NCBC
-
ఓబీసీల హక్కులకు బాసటగా నిలవాలి
సాక్షి, హైదరాబాద్: వెనకబడిన తరగతుల హక్కుల రక్షణ బాధ్యత జాతీయ బీసీ కమిషన్(ఎన్సీబీసీ)పై ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. బీసీల అభ్యున్నతికి ఈ కమిషన్ మరింత పాటుపడాలని సూచించారు. ఎన్సీబీసీ రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం ఇక్కడి ఖైరతబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆ కమిషన్ చైర్మన్ భగవాన్లాల్ సహానీ అధ్యక్షతన జరిగిన జాతీయ సదస్సులో తమిళిసై మాట్లాడారు. ఎన్సీబీసీ పనితీరు మెరుగ్గా ఉందని, దీంతో క్షేత్రస్థాయిలో ఓబీసీల్లో ధైర్యాన్ని నింపిందని కొనియాడారు. ప్రధాని మోదీ వల్లే ఎన్సీబీసీకి చట్టబద్ధత, రాజ్యాంగ హోదా దక్కాయని అన్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ కేబినెట్లో 27 మం ది బీసీలకు ప్రాతినిధ్యం కల్పించి బీసీల పట్ల బీజేపీ తన ప్రేమను చాటుకుందన్నారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో కాకుండా రాష్ట్రాలకే ఇచ్చిందని, నాగాలాండ్‌లో గిరిజనులకు అక్కడ 85 %ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తుచేశారు. విద్యతోనే భవిష్యత్తు: దత్తాత్రేయ హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ గొర్లు, బర్లు పంపిణీ చేస్తే లాభం ఉండదని, విద్యతోనే ఉత్తమ భవిష్యత్తుకు బాట వేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు. బీసీలకు కేటాయించిన 27 % రిజర్వేషన్లు పక్కాగా అమలయ్యేలా ఎన్సీబీసీ కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రంగంతో సమానంగా ప్రైవేటు రంగంలో కూడా దళిత, బహుజనులు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రతి రంగంలో మహిళలకు సముచితస్థానం క ల్పించాల్సిన అవసరముందన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా ఎన్సీబీసీ రెండేళ్ల పురోగతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఎన్సీబీసీ రెండేళ్ల విజయాలను సభలో వివరించారు. బీసీ గణనపై రగడ జనగణనలో బీసీ కులాలవారీగా గణాంకాలు సేకరించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు సభలో నినాదాలు చేశారు. దీంతో సభ కొంతసేపు గందరగోళంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనాకారులను అదుపులోకి తీసుకోవడంతో సభ సాఫీగా సాగింది. -
102వ సవరణ రాష్ట్రాలకు ఆటంకం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: 102వ రాజ్యాంగ సవరణ ద్వారా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల(ఎస్ఈబీసీ)కు రిజర్వేషన్లు ఇచ్చే అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోలేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా వెనుకబడిన కులాల జాతీయ కమిషన్(ఎన్సీబీసీ) అధికారాల్లో స్పష్టత, ఎస్ఈబీసీ జాబితా మార్చే అధికారం పార్లమెంట్‌కు దఖలు పడిందని ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఎన్ఈబీసీ విషయంలో రాష్ట్రాలకు స్వతంత్ర అధికారాలు అలాగే ఉన్నాయని, ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 342ఏను ఏ మాత్రం మార్చలేదన్నది తన అభిప్రాయమని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఆయన నివేదించారు. ‘102వ సవరణ ఫలితంగా రాష్ట్రాలకున్న అధికారాలను లాగేసుకునే ప్రయత్నం జరిగిందన్న వాదన సరికాదు. ఆర్టికల్స్ 15(4), 16(4) ప్రకారం వెనుకబడిన వర్గాలను గుర్తించే అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉన్నాయి’అని చెప్పారు. ‘ప్రస్తుత విషయానికొస్తే, మరాఠాకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఎన్సీబీసీ వ్యతిరేకించింది. మరాఠాలు వెనుకబడిన తరగతికి చెందిన వారు కాదనేది కేంద్రం అభిప్రాయం. కానీ, రాష్ట్రం తన సొంత వైఖరి ఆవలంబించవచ్చు’అని వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్లున్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదంటూ 1992 నాటి ఇందిరా సాహ్ని కేసు తీర్పును పునఃసమీక్షించేందుకు విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేసే విషయాన్ని పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కేంద్ర రిజర్వేషన్ జాబితానే ప్రామాణికంగా తీసుకుంటారే తప్ప, రాష్ట్ర జాబితా కాదని తెలిపారు. తదుపరి వాదనలు సోమవారం వింటామని ధర్మాసనం పేర్కొంది. సోమవారం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు. -
బీసీ కమిషన్ బిల్లులో ఏముంది?
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుకు రాష్ట్రపతి సంతకం చేయడమే ఇక తరువాయి. చట్టం అమల్లోకి వస్తుంది. ఈ చట్టానికి సంబంధించిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ సోమవారం నాడు ఆమోదించిన విషయం తెల్సిందే. లోక్‌సభ అంతకుముందు ఎప్పుడో ఈ బిల్లును ఆమోదించింది. వాస్తవానికి 2017లోనే ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. అప్పటికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజ్యసభలో పూర్తి మెజారిటీ లేదు. పైగా రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు కావాలి. అప్పట్లో బిల్లుకు కావాల్సిన మెజారిటీని సమీకరించలేక పోవడం బీజేపీ ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బందికి గురి చేసింది. అప్పటికే ఆమోదించినట్లయితే నిజంగా బీసీల తరఫున నిలబడేది తామేనంటూ భుజాలు చరుచుకునే అవకాశం ఉండేది. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదుగానీ తమ ప్రభుత్వ విజయంగా దీన్ని చాటుకునేందుకు ఎక్కువ చాటింపు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభ ఈ బిల్లును ఒక్క ప్రతికూలమైన ఓటు లేకుండా 156 ఓట్ల మద్దతుతో ఆమోదించడమే. 123వ రాజ్యాంగ సవరణ అంటే ఏమిటీ? 1993లో జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సమాజంలో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలను గుర్తించి, వారిని బీసీ జాబితాలో చేర్చుకోవాలా, వద్దా అని నిర్ణయించడం, వాటికి సంబంధించిన ఫిర్యాదులను విచారించడం, ఈ అంశాలకు సంబంధించి అవసరమైన చర్యల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తగిన సిఫార్సులు చేయడం ఈ కమిషన్ బాధ్యతలు. అయితే కమిషన్ సిఫార్సులను అమలు చేయడం, అమలు చేయకపోవడం ప్రభుత్వ విధాన నిర్ణయం పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు 123వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించారు. కొత్తగా వచ్చే అధికారాలేమిటీ? బిల్లులోని 338బీ అధికరణం ప్రకారం ఇతర వెనకబడిన వర్గాలకు కల్పించిన రక్షణ ప్రమాణాలు ఏ మేరకు శక్తివంతంగా ఉన్నాయో తెలుసుకునేందుకు వాటిని పర్యవేక్షించడం, దర్యాప్తు జరిపే అధికారాలు కమిషన్‌కు ఉంటాయి. అందుకోసం సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. ఈ ఓబీసీలకు సంబంధించి ఎలాంటి విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా ఈ కమిషన్‌ను సంప్రతించాల్సి ఉంటుంది. రాజ్యాంగం మేరకు సామాజికంగా, విద్యాపరంగా బీసీలకు సిద్ధించిన హక్కులు, రక్షణ ప్రమాణాలకు సంబంధించిన ఫిర్యాదులను విచారించే అధికారం కమిషన్‌కు ఇక నుంచి ఉంటుంది. ఈ విషయమై విచారించాల్సిన వ్యక్తి దేశంలో ఎక్కడున్న పిలిపించే హక్కు కమిషన్‌కు ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల నుంచే కాకుండా పోలీసు స్టేషన్, కోర్టుల నుంచి కూడా తమకు అవసరమైన డాక్యుమెంట్లను తెప్పించుకునే అధికారం కమిషన్‌కు ఉంటుంది. అలాగే సామాజికంగా, ఆర్థికంగా ఇతర వెనకబడిన వర్గాల అభ్యున్నతికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను జాతీయ బీసీల కమిషన్ ఏటా సమీక్షించి, వాటిపై తీసుకోవాల్సిన చర్యల గురించి సిఫార్సు చేస్తూ రాష్ట్రపతికి ఓ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రపతి ఆ నివేదికను పరిశీలించి చర్యల నివేదికతోపాటు దాన్ని పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. దానిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. కమిషన్‌లో ఎవరెవరుంటారు? ఓ చైర్పర్సన్, ఓ వైస్ చైర్పర్సన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. సభ్యుల పదవీకాలాన్నీ, వారి సర్వీసు నియమ నిబంధనలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. కమిటీలోకి తప్పనిసరిగా ఓ మహిళను తీసుకోవాలని ప్రతిపక్షం డిమాండ్ చేయగా, నియమ నిబంధనల ఖరారు సమయంలో దీన్ని పరిశీస్తామని కేంద్ర ప్రబుత్వం హామీనిచ్చింది. ఈ బిల్లు చరిత్రాత్మకమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వర్ణించగా, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అణచివేతకు గురవుతూ వస్తున్న బీసీలకు ఈ బిల్లు ద్వారా న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు బిల్లుతో ప్రయోజనం కలిగించడం ద్వారా బీజేపీ రాజకీయంగా లబ్ధిపొందే అవకాశాలు ఉన్నాయని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎన్సీబీసీ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ (ఎన్సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు సోమవారం పార్లమెంటు ఆమోదం లభించింది. దీంతో వెనుకబడిన వర్గాల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన సంపూర్ణాధికారాలు ఎన్సీబీసీకి లభించనున్నాయి. రాజ్యాంగ (123వ సవరణ) బిల్లు–2017పై రాజ్యసభలో చర్చ జరిగిన అనంతరం మూడింట రెండొంతుల ఆధిక్యంతో సభ బిల్లును ఆమోదించింది. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చట్టం–1993ను రద్దు చేసిన అనంతరం తాజా బిల్లుకు ఆమోదం లభించింది. సోమవారం చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు మాట్లాడుతూ కులాలవారీ జనగణన లెక్కలను ప్రభుత్వం బయటపెట్టాలనీ, ఆయా కులాల జనాభా ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారు. ‘రేప్‌లకు ఉరి’ బిల్లుకూ ఆమోదం 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్షను విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్‌సభ జూలై 30నే ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఆందోళన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా త్వరలో నియమితులు కానున్న జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని ప్రభుత్వం తగ్గించేందుకు ప్రయత్నిస్తోందన్న విషయంపై విపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వంపై మండిపడ్డాయి. బిహార్‌లోని ముజఫర్‌పూర్ శరణాలయంలో బాలికలపై లైంగిక దోపిడీ జరిగిన అంశంపైనా కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. పీఏసీ సభ్యుడిగా రమేశ్ పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యుడిగా టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఎన్నికయ్యారు. విపక్ష ఐక్య కూటమి ఏకగ్రీవంగా రమేశ్‌ను ఎన్నుకుంది. ఎగువసభలో ఆరుసీట్లున్న టీడీపీ.. పీఏసీ సభ్యత్వం కోసం 106 ఓట్లు సాధించింది. మరో సభ్యుడిగా ఎన్నికైన బీజేపీ ఎంపీ భూపేందర్‌కు 69 ఓట్లొచ్చాయి. పీఏసీలో 15 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులుంటారు. -
రాజ్యాంగ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓబీసీలకు రాజ్యాంగ పదవుల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ జాతీయ సంయుక్త కార్యాచరణ కమిటీ తీర్మానించింది. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో 12 రాష్ట్రాల బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ..సుప్రీంకోర్టు, హైకోర్టు, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగాల్లో రాజ్యాంగ పరంగా ఓబీసీలకు దక్కాల్సిన 27% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల హైకోర్టు నాయమూర్తుల నియామకంలో బీసీలు జడ్జీలుగా పనికిరారంటూ కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు నివే దికలు పంపారని గుర్తు చేశారు. సుప్రీం న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా అదే రీతిలో స్పందించడం సరికాదన్నారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా ప్రస్తుతం దేశంలో 14 శాతం కూడా అమలు కావడం లేదని చెప్పారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు జడ్జీలుగా బీసీలు పనికిరారంటూ ఇచ్చిన తప్పుడు నివేదికలపై బీసీలకు క్షమాపణలు చెప్పాలని సీఎం చంద్రబాబును తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో 69 మంది బీసీలు ఉండాల్సి ఉన్నా కేవలం 19 మందే ఉన్నారని, ఏపీలో 80 మంది బీసీలు ఉండాల్సి ఉన్నా 34 మందే ఉన్నారని తెలిపారు. సదస్సులో మహారాష్ట్ర మంత్రి మహదేవ్ జన్కెర్, ఏపీ నుంచి ఓబీసీ నేత జి.వెంకటేశ్వర్లు, ఉమ్మడి హైకోర్టు న్యాయవాది మెట్టా చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
అక్కడ కేవలం ఇద్దరు యాచకులే!
కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ దేశంలోని యాచకులకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 4 లక్షల మంది యాచకులు, సంచార యాచకులు ఉన్నారు. 81వేల మంది యాచకులతో పశ్చిమ బెంగాల్ ప్రథమ స్థానంలో ఉండగా కేవలం ఇద్దరు యాచకులతో లక్షద్వీప్ చివరి స్థానంలో ఉంది. గెహ్లాట్ లోక్‌సభకు రాసిన లిఖితపూర్వక సమాధానంలో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 4,13,670 మంది యాచకులు ఉండగా వారిలో 2,21,673మంది పురుషులు కాగా, 1,91,997మంది స్త్రీలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ 65,835మంది యాచకులతో రెండో స్థానంలో ఉండగా 30,218 మందితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాచకుల సంఖ్య తక్కువగా ఉంది. 2,187మంది యాచకులతో దేశ రాజధాని ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉండగా, కేవలం ఇద్దరు యాచకులతో లక్షద్వీప్ చివరి స్థానంలో ఉంది. దాద్రా నగర్ హవేలీలో 19మంది, డామన్ డయ్యూలో 22మంది, అండమాన్ నికోబార్‌లో 56మంది యాచకులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. వెనకబడిన తరగతులకు చెందిన ఒక సంస్థ జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్‌ను సంచార జాతులు, యాచకులు, ఆశ్రిత కులాల వారిని, వృత్తి పనులను చేసుకునే వారిని గుర్తించి వారందరినీ ఒబీసీల్లో ఉపకులాలుగా చేర్చాలని కోరింది. గత అక్టోబరులో ప్రధాని మోదీ ఒబీసీల వర్గీకరణ కోసం ఒక కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ఆ కమిషన్ ప్రధాన విధి ఒబీసీల వర్గీకరణ. ఫలితంగా ఎక్కువ వెనకబడిన కులాలకు రిజర్వేషన్లను వర్తింపచేయడం. వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య జాతీయ వెనకబడిన కులాల కమిషన్‌కు ఒక లేఖ రాశారు.దానిలో ఆయన సంచార జాతులను, యాచకులను, ఆశ్రిత కులాల వారిని, వృత్తి పనులను చేసుకునే వారిని ఓబీసీలోని ‘ఏ’ కేటగిరీలో ఉప కులాలుగా చేర్చాలని కోరారు. చేతివృత్తులు చేసుకునేవారిని, విద్య, ఉపాధి రంగాల్లో 50శాతం కన్నా తక్కువ ఉన్నవారిని ‘బీ’ కేటగిరీలో, 50శాతం కన్నా ఎక్కువ ఉన్నవారిని ‘సీ’ కేటగిరీలో ఉపకులాలుగా చేర్చాలని కోరారు. వ్యవసాయం, ఇతర వృత్తులను చేసుకునేవారిని డీ కేటగిరీలో, దళితులు, ముస్లింలు, క్రైస్తవులను ఈ కేటగిరీలో చేర్చాలని లేఖలో వివరించారు. జనాభావారీగా విభజించిన తర్వాత రిజర్వేషన్‌ను నిర్ణయించాలని కోరారు. -
మళ్లీ లోక్‌సభకు ‘ఎన్సీబీసీ’ బిల్లు!
న్యూఢిల్లీ: ఇతర వెనకబడిన తరగతుల(ఓబీసీ) జాతీయ కమిషన్ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో మరోసారి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గత సమావేశాల్లోనే ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. కానీ రాజ్యసభ మాత్రం కొన్ని సవరణలతో దీన్ని ఆమోదించడంతో.. ఈ బిల్లు మరోసారి లోక్‌సభ ముందుకు రావాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. ‘నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ)’కు కూడా షెడ్యూల్డ్ కులాలు, తెగల జాతీయ కమిషన్ తరహాలో రాజ్యాంగబద్ధ హోదా లభిస్తుంది. ఓబీసీలు చాన్నాళ్లుగా కోరుతున్న ఈ రాజ్యాంగబద్ధ హోదా లభిస్తే.. దేశవ్యాప్తంగా వెనకబడిన వర్గాల మద్దతు బీజేపీకి లభించే అవకాశాలున్నాయని కాషాయ పార్టీ భావిస్తోంది. ఎన్సీబీసీ రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పడితే.. దానికి ఓబీసీల హక్కులు, ప్రయోజనాలకు బలమైన రక్షణ కల్పించే అధికారం లభిస్తుంది. 1993లో ఎన్‌సీబీసీని పరిమిత అధికారాలతో చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు. ఏ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలి, ఏ కులాన్ని జాబితా నుంచి తొలగించాలనే సూచనలిచ్చే అధికారం మాత్రమే ఆ సంస్థకు ఉండేది. ఓబీసీల ఫిర్యాదుల పరిష్కార బాధ్యత కూడా షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్‌కే ఉండేది. ఎన్సీబీసీ ఏర్పడితే ఓబీసీల ఫిర్యాదుల పరిష్కారం, హక్కులు, అధికారాల పరిరక్షణ.. మొదలైనవి ఆ సంస్థ పరిధిలోకి వస్తాయి. -
అనాథలకు ‘ఓబీసీ’ రిజర్వేషన్
న్యూఢిల్లీ: జనరల్ కేటగిరీకి చెందిన అనాథ పిల్లలు ఇకపై ఓబీసీ కేటగిరీతోపాటు 27 శాతం రిజర్వేషన్ పొందనున్నారు. ఈ మేరకు వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్(ఎన్సీబీసీ) గతవారం తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రకారం తల్లిదండ్రులను కోల్పోయిన పదేళ్లలోపు పిల్లలు ఓబీసీ జాబితాలో స్థానం పొందుతారు. తద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఉద్యోగాల్లో ఓబీసీ కోటా కింద రిజర్వేషన్ లభిస్తుంది. తీర్మానం ప్రతిని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు పంపించినట్లు ఎన్సీబీసీ సభ్యుడు అశోక్ సైని తెలిపారు. ఎన్సీబీసీ ప్రతిపాదనలు అన్ని ప్రధాన పార్టీలు పరిగణనలోకి తీసుకున్నట్లు.. ఇక కేబినెట్ ఆమోదం మాత్రమే మిగిలి ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇదే తరహాలో హిజ్రాలకు ఓబీసీలో 27 శాతం కోటా అమలు చేయాలని ఎన్సీబీసీ ప్రతిపాదించగా ఓబీసీ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కేంద్రం దానిని నిలుపుదల చేసింది.