న్యూఢిల్లీ: సోషల్ మీడియాను అణచివేయాలనుకోవడం సరైంది కాదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ చెప్పారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి అది ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తే ప్రభుత్వానికి చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిపారు. అతి తక్కువ కేసుల్లోనే సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు చేపడుతుందని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో బహిరంగ చర్చలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచి చేసే పరిణామమేనని వ్యాఖ్యానించారు. హద్దులు మీరితే తప్ప సాధారణంగా విమర్శలపై సుప్రీంకోర్టు పెద్దగా స్పందించబోదని అన్నారు.
భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే చర్యలను ప్రారంభించకూడదని ప్రభుత్వానికి కె.కె.వేణుగోపాల్ సూచించారు. స్వేచ్ఛతో కూడిన ప్రజాస్వామ్యం, బహిరంగ చర్చలు అవసరమేనని తెలిపారు. సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకొని ట్వీట్లు చేస్తున్న వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని తనకు విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. అలాంటి విజ్ఞప్తులు త్వరలో ఆగిపోతాయని ఆశిస్తున్నట్లు పీటీఐకి తెలిపారు. ఎవరిపై అయినా కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలంటే అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ అంగీకారం తెలిపాల్సి ఉంటుంది.
సెంట్రల్ విస్టా శంకుస్థాపనకు ఓకే
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి 10వ తేదీన పునాది రాయి వేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం నుంచి నిర్ణయం వెలువడే వరకూ ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టబోమని సర్కారు హామీ ఇవ్వడంతో శంకుస్థాపన విషయంలో సానుకూలంగా స్పందించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన సముదాయం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవన నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలువురు పిల్‌లు చేశారు. వీటిపై తాజాగా జస్టిస్ ఎ.ఎం.ఖాన్వీల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ం హామీని పరిగణనలోకి తీసుకుని శంకుస్థాపనకు అనుమతి ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment