![Rights Of States On Backward Classes Not Affected By 102nd Constitution Amendment - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/19/896061492.jpg.webp?itok=HNotx5HH)
సాక్షి, న్యూఢిల్లీ: 102వ రాజ్యాంగ సవరణ ద్వారా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల(ఎస్‌ఈబీసీ)కు రిజర్వేషన్లు ఇచ్చే అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోలేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా వెనుకబడిన కులాల జాతీయ కమిషన్(ఎన్‌సీబీసీ) అధికారాల్లో స్పష్టత, ఎస్‌ఈబీసీ జాబితా మార్చే అధికారం పార్లమెంట్‌కు దఖలు పడిందని ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు.
ఎన్‌ఈబీసీ విషయంలో రాష్ట్రాలకు స్వతంత్ర అధికారాలు అలాగే ఉన్నాయని, ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 342ఏను ఏ మాత్రం మార్చలేదన్నది తన అభిప్రాయమని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఆయన నివేదించారు. ‘102వ సవరణ ఫలితంగా రాష్ట్రాలకున్న అధికారాలను లాగేసుకునే ప్రయత్నం జరిగిందన్న వాదన సరికాదు. ఆర్టికల్స్ 15(4), 16(4) ప్రకారం వెనుకబడిన వర్గాలను గుర్తించే అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉన్నాయి’అని చెప్పారు. ‘ప్రస్తుత విషయానికొస్తే, మరాఠాకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఎన్‌సీబీసీ వ్యతిరేకించింది. మరాఠాలు వెనుకబడిన తరగతికి చెందిన వారు కాదనేది కేంద్రం అభిప్రాయం. కానీ, రాష్ట్రం తన సొంత వైఖరి ఆవలంబించవచ్చు’అని వివరించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌లున్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదంటూ 1992 నాటి ఇందిరా సాహ్ని కేసు తీర్పును పునఃసమీక్షించేందుకు విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేసే విషయాన్ని పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కేంద్ర రిజర్వేషన్ జాబితానే ప్రామాణికంగా తీసుకుంటారే తప్ప, రాష్ట్ర జాబితా కాదని తెలిపారు. తదుపరి వాదనలు సోమవారం వింటామని ధర్మాసనం పేర్కొంది. సోమవారం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment