పెత్తనం అగ్రకులాల పురుషులదైనపుడు దళితులకు, స్త్రీలకు ఇస్తున్న రాజకీయ రిజర్వేషన్లు నామమాత్రం అవుతున్నాయి. దళిత స్త్రీలకు దాదాపు రాజకీయాధికారంలో భాగస్వామ్యం లేదు. భారత ఉపఖండంలో ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న ఎన్నికలు కూడా ఒక పెద్ద ఫార్సుగా తయారయ్యాయి. డబ్బు, మత్తు మందులు, హైటెక్ ప్రచారం, గూండాయిజం ఉన్నవాళ్ళకే పార్టీలు సీట్లు ఇస్తున్నాయి. ఎవరికైనా స్త్రీలకు సీట్లు ఇస్తే పితృస్వామ్యాన్ని పోషించగలిగిన స్త్రీలకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పెక్కు సంవత్సరాలు భారతదేశాన్ని పరిపా లించారు. ఆమె కాలంలో కాంగ్రెస్ పార్టీలో స్త్రీలకు ఎక్కువ ప్రాతి నిధ్యం కల్పించడం కానీ, ఏ విధమైన స్త్రీల సంస్కరణలు కానీ జరగలేదు. కొందరు స్త్రీలు పురుష పెత్తందారితనాన్ని అనుకరించ డమే స్త్రీవాదం అనుకుంటారు. దళితులు, స్త్రీలు రాజకీయ భాగస్వామ్యాన్ని పొందకపోవడంతో సమంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని చెబుతూ డాక్టర్ మణి పి. కమేర్కర్ ఇలా అన్నారు: ‘స్త్రీలను ఒక అల్ప సంఖ్యాక వర్గంగా లెక్కించి, దళితులను నిర్లక్ష్యం చేసినట్లే రాజకీయాల్లో స్త్రీలను కూడా నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వం తన ప్రచార సాధనాల ద్వారా స్త్రీలను వస్తువులు, అలంకారాలు, ఫ్యాషన్ల మోజులో పడేలా చేసి, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల పట్ల వారి చైతన్యాన్ని దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. పురుష సమాజం చేస్తున్న కుట్రలతో స్త్రీలలో కూడా రాజకీయేతర జీవనం ఎక్కువైంది. భారతదేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా స్త్రీల రాజకీయ చైతన్యం చాలా తక్కువ స్థాయిలో ఉంది.’ నాయకత్వ స్థానంలోకి వచ్చినప్పుడే... రాజకీయ చైతన్యానికి ముందు భారత ఉపఖండంలో స్త్రీలలో ఇంకా బలంగా, సామాజిక ఆర్థిక, సాంస్కృతిక పోరాటాలు జరగాలి. ఉద్యమాల నుండి వచ్చిన కార్యకర్తలు గ్రామస్థాయిలో రాజకీయ నాయకులుగా ఎదగాలి. సమాజ పునర్నిర్మాణానికి, పితృస్వామ్యానికి భిన్నంగా వారు కృషి చేయాలి. ఇతర దేశాలలో కూడా సమాజ ఉపరి తలానికి సంబంధించిన స్త్రీలే నాయకత్వ స్థానాలలో ఉన్నారు. సమాజ పునాదిని నిర్మించిన దళిత స్త్రీలు రాజకీయ చైతన్యాన్ని, నాయ కత్వాన్ని పొందగలిగినపుడే స్త్రీ స్వామ్యం సాధ్యమౌతుంది. జనాభా నిష్పత్తిని బట్టి అందరికీ సమాన అవకాశాలు వచ్చినప్పుడే భారతదేశంలో నూత్న విప్లవం వస్తుందని అంబేడ్కర్ చెప్పారు. స్త్రీ ఒక ఉజ్వల శక్తి. వీరు పార్లమెట్‌లోకి వెళ్తే సమాజ భవితవ్యమే మారి పోతుంది. కుటుంబాన్ని తీర్చిదిద్దినట్లే సమాజాన్ని తీర్చిదిద్దగలరు. స్త్రీలను, బీసీలను, దళితులను నిర్లక్ష్యం చేసినంతకాలం ఆ పార్లమెంటుకు అర్థంలేదు. శ్రామిక శక్తులు, ఉత్పత్తి శక్తులు, దళిత బహుజన స్త్రీ నారీ మణులు, ఈ పార్లమెంట్‌ను అలంకరించే రోజు రావాలి. డా. కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమనేత ‘ 98497 41695 -
బిల్లుకు అయిష్టంగానే విపక్షాల ఆమోదం
భోపాల్/జైపూర్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లుకు పార్లమెంట్లో ప్రతిపక్షాలు మరో గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే మద్దతు ఇచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నారీశక్తిని అర్థం చేసుకొని, సంకోచిస్తూనే బిల్లుకు ఆమోదం తెలిపాయని అన్నారు. తమ పట్టుదల వల్లే బిల్లు పార్లమెంట్లో నెగ్గిందని వివరించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లు పరిస్థితి ఏమిటో మనకు తెలిసిందేనని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అహంకార కూట మికి అధికారం అప్పగిస్తే ఈ బిల్లు విషయంలో వెనక్కి మళ్లుతాయంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. బిల్లు పరిస్థితి వెనక్కి వెళ్లిపోతుందని పరోక్షంగా స్పష్టం చేశారు. జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో సోమవారం నిర్వహించిన ‘కార్యకర్త మహాకుంభ్’లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీని తుప్పు పట్టిన ఇనుముతో పోల్చారు. బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్‌కు అలవాటేనని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ను రాజకీయ నాయకులు నడిపించడం లేదని, పార్టీని అర్బన్ నక్సలైట్లకు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలను, నినాదాలను ఈ లీజుదారులే నిర్ణయిస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గనుక గెలిపిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ దివాలా తీసింది కాంగ్రెస్ దేశంలో ప్రతికూలతను వ్యాప్తి చేస్తోందని, దేశం సాధించిన ఘనతలను ఆ పార్టీ ఇష్టపడడం లేదని ప్రధానమంత్రి మోదీ ధ్వజమెత్తారు. దేశాన్ని 20వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థను కాంగ్రెస్ వ్యతిరేకించిందని, కానీ, ప్రపంచ దేశాలు ఈ వ్యవస్థను ప్రశంసించాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ మనోబలం కోల్పోయిందని, దివాలా తీసిందని చెప్పారు. అందుకే అర్బన్ నక్సలైట్లకు పార్టీని లీజుకు ఇచ్చారని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు ప్రజాబలం లేదన్నారు. మహిళలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే వారంతా అప్రమత్తంగా ఉండాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పేదలు ఎప్పటికీ పేదలుగా ఉండాలన్నదే కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించాలి రాజస్తాన్‌లో సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువత జీవితాల్లో ఐదేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలి్పంచలేదని అన్నారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ‘పరివర్తన్ సంకల్ప్ మహాసభ’లో మాట్లాడారు. పరిపాలన పరంగా కాంగ్రెస్ సర్కారుకు సున్నా మార్కులే వస్తాయన్నారు. కాంగ్రెస్ పాలనలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. మహిళల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కాంగ్రెస్ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచి్చందని చెప్పారు. -
మహిళా బిల్లుకు ఆమోదం.. పార్లమెంటు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. నారీ శక్తికి పార్లమెంటు సగౌరవంగా ప్రణమిల్లింది. నూతన భవనంలో తొట్టతొలిగా మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి సరికొత్త చరిత్ర లిఖించింది. ఈ చరిత్రాత్మక ఘట్టానికి రాజ్యసభ వేదికైంది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన నారీ శక్తి విధాన్ అధినియమ్ బిల్లుకు గురువారం పెద్దల సభ సైతం జై కొట్టింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన మొత్తం 214 మంది సభ్యులూ పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతిచ్చారు. దాంతో అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. మహిళా బిల్లు బుధవారమే లోక్‌సభలో మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో పాస్ అవడం తెలిసిందే. 454 మంది ఎంపీలు మద్దతివ్వగా ఇద్దరు మజ్లిస్ సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. ఈ రిజర్వేషన్లు 15 ఏళ్లపాటు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది. అనంతరం వాటి కొనసాగింపుపై అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది పార్టీలకతీతంగా మద్దతు అంతకుముందు బిల్లుపై జరిగిన చర్చలో రాజ్యసభ సభ్యులంతా ముక్త కంఠంతో మద్దతు పలికారు. కొందరు విపక్షాల సభ్యులు మాత్రం దీన్ని బీజేపీ ఎన్నికల గిమ్మిక్కుగా అభివరి్ణంచారు. తాజా జన గణన, నియోజకవర్గాల పునర్విభజన కోసం ఎదురు చూడకుండా బిల్లు అమలు ప్రక్రియను వీలైనంత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బిల్లును తక్షణం అమలు చేయాలని కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్) డిమాండ్ చేశారు. ఈ బిల్లు అంశాన్ని తొమ్మిదేళ్లుగా పట్టించుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. ఓబీసీ మహిళలకూ దీన్ని వర్తింపజేయాలన్నారు. 2014, 2019ల్లో కూడా మహిళా బిల్లు తెస్తామని బీజేపీ వాగ్దానం చేసి మోసగించిందని ఎలమారం కరీం (సీపీఎం) ఆరోపించారు. మహిళలంటే మోదీ సర్కారుకు ఏ మాత్రమూ గౌరవం లేదన్నారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోదీ నిర్లిప్తతే ఇందుకు రుజువన్నారు. ఎన్నికల వేళ బిల్లు తేవడంలో ఆంతర్యం ఏమిటని రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ) ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా తక్షణం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కె.కేశవరావు (బీఆర్ఎస్), వైగో (ఎండీఎంకే) డిమాండ్ చేశారు. తక్షణం డీ లిమిటేషన్ కమిషన్ వేయాలని వారన్నారు. మహిళా బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని ఆ పార్టీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను రాజ్యసభకు, రాష్ట్రాల శాసన మండళ్లకు కూడా వర్తింపజేయాలని కోరారు. కర్ణాటక సీఎంగా, ప్రధానిగా మహిళా రిజర్వేషన్ల కోసం తాను తీసుకున్న చర్యలను జేడీ (ఎస్) సభ్యుడు దేవెగౌడ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడేం జరుగుతుంది? రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే మహిళా బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. తర్వాత మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నూతన జన గణన, నియోజకవర్గాల పునరి్వభజన అనంతరం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఇది 2029 కల్లా జరిగే అవకాశముందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారమే పరోక్షంగా తెలిపారు. ఏమిటీ బిల్లు? ► ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి విధాన్ అధినియమ్‌గా పేర్కొంటున్నారు. ► దీని కింద లోక్‌సభ, ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు, అంటే 33 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. ► ప్రధానంగా పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగే రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు. చరిత్రాత్మక క్షణాలివి! ప్రధాని మోదీ భావోద్వేగం మహిళా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిన క్షణాలను చరిత్రాత్మకమైనవిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బిల్లు పెద్దల సభ ఆమోదం పొందిన సమయంలో ఆయన సభలోనే ఉన్నారు. ‘భారత మహిళలకు మరింత ప్రాతినిధ్యం, సాధికారత లభించే నూతన శకంలోకి మనమిక సగర్వంగా అడుగు పెట్టనున్నాం. ఇది కేవలం చట్టం మాత్రమే కాదు. మన దేశాన్ని నిరంతరం ఇంత గొప్ప స్థాయిలో తీర్చిదిద్దుతున్న, అందుకోసం తమ సర్వస్వాన్నీ నిరంతరం త్యాగం చేస్తూ వస్తున్నా సంఖ్యాకులైన మహిళామణులకు, మన మాతృమూర్తులకు మనం చేస్తున్న వందనమిది. వారి సహనశీలత, త్యాగాలు అనాదిగా మన గొప్ప దేశాన్ని మరింత సమున్నతంగా తీర్చిదిద్దుతూ వస్తున్నాయి‘ అంటూ మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఉభయ సభల్లోనూ బిల్లుపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. అవన్నీ పూర్తిగా విజయవంతమయ్యాయి. ఈ చర్చలు భవిష్యత్తులోనూ మనందరికీ ఎంతగానో ఉపకరిస్తాయి. బిల్లుకు మద్దతి చి్చన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ స్ఫూర్తి భారతీయుల ఆత్మ గౌరవాన్ని సరికొత్త ఎత్తులకు చేరుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభ, మండళ్లలో అసాధ్యం: నిర్మల చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకోవడం ద్వారా పార్లమెంటు నూతన భవనానికి శుభారంభం అందించే నిమిత్తమే ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. బిల్లుపై చర్చలో ఆమె మాట్లా డుతూ రాజ్యసభ, శాసన మండళ్లకు జరిగేవి పరోక్ష ఎన్నికలు గనుక మహిళలకు రిజర్వేషన్లు ఆచరణసాధ్యం కాదన్నారు. పార్లమెంటు నిరవధిక వాయిదా చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిజానికి 18న మొదలైన ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు షెడ్యూల్ ప్రకారం 22వ తేదీ దాకా జరగాల్సి ఉంది. రాజ్యసభకు ఇది 261 సెషన్. కాగా, 17వ లోక్‌సభకు బహుశా ఇవే చివరి సమావేశాలని భావిస్తున్నారు. -
న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లుకు ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం
జెరూసలేం: వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లును ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం తుది ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌ను ప్రతిపక్షం బహిష్కరించింది. బిల్లుకు అనుకూలంగా 64 ఓట్లు లభించగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ బిల్లుపై ఏకంగా 30 గంటలపాటు పార్లమెంట్లో చర్చ జరిగింది. ఒకవైపు చర్చ జరుగుతుండగానే, మరోవైపు దేశవ్యాప్తంగా బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. జనం వీధుల్లోకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో మార్పులు తలపెట్టడాన్ని అమెరికాతోపాటు పశి్చమ దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. న్యాయ వ్యవస్థను సంస్కరిస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం.. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలను కోర్టులు అడ్డుకోరాదు. అంటే న్యాయ వ్యవస్థపై ప్రభుత్వానిదే పైచేయి అవుతుంది. -
వాతావరణ మార్పుల బిల్లుపై బైడెన్ సంతకం
వాషింగ్టన్: వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో ఇది చట్టరూపం దాల్చినట్లే. కొత్త బిల్లు ప్రకారంఅమెరికాలో వాతావరణ మార్పుల వల్ల తలెత్తే దుష్పరిణామాలను నివారించడానికి వచ్చే పదేళ్లలో 375 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారు. వాతావరణ మార్పులపై జరుగుతున్న యుద్ధంలో ఇది అతిపెద్ద పెట్టుబడి అని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్య సంరక్షణకు కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించనున్నారు. అర్హులకు రాయితీతో ఆరోగ్య బీమా, ఔషధాలు అందిస్తారు. తాము ఎల్లప్పుడూ అమెరికా ప్రజల వెంటే ఉంటామని, ఇతర ప్రయోజనాలు తమకు ముఖ్యం కాదని ఈ సందర్భంగా బైడెన్ వ్యాఖ్యానించారు. కొత్త బిల్లుకు అమెరికా పార్లమెంట్ గత వారమే ఆమోదం తెలిపింది. -
Russia-Ukraine: రష్యా సైన్యం మరింత బలోపేతం!
కీవ్/మాస్కో/దావోస్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. సుదీర్ఘ పోరాటానికి పుతిన్ సైన్యం సన్నద్ధమవుతున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. సైన్యంలో నూతన నియామకాలకు సంబంధించిన బిల్లుకు రష్యా పార్లమెంట్ దిగువ సభ ఆమోదం తెలిపింది. సైన్యంలో చేరడానికి ప్రస్తుతమున్న 40 ఏళ్ల వయోపరిమితిని తొలగించారు. వయసు మళ్లిన వారినీ చేర్చుకుంటారని సమాచారం. మోటార్ సిచ్ ప్లాంట్ ధ్వంసం జపొరిజాజియాలోని ఉక్రెయిన్‌కు చెందిన కీలక హెలికాప్టర్ట ఇంజన్ల తయారీ కర్మాగారాన్ని ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లో అత్యంత కీలకమైన మారియుపోల్ ఓడరేవులో కార్యకలాపాలు మూడు నెలల తర్వాత ప్రారంభమయ్యాయి. అక్కడ మందుపాతరలను రష్యా సైన్యం తొలగించిందని సమాచారం. తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్స్క్లో రష్యా దాడుల్లో చాలామంది గాయపడ్డారు. రష్యాకు తలొంచం: జెలెన్స్కీ ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోందో పుతిన్‌కు తెలియదని జెలెన్స్కీ చెప్పారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ భూభాగాన్ని రష్యాకు అప్పగించే ప్రసక్తే లేదన్నారు. ‘‘చర్చలకు రష్యా ముందుకు రావాలి. ముందు తన సేనలు, ఆయుధాలను ఉపసంహరించాలి’’ అన్నారు. మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభం: సోరోస్ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభం కావొచ్చని ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ జార్జి సోరోస్ హెచ్చరించారు. అదే జరిగితే భూగోళంపై నాగరికతే మిగలదన్నారు. దీన్ని నివారించేందుకు పుతిన్‌ను ఓడించడమే మార్గమన్నారు. యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ‘‘చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పుతిన్‌ది అవధుల్లేని అనుబంధం. యుద్ధంపై పింగ్‌కు ముందే సమాచారమిచ్చాడు. వారిద్దరి మధ్యా ఎన్నో పోలికలున్నాయి. ఇద్దరూ ప్రజలను భయపెట్టి పరిపాలిస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. -
బీమాకు పెట్టుబడుల ధీమా!
న్యూఢిల్లీ: దేశీయంగా బీమా కంపెనీలకు పెట్టుబడులపరమైన తోడ్పాటు లభించేలా ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచే బిల్లుకు పార్లమెంటు సోమవారం ఆమోదముద్ర వేసింది. వాయిస్ వోట్ ద్వారా లోక్‌సభలో దీనికి ఆమోదం లభించింది. ఇప్పటిదాకా జీవిత బీమా, సాధారణ బీమా విభాగాల్లో ఈ పరిమితి 49 శాతంగా ఉంది. బీమా చట్టం 1938ని సవరిస్తూ ప్రతిపాదించిన ఇన్సూరెన్స్ (సవరణ) బిల్లు 2021కి రాజ్యసభ గతవారమే ఆమోదముద్ర వేసింది. ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచడం .. బీమా కంపెనీలు మరిన్ని నిధులు సమీకరించుకునేందుకు, ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు తోడ్పడగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు అవసరమైన నిధులను కేంద్రం సమకూరుస్తోందని, తమంతట తాము నిధులు సమీకరించుకోవాల్సిన ప్రైవేట్ సంస్థలకు ఎఫ్‌డీఐల పరిమితి పెంపుతో కొంత ఊతం లభించగలదని ఆమె తెలిపారు. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ సిఫార్సులు, సంబంధిత వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన మీదట పరిమితి పెంపు నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. గతంలో బీమా రంగంలో 26 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 2015లో 49%కి పెంచగా.. తాజాగా దాన్ని 74 శాతానికి పెంచినట్లు తెలిపారు. కంపెనీలకు కోవిడ్ కష్టాలు.. సాల్వెన్సీ మార్జిన్ల నిర్వహణకు (జరపాల్సిన చెల్లింపులతో పోలిస్తే అసెట్స్ నిష్పత్తి) సంబంధించి బీమా కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని మంత్రి చెప్పారు. ‘బీమా సంస్థలు.. ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు.. నిధుల సమీకరణపరంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. కోవిడ్–19 మహమ్మారి కష్టాలు దీనికి తోడయ్యాయి. ఈ నేపథ్యంలో కార్యకలాపాల వృద్ధికి అవసరమైన పెట్టుబడులు రాకపోతే పరిస్థితి మరింత కష్టతరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఎఫ్‌డీఐ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉంది‘ అని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఏడు ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో మూడు కంపెనీల్లో సాల్వెన్సీ మార్జిన్లు నిర్దేశించిన స్థాయికన్నా తక్కువ ఉన్నాయని మంత్రి చెప్పారు. అయితే, వాటికి కావాల్సిన అదనపు మూలధనాన్ని సమకూర్చడం ద్వారా అవి ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం తగు సహాయం చేస్తుందని పేర్కొన్నారు. ఏయూఎం.. 76 శాతం అప్.. 2015 నుంచి బీమా రంగంలోకి రూ. 26,000 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని, నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) పరిమాణం గడిచిన అయిదేళ్లలో 76 శాతం పెరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. బీమా కంపెనీల సంఖ్య 53 నుంచి 68కి పెరిగిందని, గత అయిదేళ్లలో 6 కంపెనీలు స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయని వివరించారు. బీమా సంస్థల్లో 74% ఎఫ్డీఐలనేది గరిష్ట పరిమితి మాత్రమేనని, ఆయా కంపెనీలు దీన్ని కచ్చితంగా ఆ స్థాయికి పెంచుకోవాలనేమీ లేదని మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న 2021–22 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐని పెంచేలా సీతారామన్ ప్రతిపాదన చేశారు. బిల్లులో ప్రత్యేకాంశాలు.. ► బీమా సంస్థలు.. పాలసీదారుల సొమ్మును భారత్‌లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. విదేశాలకు తీసుకెళ్లేందుకు కుదరదు. లాభాల్లో కొంత భాగాన్ని భారత్‌లోనే అట్టే ఉంచాలి. ► బోర్డులో మెజారిటీ డైరెక్టర్లు, మేనేజ్మెంట్లో కీలక సభ్యులు స్థానిక భారతీయులే ఉండాలి. డైరెక్టర్లలో కనీసం 50 శాతం మంది స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. ఇన్ఫ్రా కోసం నాబ్‌ఫిడ్ బిల్లు.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ (డీఎఫ్ఐ) ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) బిల్లు 2021ని సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రూ. 20,000 కోట్లతో ఏర్పాటయ్యే డీఎఫ్ఐ రాబోయే కొన్నేళ్లలో రూ. 3 లక్షల కోట్ల దాకా నిధులు సమీకరించవచ్చు. తద్వారా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కింద దాదాపు 7,000 ఇన్ఫ్రా ప్రాజెక్టులకు నిధులను సమకూర్చేందుకు ఇది తోడ్పడనుంది. మరోవైపు, మైనింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలకు ఉద్దేశించిన గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు 2021ని ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఆమోదించింది. -
స్కాట్లాండ్ ఓకే చెప్పింది
ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఒక చట్టం తెచ్చిన ఘనతను స్కాట్లాండ్ దక్కించుకుంది. బిల్లు చట్టం కాగానే దేశవ్యాప్తంగా మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా లభిస్తాయి. ఉచిత విద్యకు, ఉచిత ఆరోగ్య భద్రతకు బిల్లు తెచ్చినంత సులభంగా ఉండదు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేసే బిల్లుకు ఆమోదం లభించడం. ‘అవసరమా?’ అనే ప్రశ్న మొదటే పురుషుల నుంచి వస్తుంది. ఆ తర్వాత ప్రతిపక్షం నుంచి వస్తుంది. తిండికి లేదా? పెడదాం. చదువుకోవాలని ఉందా? చదివిద్దాం. అనారోగ్యం వస్తే వైద్య ఖర్చులకు డబ్బుల్లేవా? ఉచితంగా వైద్యం చేయిద్దాం. కానీ ఇదేంటి! శానిటరీ న్యాప్కిన్లను, టాంపన్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం.. అని రెండేళ్లుగా ‘పీరియడ్ ప్రాడక్ట్స్ (ఫ్రీ ప్రొవిజన్) చట్టం’ బిల్లుకు స్కాట్లాండ్ పార్లమెంటులో విపక్ష సభ్యులు అభ్యంతరం చెబుతూ వస్తున్నారు. అనుకూలంగా ఓటేయకుండా బిల్లును ఆపుతున్నారు. ఎట్టకేలకు.. ఏడాదికి కనీసం 86 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రభుత్వంపై మోపే ‘పీరియడ్ పావర్టీ బిల్లు’కు మంగళవారం నాడు ఏకగ్రీవ ఆమోదం లభించింది. దాంతో ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఒక చట్టం తెచ్చిన ఘనతను స్కాట్లాండ్ దక్కించుకుంది. అన్ని పేదరికాల మాదిరిగానే ప్యాడ్స్‌ని కొనలేని పేదరికం కూడా ఉంటుందని అంటూ ఈ బిల్లుకు ఊపిరిపోసి, బిల్లు సాధనకు ఉద్యమరూపం తెచ్చి, సభ ఆమోదం పొందగలిగేవరకు ఆవిశ్రాంతంగా పోరాటం జరిపిన మోనికా లెనన్ (39) ఇప్పుడు ఆ దేశంలోని మహిళల మన్ననలను పొందుతున్నారు. బిల్లు ముసాయిదాలో పలుమార్లు కనిపించే ‘పీరియడ్ పావర్టీ’ అనే మాటను కూడా తనే సృష్టించిన మోనికా 2016 నుంచీ స్కాటిష్ లేబర్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆమె స్త్రీవాది, శాకాహారి. బిల్లు చట్టం రూపం ధరించగానే దేశవ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్లు, విద్యాసంస్థలు, యూత్ క్లబ్బులు, ఫార్మసీ దుకాణాలన్నింటిలోనూ మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్, టాంపన్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. ‘‘ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను’’ అని స్కాట్లాండ్ మహిళా ప్రధాని (ఫస్ట్ మినిస్టర్ అంటారు) నికోలా స్టురియన్ ట్వీట్ చేస్తూ, ‘మహిళలకు, బాలికలకు అవసరమైన ఒక ముఖ్యమైన ప్రభుత్వ విధానంగా’ ఈ చట్టాన్ని అభివర్ణించారు. అరకోటికి పైగా జనాభా వున్న స్కాట్లాండ్ యు.కె. కిందికి వస్తుంది. ‘ప్లాన్ ఇంటర్నేషనల్ యుకె’ అనే సంస్థ 2017 లో జరిపిన ఒక సర్వేలో యు.కె.లోని ప్రతి 10 మంది బాలికల్లో ఒకరు ప్యాడ్స్ కొనే స్థితిలో లేనివారే. అంతేకాదు, యు.కె.లో 14–21 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికల్లో సగం మంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్యాడ్స్ కొనలేకపోతున్నవారే. -
2024 తర్వాతా పుతినే అధ్యక్షుడు
మాస్కో: రష్యా అధ్యక్షుడిగా మరింత కాలం కొనసాగేందుకు వ్లాదిమిర్ పుతిన్ మార్గాన్ని సుగమం చేసుకున్నారు. పుతిన్ ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం 2024లో ముగియనుంది. ఆ తర్వాతా మరో 12ఏళ్లు తనే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వీలుగా చేసిన రాజ్యాంగ సవరణలను రష్యా పార్లమెంట్ బుధవారం ఆమోదించింది. దిగువ సభ ‘ద స్టేట్ డ్యూమా’ రాజ్యాంగంలో చేసిన పలు సవరణలకు ఓకే చెప్పింది. ఈ సవరణలకు 383 అనుకూల ఓట్లు లభించగా ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడు వ్యతిరేకించకపోవడం గమనార్హం. కాకపోతే 43 మంది సభకు దూరంగా ఉన్నారు. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ సవరణలు అన్నింటికీ ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ఏప్రిల్ 22న దేశవ్యాప్తంగా ఈ సవరణలపై ఓటింగ్ జరగనుంది. అంతకంటే ముందు రష్యా రాజ్యాంగ న్యాయస్థానం ఈ సవరణలను సమీక్షించనుంది. మాజీ కేజీబీ అధికారి అయిన వ్లాదిమిర్ పుతిన్ 20 ఏళ్లుగా రష్యా రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగిస్తుండటం తెల్సిందే. -
రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పొడిగించే బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ 126వ సవరణ బిల్లు గురువారం రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఎస్సీ, ఎస్టీలు ఇంకా వెనకబడే ఉన్నందున, వారిలో క్రీమీలేయర్‌ను వర్తింపజేయాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నామన్నారు. ఈ సవరణ ద్వారా 2030, జనవరి 25 వరకు రిజర్వేషన్లను పొడిగిస్తారు. ఈ బిల్లును 10వ తేదీన లోక్‌సభ ఆమోదించింది. చర్చ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్‌కు, విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌కు మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. అనంతరం కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం, చైర్మన్ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి మేరకు వారు సభకు తిరిగివచ్చారు. -
అమరావతికి పార్లమెంట్ ఆమోదం లేదు!
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం నియమించిన శివ రామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినప్పటికీ దానికి పార్లమెంట్ ఆమోదం లేదని, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం మాత్రమే ఉందని పలువురు వక్తలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద నగరాన్ని నిర్మించాలనే భ్రమలో చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లూ కొట్టుమిట్టాడి.. దాని చుట్టూనే పరిభ్రమించిందని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి.. చంద్రబాబు చెప్పినట్టు ఏ రైతూ సొంతంగా తమ భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వలేదని, మెడ మీద కత్తి పెట్టి భూములు లాక్కున్నారన్నారు. విభజనానంతర ఆంధ్రప్రదేశ్– అభివృద్ధి– సమస్యలపై ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఆంధ్రప్రదేశ్’ విజయవాడలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సులో ముగింపు రోజైన సోమవారం అమరావతి, రాజధాని అభివృద్ధిపై సదస్సు జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సెస్ (హైదరాబాద్)కు చెందిన డాక్టర్ సి.రామచంద్రయ్య, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పురేంద్ర ప్రసాద్, వి.రాజగోపాల్, సామాజిక సేవా కార్యకర్తలు అనుమోలు గాంధీ, ఎం.శేషగిరిరావు, మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, తదితరులు ప్రసంగించారు. చంద్రబాబు తలపెట్టిన భూసమీకరణ పెద్ద బోగస్ అని, సీఆర్డీఏ ప్రాంతంలో గత ఐదేళ్లు మిలటరీ తరహా పాలన సాగిందని శేషగిరిరావు ఆరోపించారు. చివరకు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకున్నారన్నారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే చెప్పి తన అనుచరులు భూములు కొనుక్కునేలా చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ చేయించారని ధ్వజమెత్తారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు సీఆర్డీఏ పనికి వచ్చిందని, వేల కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయని గాంధీ ఆరోపించారు. రాజధాని నిర్మాణాన్ని అవుట్సోర్సింగ్ సంస్థలకు అప్పగించడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని పురేంద్రప్రసాద్ చెప్పారు. ప్రతి గ్రామాన్ని పోలీసు క్యాంపుగా మార్చి ప్రజలను భయపెట్టి భూముల్ని గుంజుకున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. మాజీ ఐఎఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ ప్రజలకు ఏది కావాలో దాన్నే పాలకులు చేపడితే సత్ఫలితాలు వస్తాయన్నారు. -
పోక్సో బిల్లుకు పార్లమెంటు ఓకే
న్యూఢిల్లీ: ‘లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు–2019’ని పార్లమెంటు గురువారం ఆమోదించింది. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించేందుకు కూడా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. ఈ బిల్లును రాజ్యసభ గత నెల 29నే ఆమోదించగా, లోక్‌సభలో బిల్లు గురువారం పాసయ్యింది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఈ బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెడుతూ చిన్నారులపై నేరాలను లింగభేదం లేకుండా ఒకేలా చూసేందుకు ఈ బిల్లును తెచ్చామని అన్నారు. ‘చిన్నారులతో నీలి చిత్రాలు’ (చైల్డ్ పోర్నోగ్రఫీ)కి ఈ బిల్లులో నిర్వచనం కూడా చేర్చి, మరిన్ని ఎక్కువ దుశ్చర్యలను నేరం కిందకు వచ్చేలా చేశారు. పార్టీలకు అతీతంగా అనేకమంది ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దేశంలో 43 కోట్ల మంది చిన్నారులు ఉన్నారనీ, లింగభేదం లేకుండా వారందరికీ న్యాయపరంగా అదనపు భద్రతను ఈ బిల్లు కల్పిస్తుందని ఆమె తెలిపారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును లోక్‌సభ ఆమోదించింది. నపుంసకులుగా మార్చాలి: కిరణ్ ఖేర్ ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్ఎల్పీ సభ్యుడు హనుమాన్ బేనీవాల్ మాట్లాడుతూ పోక్సో చట్టం కింద దోషులుగా తేలిన వారిని బహిరంగంగా ఉరి తీయాలనీ, అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలనుకునే వారికి భయం కలుగుతుందని డిమాండ్ చేశారు. నేరస్తులకు ఉరిశిక్ష విధించడం సాధ్యం కాకపోతే వారిని నపుంసకులుగా మార్చేలా నిబంధనలు ఉండాలని బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ సూచించారు. -
పార్లమెంటు భేటీకి సిరిసేన అంగీకారం
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్లమెంటును వచ్చే వారం సమావేశపర్చే అవకాశముందని స్పీకర్ కరు జయసూర్య కార్యాలయం తెలిపింది. దేశంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభానికి ప్రజాస్వామ్య పద్ధతిలోనే పరిష్కారం కనుగొనాలని చేసిన సూచనకు అధ్యక్షుడు ఓకే చెప్పారు. శ్రీలంక కొత్త ప్రధానిగా రాజపక్స నియామకంపై అటార్నీ జనరల్ జె.జయసూర్య న్యాయసలహా ఇచ్చేందుకు నిరాకరించారు. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం అధికారం లేకపోయినప్పటికీ ప్రధాని విక్రమసింఘేను పదవి నుంచి సిరిసేన తప్పించడాన్ని ఆయన తప్పుపట్టారు. మరోవైపు రాజపక్సను కొత్త ప్రధానిగా చైనా, బురుండి తప్ప మరేదేశాలు అంగీకరించకపోగా, సిరిసేనపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి పెరిగింది. -
‘ఎస్సీ, ఎస్టీల బిల్లు’కు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: దళితులపై వేధింపులను నిరోధించే బిల్లులో పాత నిబంధనలు పునరుద్ధరిస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 6న ఈ బిల్లు లోక్‌సభలో గట్టెక్కగా, గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో పచ్చజెండా ఊపింది. కోర్టు ఆదేశించినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండా, ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదుచేసేలా నిబంధనలను తిరిగి చేర్చారు. నిందితులకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మార్చి 20న సుప్రీంకోర్టు ఈ చట్టంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. -
ఎన్సీబీసీ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ (ఎన్సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు సోమవారం పార్లమెంటు ఆమోదం లభించింది. దీంతో వెనుకబడిన వర్గాల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన సంపూర్ణాధికారాలు ఎన్సీబీసీకి లభించనున్నాయి. రాజ్యాంగ (123వ సవరణ) బిల్లు–2017పై రాజ్యసభలో చర్చ జరిగిన అనంతరం మూడింట రెండొంతుల ఆధిక్యంతో సభ బిల్లును ఆమోదించింది. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చట్టం–1993ను రద్దు చేసిన అనంతరం తాజా బిల్లుకు ఆమోదం లభించింది. సోమవారం చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు మాట్లాడుతూ కులాలవారీ జనగణన లెక్కలను ప్రభుత్వం బయటపెట్టాలనీ, ఆయా కులాల జనాభా ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారు. ‘రేప్‌లకు ఉరి’ బిల్లుకూ ఆమోదం 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్షను విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్‌సభ జూలై 30నే ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఆందోళన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా త్వరలో నియమితులు కానున్న జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని ప్రభుత్వం తగ్గించేందుకు ప్రయత్నిస్తోందన్న విషయంపై విపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వంపై మండిపడ్డాయి. బిహార్‌లోని ముజఫర్‌పూర్ శరణాలయంలో బాలికలపై లైంగిక దోపిడీ జరిగిన అంశంపైనా కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. పీఏసీ సభ్యుడిగా రమేశ్ పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యుడిగా టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఎన్నికయ్యారు. విపక్ష ఐక్య కూటమి ఏకగ్రీవంగా రమేశ్‌ను ఎన్నుకుంది. ఎగువసభలో ఆరుసీట్లున్న టీడీపీ.. పీఏసీ సభ్యత్వం కోసం 106 ఓట్లు సాధించింది. మరో సభ్యుడిగా ఎన్నికైన బీజేపీ ఎంపీ భూపేందర్‌కు 69 ఓట్లొచ్చాయి. పీఏసీలో 15 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులుంటారు. -
20 లక్షల గ్రాట్యుటీకి పన్ను నో
న్యూఢిల్లీ: ఉద్యోగుల గ్రాట్యుటీపై రూ. 20 లక్షల వరకూ పన్ను మినహాయింపునిచ్చే గ్రాట్యుటీ బిల్లు(సవరణ)ను పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లును కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. మార్చి 15నే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి సంతకం అనంతరం బిల్లులోని సవరణలు అధికారికంగా అమల్లోకి వస్తాయి. కేంద్ర ఉద్యోగులకు ఏడో వేతనసంఘం సిఫార్సుల అమలు నేపథ్యంలో.. పన్ను భారం లేని గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడంతో తాజా మార్పులు అవసరమయ్యాయి. కేంద్ర సివిల్ సర్వీస్ నిబంధనలు(1972) వర్తించని ప్రైవేటు రంగంలోని సిబ్బందికి ఈ సవరణ లతో ప్రయోజనం చేకూరనుంది. చివరి నెల జీతంలోని మూల వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని సంస్థలో పనిచేసిన కాలం ఆధారంగా వారి గ్రాట్యుటీని లెక్కిస్తారు. బిల్లులోని ముఖ్యాంశాలు ఉద్యోగుల గ్రాట్యుటీపై గరిష్ట పన్ను పరిమితిని రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడానికి బిల్లు ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుంది. ఇకపై గ్రాట్యుటీ పరిమితిలో అధికారిక ఉత్తర్వుల ద్వారానే కేంద్రం మార్పులు చేర్పులు చేయవచ్చు. ఎన్ని ప్రసూతి సెలవుల్ని సర్వీసులో భాగంగా పరిగణించాలన్న అధికారం కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. ప్రసూతి సెలవుల కాలాన్ని కూడా అధికారిక ఉత్తర్వుల ద్వారానే కేంద్రం నిర్ణయిస్తుంది. ప్రసూతి సెలవు చట్టాన్ని గతేడాది సవరించి గరిష్ట సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచారు. దీంతో గ్రాట్యుటీ చెల్లింపు చట్టంలో ప్రసూతి సెలవులపైనా సవరణలు చేశారు. -
మాదీ ఇక స్వతంత్ర దేశం!
బార్సిలోనా: స్పెయిన్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ కాటలోనియా చేస్తున్న ఉద్యమం పతాక స్థాయికి చేరింది. స్వాతంత్య్రానికే మొగ్గు చూపుతూ జరిగిన రిఫరెండానికి కొనసాగింపుగా స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి శుక్రవారం బార్సిలోనాలోని కాటలోనియా పార్లమెంటు ఆమోదం తెలిపింది. ‘గణతంత్ర స్వతంత్ర దేశంగా కాటలోనియాను ప్రకటిస్తున్నాం’ అనే ఆ తీర్మానానికి అనుకూలంగా 70 మంది, వ్యతిరేకంగా 10 మంది ఓటేశారు. ఆ నిర్ణయం చట్టబద్ధం కాదని, అమలుకు వీలుకాదని స్పెయిన్ తేల్చిచెప్పింది. కాటలోనియాపై ప్రత్యక్ష పాలన విధించేలా ప్రధాని రజోయ్‌కి అధికారాలను అప్పగిస్తూ స్పెయిన్ సెనెట్ తీర్మానం చేసింది. ఐక్య స్పెయిన్‌కే యూరోపియన్ యూనియన్, అమెరికాలు మద్ధతు ప్రకటించాయి. కాటలోనియా పార్లమెంట్‌ను రద్దు చేసి, డిసెంబర్ 21న ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నిర్ణయించారు. కాటలోనియా పార్లమెంటభవనం బయట ఉదయం నుంచే వేలాది మంది స్వాతంత్య్ర మద్దతుదారులు గుమిగూడారు. రహస్య బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఓటింగ్‌లో పాల్గొనడానికి ప్రతిపక్షం నిరాకరిస్తూ వాకౌట్ చేసింది. అయినా మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటేయడంతో కాటలోనియాను స్వతంత్ర రిపబ్లిక్ దేశంగా ప్రకటించేందుకు ఉద్దేశించిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ ఫలితం ప్రకటించిన వెంటనే కాటలోనియన్లు సంబరాలు చేసుకున్నారు. స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ ఇటీవల నిర్వహించిన రెఫరెండంలో 90 శాతం మంది అనుకూలంగా ఓటేసిన సంగతి తెలిసిందే. దీని ఫలితం ఆధారంగానే స్వతంత్ర దేశం ప్రకటించుకుంటామని వేర్పాటువాద నాయకుడు ప్యూగ్డెమోంట్ స్పెయిన్ ప్రభుత్వాన్ని పలుమార్లు హెచ్చరించారు. స్పెయిన్‌లో పాక్షిక స్వతంత్ర హోదా ఉన్న కాటలోనియాలో 16 శాతం ప్రజలు నివసిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఐదో వంతు ఆ ప్రాంతానిదే. తమ వ్యవహారాల్లో స్పెయిన్ జోక్యాన్ని నిరసిస్తున్న కాటలోనియా వాసులు, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తమ గళాన్ని పెంచారు. తమ ప్రాంతానికి పూర్తి స్వాతంత్య్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. వేర్పాటువాదుల ప్రయత్నా లను అణచివేయడానికి స్పెయిన్ ఏ మార్గాన్నీ వదలడం లేదు. దేశంలో రాజకీయ అస్థిరతకు ప్రధాన కారణం వేర్పాటువాదులేనని ప్రధాని ఆరోపిస్తున్నారు. -
జీఎస్టీకి పార్లమెంట్ ఓకే
-
జీఎస్టీకి పార్లమెంట్ ఓకే
♦ మూజువాణి ఓటుతో 4 జీఎస్టీ బిల్లులకు రాజ్యసభ ఆమోదం ♦ జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకు మార్గం సుగమం ♦ ఎస్జీఎస్టీని రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించడమే తరువాయి న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై 1 నుంచి ఒక దేశం– ఒక పన్ను పాలనకు మార్గం సుగమం చేస్తూ జీఎస్టీ బిల్లుల్ని పార్లమెంటు గురువారం ఆమోదించింది. కేంద్ర జీఎస్టీ బిల్లు(సీజీఎస్టీ)2017, సమీకృత జీఎస్టీ బిల్లు(ఐజీఎస్టీ) 2017, జీఎస్టీ(రాష్ట్రాలకు పరిహారం) బిల్లు 2017, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీ బిల్లు(యూటీజీఎస్టీ) 2017ను రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రతిపక్షాలు కొన్ని సవరణలు సూచించినా సభ వాటిని తిరస్కరించింది. కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ సవరణ ప్రతిపాదించినా.. మాజీ ప్రధాని మన్మోహన్æ సలహా మేరకు దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లుల్ని లోక్‌సభ ఆమోదించింది. రాష్ట్రాల జీఎస్టీ(ఎస్జీఎస్టీ) బిల్లును రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదిస్తే.. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుంది. ఆమోదం అందరి ఘనత: జైట్లీ రాజ్యసభలో జీఎస్టీపై సుదీర్ఘ చర్చకు ఆర్థిక మంత్రి జైట్లీ సమాధానమిస్తూ... జీఎస్టీ బిల్లులో యూపీఏ ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందన్నారు. ఇది అందరి ఘనతని ఒప్పుకునేందుకు తాను సంకోచించడం లేదన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదంలో రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, గత ప్రభుత్వాల భాగస్వామ్యం ఉందని చెప్పారు. శిక్షల తీవ్రత తగ్గించాలి: ప్రతిపక్ష సభ్యులు అంతకుముందు సీపీఎం నేత సీతారాం ఏచూరీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా జీఎస్టీ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకోలేదని, అలాంటప్పుడు రాష్ట్రాలకు ఇక ఏం హక్కులు ఉంటాయని ప్రశ్నించారు. జీఎస్టీ మొదటి సంవత్సరం ఏదైనా నేరానికి పాల్పడితే దానిని నాన్ బెయిలబుల్‌గా పరిగణించ వద్దంటూ బీఎస్పీ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా కోరారు. ఆమోదాన్ని ప్రశంసించిన మన్మోహన్ జీఎస్టీ బిల్లును ఆమోదించడాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ ప్రశంసించారు. బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేస్తుందని, అయితే అమలులో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎక్సైజ్ పన్ను రద్దు బిల్లుకు ఆమోదం పెట్రోలియం ఉత్పత్తులు మినహా మిగతా ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్ను, వివిధ సేవలపై సేవా పన్ను, వస్తువుల అమ్మకాలు, కొనుగోలుపై వ్యాట్‌ను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఎక్కువ శాతం ఉత్పత్తులకు పన్ను మినహాయింపు ఎక్కువ శాతం ఉత్పత్తులపై పన్ను ఉండదని, మిగతా వాటిని 5, 12, 18, 28 శాతాల శ్లాబుల్లో చేరుస్తామని జైట్లీ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్ని పన్ను పరిధి నుంచి మినహాయిస్తామని, అనుబంధ ఉత్పత్తుల్ని పన్ను పరిధి నుంచి తొలగిస్తామన్నారు. ప్రస్తుతం ఆహార వస్తువులపై పన్ను లేదని, జీఎస్టీలోనూ విధించమన్నారు. ఇతర నిత్యావసర వస్తువుల్ని తక్కువ పన్ను పరిధిలో ఉంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇక విలాస వస్తువులు, పొగాకు వంటి వాటిపై అదనపు పన్ను విధించి.. రాష్ట్రాలకు ఏర్పడే నష్టాల్ని భర్తీ చేస్తామన్నారు. జీఎస్టీ నెట్వర్క్(ఐటీ)పై పలువురు సభ్యులు ఆందోళనకు సమాధానమిస్తూ.. ప్రస్తుత జీఎస్టీ ఐటీ విభాగం అత్యుత్తమంగా ఉందని, ప్రతీ నెల వందల కోట్ల రసీదుల్ని పరిశీలించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. -
నేడు హస్తినకు గవర్నర్
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. శుక్రవారం కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటారు. రాష్ట్రపతి పాలన గడువు పెంపు ఎలా అనే అంశంపై చర్చించేందుకే నరసింహన్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి ఈ నెలాఖరుకు రెండు నెలలవుతుంది. ఈలోగా పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. లేదంటే ఇన్ని రోజులు సుప్తచేతనావస్థలో ఉన్న అసెంబ్లీ క్రియాశీలతలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పూర్తిగా రద్దు చేసి రాష్ట్రపతి పా లన విధించడమా? లేదా మరేదైనా మార్గం అవలంబించాలా? అనే విషయమై రాష్ట్రపతితోను, కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో ఆయన చర్చించనున్నట్టు సమాచారం.