సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జిల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలకు తాత్కాలిక తెరపడింది. సంక్షోభం ముగిసినట్లేనని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రకటించారు. ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. సోమవారం లోపు సమస్యను పరిష్కరిస్తామని ఇది వరకే ఆయన ప్రకటించిన విషయం విదితమే. ఇక అధికారికంగా ఈ విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీడియా ఎదుట ప్రకటించనుంది.
న్యాయ నిపుణులు, బార్ అసోషియేషన్ సభ్యులు విడివిడిగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, అసంతృప్త న్యాయమూర్తులతో దఫాలుగా భేటీ అయ్యారు. చివరకి వారి మధ్యవర్తిత్వంతో వివాదాన్ని ముగించేందుకు సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తులంతా ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అటార్నీ జనరల్ వేణుగోపాల్ వ్యాఖ్యానిస్తూ... న్యాయమూర్తుల మధ్య సఖ్యత ఏర్పడిందని, దీన్ని మరింత పొడిగించాలని వారు కూడా అనుకోవడం లేదు. ఇప్పుడంతా ఓకే అని పేర్కొన్నారు.
భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారిగా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) దీపక్ మిశ్రా పనితీరుపై సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కొన్ని రోజులుగా సర్వోన్నత న్యాయస్థానంలో పాలన వ్యవహారాలు సవ్యంగా జరగడం లేదని, వాటిని సరిదిద్దేలా సీజేఐని ఒప్పించడంలో తాము విఫలమయ్యామని, విధిలేని పరిస్థితుల్లోనే ప్రజల ముందుకొచ్చి వాస్తవాలను వెల్లడించాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment