
న్యూఢిల్లీ: జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ (ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు సోమవారం పార్లమెంటు ఆమోదం లభించింది. దీంతో వెనుకబడిన వర్గాల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన సంపూర్ణాధికారాలు ఎన్‌సీబీసీకి లభించనున్నాయి. రాజ్యాంగ (123వ సవరణ) బిల్లు–2017పై రాజ్యసభలో చర్చ జరిగిన అనంతరం మూడింట రెండొంతుల ఆధిక్యంతో సభ బిల్లును ఆమోదించింది. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చట్టం–1993ను రద్దు చేసిన అనంతరం తాజా బిల్లుకు ఆమోదం లభించింది. సోమవారం చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు మాట్లాడుతూ కులాలవారీ జనగణన లెక్కలను ప్రభుత్వం బయటపెట్టాలనీ, ఆయా కులాల జనాభా ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారు.
‘రేప్‌లకు ఉరి’ బిల్లుకూ ఆమోదం
12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్షను విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్‌సభ జూలై 30నే ఆమోదం తెలిపింది.
లోక్‌సభలో ఆందోళన
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా త్వరలో నియమితులు కానున్న జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని ప్రభుత్వం తగ్గించేందుకు ప్రయత్నిస్తోందన్న విషయంపై విపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వంపై మండిపడ్డాయి. బిహార్‌లోని ముజఫర్‌పూర్ శరణాలయంలో బాలికలపై లైంగిక దోపిడీ జరిగిన అంశంపైనా కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగారు.
పీఏసీ సభ్యుడిగా రమేశ్
పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యుడిగా టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఎన్నికయ్యారు. విపక్ష ఐక్య కూటమి ఏకగ్రీవంగా రమేశ్‌ను ఎన్నుకుంది. ఎగువసభలో ఆరుసీట్లున్న టీడీపీ.. పీఏసీ సభ్యత్వం కోసం 106 ఓట్లు సాధించింది. మరో సభ్యుడిగా ఎన్నికైన బీజేపీ ఎంపీ భూపేందర్‌కు 69 ఓట్లొచ్చాయి. పీఏసీలో 15 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులుంటారు.