విడిగానే ఫ్యామిలీ హెల్త్‌! | Family Float Policy | Sakshi
Sakshi News home page

విడిగానే ఫ్యామిలీ హెల్త్‌!

Published Sun, Aug 6 2017 11:38 PM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM

విడిగానే ఫ్యామిలీ హెల్త్‌!

విడిగానే ఫ్యామిలీ హెల్త్‌!

వృద్ధాప్య తల్లిదండ్రులను చేరిస్తే అధిక ప్రీమియం
కవరేజీ కూడా పరిమితంగానే ఉంటుంది
విడిగా వారికంటూ పాలసీ తీసుకుంటే అధిక కవరేజీ
ప్రీమియం పెరగకుండా రెండు విధాల ప్రయోజనం
కొన్ని తప్పనిసరి సందర్భాల్లోనే సింగిల్‌ పాలసీ  


బీమా కంపెనీలిపుడు ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలో దంపతులు, వారి ఇద్దరి పిల్లలతోపాటు వృద్ధులైన తల్లిదండ్రులకూ చోటు కల్పిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఈ తరహా పాలసీలను ఆఫర్‌ చేయడం పెరిగింది. మరి ఇది లాభమేనా? లేక నష్టపోతామా? ఈ విషయం తేల్చుకోవాలంటే కొన్ని అంశాలను చూడాల్సి ఉంటుంది. వృద్ధులను ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలో చేరిస్తే ప్రీమియం అధికంగా ఉంటుంది. విడిగా వారికి ఓ పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువ కావొచ్చు. అందుకే పాలసీ తీసుకునే ముందు వీటన్నింటినీ ఓసారి జాగ్రత్తగా పరిశీలించాలి.
– సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

తల్లిదండ్రులను చేరిస్తే సమస్యలివీ...
తల్లిదండ్రులను సైతం ఒకే పాలసీలో చేర్చే ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ ఎంచుకుంటే, పెద్ద వయసులో ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని బీమా కంపెనీలు కోరతాయి. ఇందులో వచ్చే ఫలితాల ఆధారంగా దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం లేకపోలేదు. లేదా కొన్ని నియంత్రణలనైనా పెడుతుంటాయి. ఏదైనా వ్యాధి అప్పటికే ఉండుంటే కవరేజీ రూపేణా ప్రీమియం పెరిగిపోతుంది. హెల్త్‌ పాలసీల్లో ఓ ఏడాదిలో క్లెయిమ్‌ లేకపోతే తదుపరి ఏడాది ప్రీమియంలో నో క్లెయిమ్‌ బోనస్‌ రూపేణా తగ్గింపు పొందొచ్చు. కానీ, వృద్ధులైన తల్లిదండ్రులనూ ఒకే పాలసీలో చేర్చడం వల్ల వారి కోసం చికిత్సల పేరుతో ఏటా క్లెయిమ్‌ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అందుకే వారిని కూడా కలిపి ఒకే పాలసీ తీసుకునేట్టు అయితే నో క్లెయిమ్‌ బోనస్‌ ప్రయోజనం కోల్పోవాల్సి ఉంటుంది. రెండు వేర్వేరు పాలసీలను తీసుకుంటే పేరెంట్స్‌ పాలసీలో తరచూ క్లెయిమ్‌లున్నప్పటికీ మిగిలిన పాలసీలో అయినా నో క్లెయిమ్‌ బోనస్‌ పొందడానికి వీలుంటుంది.

ఇక తల్లిదండ్రుల కోసం విడిగా పాలసీ తీసుకుంటే దానికి చెల్లించే ప్రీమియానికీ సెక్షన్‌ 80డీ కింద అదనపు పన్ను మినహాయింపు పొందొచ్చు. తనకు, తన జీవిత భాగస్వామి, పిల్లలకు తీసుకున్న హెల్త్‌ ప్లాన్‌పై ఓ ఏడాదిలో రూ.25,000 వరకు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు ఈ సెక్షన్‌ కింద లభిస్తుంది. అలాగే, 60ఏళ్లు దాటిన తల్లిదండ్రులకు తీసుకునే హెల్త్‌ పాలసీపై ఏడాదికి రూ.30వేల ప్రీమియానికీ పన్ను ప్రయోజనం లభిస్తుంది. ఇలా రెండు వేర్వేరు పాలసీలు తీసుకున్నప్పటికీ ఆదాయపన్ను రిటర్నుల్లో ఒకే కాలమ్‌లో రెండింటి మొత్తాన్ని కలిపి పేర్కొనాల్సి ఉంటుంది. హెల్త్‌ చెకప్‌లకు అయ్యే వ్యయాన్నీ కూడా ఇదే కాలమ్‌లో గరిష్ట పన్ను మినహాయింపు పరిధి మేరకు చూపించుకోవచ్చనేది ఆదిత్య బిర్లా హెల్త్‌ కంపెనీ ప్రతినిధి సూచన.

ఒకే పాలసీ ఏ సందర్భంలో...?
ముందస్తు వ్యాధుల చరిత్ర ఉంటే వృద్ధులైన తల్లిదండ్రులకు పాలసీ ఇచ్చేందుకు కంపెనీలు నిరాకరించినపుడు వారితో కలిపి ఒకే ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకోవడం ప్రయోజనకరం. కొన్ని బీమా కంపెనీలు ఇందుకు అవకాశమిస్తున్నాయి. అయితే, వృద్ధాప్యంలో ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నాణ్యమైన ఆరోగ్య రక్షణ కవరేజీ అందించాల్సిన ప్రాముఖ్యతను గుర్తించి అటువంటి కేసుల్లో తాము సులభంగానే వ్యవహరిస్తున్నట్టు మ్యాక్స్‌బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ ఆశిష్‌ మెహరోత్రా తెలిపారు. ‘‘తల్లిదండ్రులకు విడిగా పాలసీ లభించని పక్షంలోనే వారిని వారి పిల్లలు తమ ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలో చేర్చుకోవాలి.

సీనియర్లు విడిగా పాలసీ కోసం దరఖాస్తు చేసుకుంటే లభించడం కష్టం. ముందస్తు వ్యాధులతో ఉంటే మరింత కష్టమవుతుంది. అదే ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలో అయితే కవరేజీ పొందే అవకాశాలు ఎక్కువ’’అని బీమా బ్రోకరేజీ సంస్థ జేఎల్టీ డిప్యూటీ సీఈవో అరవింద్‌ లద్దా వివరించారు. మ్యాక్స్‌ బూపా హార్ట్‌బీట్‌ ఫ్యామిలీ ఫస్ట్‌ ప్లాన్‌లో ఓ వ్యక్తి 20 రకాల బంధుత్వాలు ఉన్నవారిని ఒకే పాలసీలో చేర్చుకునే అవకాశం ఉందని, వయసు పరంగా ఎటువంటి గరిష్ట పరిమితులు కూడా లేవని ఆ సంస్థ ఎండీ ఆశిష్‌ మెహరోత్రా తెలిపారు.  

వయసు ఆధారంగా...
ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీల ప్రీమియం ఆ కుటుంబ సభ్యుల్లో గరిష్ఠ వయసున్న వ్యక్తి ఆధారంగా ఖరారు చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు లేదా అత్త, మామలను అందులో చేరిస్తే సాధారణంగా వారు పెద్ద వయసులో ఉంటారు గనుక తక్కువ బీమాకే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ‘‘దీనికి బదులు రెండు ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలను తీసుకోవడం లాభకరం. ఒకటి తల్లిదండ్రులకు, మరొకటి వారి కుమారుడు లేదా కుమార్తె కుటుంబానికి’’ అనేది మార్కెట్‌ నిపుణుడు రాహుల్‌ మెహతా సూచన. నలుగురు సభ్యులున్న కుటుంబంలో ఆర్జనపరుడైన వ్యక్తి పాలసీ తీసుకోవాలని అనుకున్న సందర్భంలో ఏం జరుగుతుందో ఉదాహరణతో చూద్దాం.
చరణ్‌ వయసు 30, జీవిత భాగస్వామి వయసు 28, తండ్రి వయసు 55, తల్లి వయసు 50గా భావిస్తే రూ.5 లక్షల కవరేజీకి ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌ పాలసీ తీసుకోవాలని భావించారు.

దీనికి మ్యాక్స్‌ బూపా ఫ్యామిలీ ఫస్ట్‌ పాలసీలో ప్రీమియం రూ.59,113. అదే ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎన్హాన్స్‌లో ప్రీమియం రూ.62,289.ఇలా కాకుండా తల్లిదండ్రులకు, మిగిలిన కుటుంబ సభ్యులకు వేర్వేరు పాలసీలు తీసుకుంటే ఇంతే ప్రీమియానికి రెట్టింపు కవరేజీ అందుకోవచ్చు. ఇక్కడ చెప్పుకున్నట్టు చరణ్‌ తల్లిదండ్రులకు రూ.10లక్షల హెల్త్‌ ప్లాన్, అతడు, అతడి జీవిత భాగస్వామి కోసం రూ.10 లక్షల కవరేజీతో మరో ప్లాన్‌కు కలిపి చెల్లించాల్సిన ప్రీమియం రూ.50,321. ప్రీమియం రూ.9వేలు తగ్గడంతోపాటు కవరేజీ రెట్టింపైంది. అదే ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో యాక్టివ్‌ హెల్త్‌ ఎన్హాన్స్‌లో రెండు వేర్వేరు పాలసీలకు కలిపి ప్రీమియం రూ.59,201. ఒకే పాలసీ, విడిగా పాలసీల్లో ప్రయోజనాల విషయంలో కొన్ని తేడాలు ఉండొచ్చు.

రీస్టోరేషన్‌ ప్రయోజనాలు అదనం
ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌ పాలసీల్లో చాలా కంపెనీలు రీస్టోరేషన్‌ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అంటే రూ.5 లక్షల పాలసీలో ఓ ఏడాదిలో మొత్తం కవరేజీ వినియోగించుకుంటే, తిరిగి మళ్లీ రూ.5 లక్షల కవరేజీ ఆ ఏడాదికి పునరుద్ధరించబడుతుంది. ఉదాహరణకు ఓ కుటుంబ సభ్యుడు అనారోగ్యం పాలై ఆస్పత్రి ఖర్చులు రూ.5 లక్షలు దాటిపోతే కవరేజీ మొత్తం ఖర్చయిపోతుంది. అప్పుడు ఇక ఆ ఏడాదికి వైద్య పరంగా రక్షణ లేకుండా పోతుంది. కానీ, రీస్టోరేషన్‌లో కవరేజీ అయిపోయిన వెంటనే మరొక్కసారి అంతే మొత్తాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. దీనికి అదనంగా చార్జీ వసూలు చేయడం ఉండదు. ఈ బెనిఫిట్‌ను పైన చెప్పుకున్న ఉదాహరణలకు అన్వయించి చూద్దాం. తల్లిదండ్రులను కూడా ఒకే పాలసీ కింద కలిపి తీసుకుంటే రూ.5 లక్షల పాలసీకి రీస్టోరేషన్‌ బెనిఫిట్‌ కూడా కలుపుకుంటే దురదృష్టకరమైన పరిస్థితుల్లో రూ.10 లక్షల వరకూ రక్షణ పొందొచ్చు.

కానీ, ఇంతే ప్రీమియానికి రెట్టింపు కవరేజీతో వస్తుందని వేర్వేరు పాలసీలు తీసుకుంటే అప్పుడు ఒక్కో పాలసీలో బేసిక్‌ కవరేజీ రూ.10లక్షలు, రీస్టోరేషన్‌ కింద అదనంగా రూ.10 లక్షలు. కలిపితే రెండు పాలసీలపై నలుగురు సభ్యులు రూ.40 లక్షల వరకు రక్షణ పొందొచ్చు. ఎంతటి ఉపద్రవం వచ్చి పడినా నిశ్చింతగా ఉంచే కవరేజీ ఇది. పైగా ద్రవ్యోల్బణం ప్రభావంతో నేడు ఓ వ్యాధికి అయ్యే చికిత్సా వ్యయం ఐదేళ్ల తర్వాత ఎంత లేదనుకున్నా కనీసం 50 శాతం అధికమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ రకంగా చూస్తే తల్లిదండ్రులకు విడిగా పాలసీ తీసుకోవడం ప్రయోజనకరమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement