డెహ్రాడూన్ : మైనర్ బాలికలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణ శిక్ష విధించాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయనుంది. ఈ మేరకు బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ప్రకటించారు. కాశీపూర్‌లో శుక్రవారం జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అత్యాచారాలను అరికట్టడానికి ఇకపై కఠిన చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, త్వరలోనే ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని రావత్ వెల్లడించారు.
కాగా, మైనర్ బాలికలపై అత్యాచారం జరిపిన వారికి మరణశిక్ష విధించాలని మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలు ఇదివరకే చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులకు ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామని ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ ప్రకటించిన విషయం విధితమే.
Comments
Please login to add a commentAdd a comment