సాక్షి, హైదరాబాద్: సకాలంలో బీమా చెల్లించకుండా ఓ ఖాతాదారుడికి నష్టం కలిగించడమే కాకుండా, తప్పు తమది కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిన కెనరా బ్యాంకు తీరును రాష్ట్ర వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది. వ్యాపారం కోసం ఖాతాదారుడు రుణం తీసుకున్నప్పుడు, రుణ ఒప్పందం ప్రకారం బీమా చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకుదేనని తేల్చి చెప్పింది. సకాలంలో బీమా మొత్తం చెల్లించకపోవడం వల్ల ఆ ఖాతాదారుడికి కలిగే నష్టాన్ని భరించాల్సింది బ్యాంకేనంది. సకాలంలో బీమా చెల్లించకపోవడం వల్ల వైఎన్ ప్రెస్‌కు జరిగిన ఆస్తినష్టానికి బాధ్యత వహించాల్సిందేనని కెనరా బ్యాంకును వినియోగదారుల ఫోరం ఆదేశించింది. అతనికి రూ.7 లక్షల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో చెల్లించాలని బ్యాంకుకు స్పష్టం చేసింది. ఖర్చుల కింద రూ.10వేలను చెల్లించాలంది. ఈ మేరకు ఫోరం అధ్యక్షుడు జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్, సభ్యులు కె.రమేశ్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఖమ్మం జిల్లాకు చెందిన వై.శేఖర్ వైఎన్ ప్రెస్ పేరుతో వ్యాపారం ప్రారంభించారు.
వ్యాపార టర్నోవర్ బాగుండటంతో ఖమ్మంలోని కెనరా బ్యాంకు శేఖర్ ప్రెస్‌కు 2010లో రూ. 20 లక్షల రుణం ఇచ్చింది. ఒప్పందం మేరకు ప్రెస్ స్టాక్‌కు బ్యాంకే బీమా చెల్లించాలి. దీని ప్రకారం 2013 వరకు బీమా చెల్లించింది. 2014 నుంచి చెల్లించలేదు. పాలసీ రెన్యువల్ చేసుకోవాలని బీమా కంపెనీ నోటీసు పంపినా కెనరా బ్యాంకు పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా 2015లో వైఎన్ ప్రెస్‌లో విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగింది. దీంతో శేఖర్ పరి హారం కోసం బీమా కంపెనీకి దరఖాస్తు చేసుకోగా, తమకు బ్యాంకు ప్రీమియం చెల్లించలేదని బీమా కంపెనీ తెలిపింది. దీంతో శేఖర్ కెనరా బ్యాంకుపై రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీనిపై జస్టిస్ జైశ్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
కెనరా బ్యాంకు వాదనను తోసిపుచ్చింది. బీమా కంపెనీ చూపిన రుజువులూ పరిశీలించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరిస్తూ కెనరా బ్యాంకు వాదనను తప్పుపట్టింది. తన తప్పును బీమా కంపెనీపై నెడుతోందంటూ ఆక్షేపించింది. ఇది పూర్తిగా బ్యాంకు బాధ్యతారాహిత్యమే కాక, సేవలను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనని తేల్చింది. దీని వల్ల వైఎన్ ప్రెస్‌కు జరిగిన నష్టానికి కెనరా బ్యాంకే బాధ్యత వహించాలంది. వైఎన్ ప్రెస్ రూ.43 లక్షల మేర నష్టం వాటిల్లిందని సర్వేయర్ నివేదిక చెబుతోందని, పోలీసులు రూ.6.8 లక్షల మేరే నష్టమని చెబుతున్నారని తెలిపింది. అందువల్ల వైఎన్ ప్రెస్‌కు రూ.7 లక్షల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో సహా చెల్లించాలని కెనరా బ్యాంకును ఆదేశించింది. అలాగే ఖర్చుల కింద మరో రూ.10వేలు ఇవ్వాలంది.
బీమా చెల్లించకుండా నష్టం కలిగించారు
Published Tue, Jan 15 2019 1:57 AM | Last Updated on Tue, Jan 15 2019 1:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment