బార్సిలోనా: స్పెయిన్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ కాటలోనియా చేస్తున్న ఉద్యమం పతాక స్థాయికి చేరింది. స్వాతంత్య్రానికే మొగ్గు చూపుతూ జరిగిన రిఫరెండానికి కొనసాగింపుగా స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి శుక్రవారం బార్సిలోనాలోని కాటలోనియా పార్లమెంటు ఆమోదం తెలిపింది. ‘గణతంత్ర స్వతంత్ర దేశంగా కాటలోనియాను ప్రకటిస్తున్నాం’ అనే ఆ తీర్మానానికి అనుకూలంగా 70 మంది, వ్యతిరేకంగా 10 మంది ఓటేశారు. ఆ నిర్ణయం చట్టబద్ధం కాదని, అమలుకు వీలుకాదని స్పెయిన్ తేల్చిచెప్పింది.
కాటలోనియాపై ప్రత్యక్ష పాలన విధించేలా ప్రధాని రజోయ్‌కి అధికారాలను అప్పగిస్తూ స్పెయిన్ సెనెట్ తీర్మానం చేసింది. ఐక్య స్పెయిన్‌కే యూరోపియన్ యూనియన్, అమెరికాలు మద్ధతు ప్రకటించాయి. కాటలోనియా పార్లమెంట్‌ను రద్దు చేసి, డిసెంబర్ 21న ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నిర్ణయించారు. కాటలోనియా పార్లమెంటభవనం బయట ఉదయం నుంచే వేలాది మంది స్వాతంత్య్ర మద్దతుదారులు గుమిగూడారు. రహస్య బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఓటింగ్‌లో పాల్గొనడానికి ప్రతిపక్షం నిరాకరిస్తూ వాకౌట్ చేసింది.
అయినా మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటేయడంతో కాటలోనియాను స్వతంత్ర రిపబ్లిక్ దేశంగా ప్రకటించేందుకు ఉద్దేశించిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ ఫలితం ప్రకటించిన వెంటనే కాటలోనియన్లు సంబరాలు చేసుకున్నారు. స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ ఇటీవల నిర్వహించిన రెఫరెండంలో 90 శాతం మంది అనుకూలంగా ఓటేసిన సంగతి తెలిసిందే. దీని ఫలితం ఆధారంగానే స్వతంత్ర దేశం ప్రకటించుకుంటామని వేర్పాటువాద నాయకుడు ప్యూగ్డెమోంట్ స్పెయిన్ ప్రభుత్వాన్ని పలుమార్లు హెచ్చరించారు.
స్పెయిన్‌లో పాక్షిక స్వతంత్ర హోదా ఉన్న కాటలోనియాలో 16 శాతం ప్రజలు నివసిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఐదో వంతు ఆ ప్రాంతానిదే. తమ వ్యవహారాల్లో స్పెయిన్ జోక్యాన్ని నిరసిస్తున్న కాటలోనియా వాసులు, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తమ గళాన్ని పెంచారు. తమ ప్రాంతానికి పూర్తి స్వాతంత్య్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. వేర్పాటువాదుల ప్రయత్నా లను అణచివేయడానికి స్పెయిన్ ఏ మార్గాన్నీ వదలడం లేదు. దేశంలో రాజకీయ అస్థిరతకు ప్రధాన కారణం వేర్పాటువాదులేనని ప్రధాని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment