
న్యూఢిల్లీ: ఉద్యోగుల గ్రాట్యుటీపై రూ. 20 లక్షల వరకూ పన్ను మినహాయింపునిచ్చే గ్రాట్యుటీ బిల్లు(సవరణ)ను పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లును కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. మార్చి 15నే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
రాష్ట్రపతి సంతకం అనంతరం బిల్లులోని సవరణలు అధికారికంగా అమల్లోకి వస్తాయి. కేంద్ర ఉద్యోగులకు ఏడో వేతనసంఘం సిఫార్సుల అమలు నేపథ్యంలో.. పన్ను భారం లేని గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడంతో తాజా మార్పులు అవసరమయ్యాయి. కేంద్ర సివిల్ సర్వీస్ నిబంధనలు(1972) వర్తించని ప్రైవేటు రంగంలోని సిబ్బందికి ఈ సవరణ లతో ప్రయోజనం చేకూరనుంది. చివరి నెల జీతంలోని మూల వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని సంస్థలో పనిచేసిన కాలం ఆధారంగా వారి గ్రాట్యుటీని లెక్కిస్తారు.
బిల్లులోని ముఖ్యాంశాలు
ఉద్యోగుల గ్రాట్యుటీపై గరిష్ట పన్ను పరిమితిని రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడానికి బిల్లు ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుంది. ఇకపై గ్రాట్యుటీ పరిమితిలో అధికారిక ఉత్తర్వుల ద్వారానే కేంద్రం మార్పులు చేర్పులు చేయవచ్చు. ఎన్ని ప్రసూతి సెలవుల్ని సర్వీసులో భాగంగా పరిగణించాలన్న అధికారం కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. ప్రసూతి సెలవుల కాలాన్ని కూడా అధికారిక ఉత్తర్వుల ద్వారానే కేంద్రం నిర్ణయిస్తుంది. ప్రసూతి సెలవు చట్టాన్ని గతేడాది సవరించి గరిష్ట సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచారు. దీంతో గ్రాట్యుటీ చెల్లింపు చట్టంలో ప్రసూతి సెలవులపైనా సవరణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment