జీఎస్టీకి పార్లమెంట్‌ ఓకే | Parliament passes 4 GST bills, July 1 rollout likely | Sakshi
Sakshi News home page

జీఎస్టీకి పార్లమెంట్‌ ఓకే

Published Fri, Apr 7 2017 1:24 AM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

జీఎస్టీకి పార్లమెంట్‌ ఓకే

జీఎస్టీకి పార్లమెంట్‌ ఓకే

మూజువాణి ఓటుతో 4 జీఎస్టీ బిల్లులకు రాజ్యసభ ఆమోదం
జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకు మార్గం సుగమం
ఎస్జీఎస్టీని రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించడమే తరువాయి


న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై 1 నుంచి ఒక దేశం– ఒక పన్ను పాలనకు మార్గం సుగమం చేస్తూ జీఎస్టీ బిల్లుల్ని పార్లమెంటు గురువారం ఆమోదించింది. కేంద్ర జీఎస్టీ బిల్లు(సీజీఎస్టీ)2017, సమీకృత జీఎస్టీ బిల్లు(ఐజీఎస్టీ) 2017, జీఎస్టీ(రాష్ట్రాలకు పరిహారం) బిల్లు 2017, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీ బిల్లు(యూటీజీఎస్టీ) 2017ను రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రతిపక్షాలు కొన్ని సవరణలు సూచించినా సభ వాటిని తిరస్కరించింది. కాంగ్రెస్‌ సభ్యుడు జైరాం రమేశ్‌ సవరణ ప్రతిపాదించినా.. మాజీ ప్రధాని మన్మోహన్‌æ సలహా మేరకు దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లుల్ని  లోక్‌సభ ఆమోదించింది. రాష్ట్రాల జీఎస్టీ(ఎస్జీఎస్టీ) బిల్లును రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదిస్తే.. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుంది.

ఆమోదం అందరి ఘనత: జైట్లీ
రాజ్యసభలో జీఎస్టీపై సుదీర్ఘ చర్చకు ఆర్థిక మంత్రి జైట్లీ సమాధానమిస్తూ... జీఎస్టీ బిల్లులో యూపీఏ ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందన్నారు. ఇది అందరి ఘనతని ఒప్పుకునేందుకు తాను సంకోచించడం లేదన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదంలో రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, గత ప్రభుత్వాల భాగస్వామ్యం ఉందని చెప్పారు.    

శిక్షల తీవ్రత తగ్గించాలి: ప్రతిపక్ష సభ్యులు
అంతకుముందు సీపీఎం నేత సీతారాం ఏచూరీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా జీఎస్టీ కౌన్సిల్‌ ఏ నిర్ణయం తీసుకోలేదని, అలాంటప్పుడు రాష్ట్రాలకు ఇక ఏం హక్కులు ఉంటాయని ప్రశ్నించారు. జీఎస్టీ మొదటి సంవత్సరం ఏదైనా నేరానికి పాల్పడితే దానిని నాన్‌ బెయిలబుల్‌గా పరిగణించ వద్దంటూ బీఎస్పీ ఎంపీ సతీష్‌ చంద్ర మిశ్రా కోరారు.

ఆమోదాన్ని ప్రశంసించిన మన్మోహన్‌
జీఎస్టీ బిల్లును ఆమోదించడాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌ ప్రశంసించారు.  బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేస్తుందని, అయితే అమలులో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఎక్సైజ్‌ పన్ను రద్దు బిల్లుకు ఆమోదం
పెట్రోలియం ఉత్పత్తులు మినహా మిగతా ఉత్పత్తులపై ఎక్సైజ్‌ పన్ను, వివిధ సేవలపై సేవా పన్ను, వస్తువుల అమ్మకాలు, కొనుగోలుపై వ్యాట్‌ను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది.

ఎక్కువ శాతం ఉత్పత్తులకు పన్ను మినహాయింపు
ఎక్కువ శాతం ఉత్పత్తులపై పన్ను ఉండదని, మిగతా వాటిని 5, 12, 18, 28 శాతాల శ్లాబుల్లో చేరుస్తామని జైట్లీ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్ని పన్ను పరిధి నుంచి మినహాయిస్తామని, అనుబంధ ఉత్పత్తుల్ని పన్ను పరిధి నుంచి తొలగిస్తామన్నారు. ప్రస్తుతం ఆహార వస్తువులపై పన్ను లేదని, జీఎస్టీలోనూ విధించమన్నారు.

ఇతర నిత్యావసర వస్తువుల్ని తక్కువ పన్ను పరిధిలో ఉంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇక విలాస వస్తువులు, పొగాకు వంటి వాటిపై అదనపు పన్ను విధించి.. రాష్ట్రాలకు ఏర్పడే నష్టాల్ని భర్తీ చేస్తామన్నారు. జీఎస్టీ నెట్‌వర్క్‌(ఐటీ)పై పలువురు సభ్యులు ఆందోళనకు సమాధానమిస్తూ.. ప్రస్తుత జీఎస్టీ ఐటీ విభాగం అత్యుత్తమంగా ఉందని, ప్రతీ నెల వందల కోట్ల రసీదుల్ని పరిశీలించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement