సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ ఘటనలో దోషిగా తేలిన మనోహరన్‌కు మరణ శిక్షే సరైన శిక్ష అని గురువారం సుప్రీంకోర్టు పునః నిర్ధారించింది. ఈ మేరకు ఆగస్ట్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. కోయంబత్తూర్‌లో 2010 అక్టోబర్ 29న పాఠశాలకు వెళ్తున్న పదేళ్ల బాలికను, ఏడేళ్ల ఆమె తమ్ముడిని మనోహరన్, మోహన కృష్ణన్ అనే ఇద్దరు బలవంతంగా ఎత్తుకెళ్లారు. పిల్లలిద్దరి చేతులు కట్టేసి, ఆ బాలికపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం వారికి విషమిచ్చి చంపే ప్రయత్నం చేశారు. విష ప్రభావంతో కూడా ఆ చిన్నారులు చనిపోకపోవడంతో.. వారిని చేతులు, కాళ్లు కట్టేసి పరంబికులం–అక్సియార్ ప్రాజెక్టు కాలువలో పడేసి ప్రాణాలు తీశారు.
ఆ తరువాత పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మోహన కృష్ణణ్ హతమయ్యాడు. మనోహరన్‌కు ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. హైకోర్టు ఆ తీర్పును సమర్ధించింది. ఈ ఆగస్ట్‌లో సుప్రీంకోర్టు సైతం వారికి ఉరే సరైన శిక్ష అని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన దారుణంగా ఆ ఘాతుకాన్ని అభివర్ణించింది. అనంతరం మనోహరన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఆ రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ నారిమన్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సంజీవ్ ఖన్నా గత తీర్పును సమర్ధిస్తూ రివ్యూ పిటిషన్‌ను 2:1 తేడాతో తోసిపుచ్చారు. మరణ శిక్షను ఇద్దరు న్యాయమూర్తులు సమర్ధించగా, జస్టిస్ ఖన్నా మాత్రం చనిపోయేంత వరకు కఠిన కారాగార శిక్ష విధించడం సరైన శిక్ష అవుతుందని అభిప్రాయపడ్డారు. మెజారిటీ జడ్జీల తీర్పు మేరకు మనోహరన్‌కు ఉరిశిక్ష ఖాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment