అంగరంగ వైభవంగా పునఃప్రారంభమైన నోట్రే డామ్ చర్చి
ఐదేళ్లలోనే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ
పారిస్‌లో దేశాధినేతల సమక్షంలో వేడుకలు
హాజరైన ట్రంప్, ప్రిన్స్ విలియం తదితరులు
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో 861 సంవత్సరాల చరిత్ర కలిగిన నోట్రే డామ్ చర్చి మళ్లీ పునరుజ్జీవనం చెందింది. ఐదేళ్ల క్రితం భారీ అగ్నిప్రమాదంలో పాక్షిక్షంగా ధ్వంసమై కోట్లాది క్రైస్తవ భక్తుల్లో ఆవేదన మిగిల్చిన ఈ చర్చి మళ్లీ ప్రార్థనలకు సిద్ధమైంది. అప్పట్లో దీని పూర్తి నిర్మాణానికి ఏకంగా 200 ఏళ్లు పట్టిందని చెబుతారు. విభిన్నమైన డిజైన్, విశిష్ట నిర్మాణ శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ చర్చికి మళ్లీ ఆ రూపం తేవడం చాలా కష్టమని నిర్మాణ రంగ నిపుణులే పెదవి విరిచారు. అయినా ఫ్రాన్స్ ప్రభుత్వం వెరవకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన చర్చికి ప్రాణప్రతిష్ట చేసింది.
కేవలం ఐదేళ్లలో ఏకంగా రూ.6,350 కోట్ల భారీ వ్యయంతో నాణ్యతో రాజీ పడకుండా అదే స్థాయిలో పునరుద్ధరించింది. శనివారం చర్చి పునఃప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, బ్రిటన్ యువరాజు విలియంసహా దాదాపు 50 దేశాలకు చెందిన అధి పతులు, రాజులు, సెలబ్రిటీలు, వివిధ దేశాల నుంచి 170 మంది బిషప్‌లు, ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. రికార్డు సమయంలో చర్చిని అందుబాటులోకి తేవడంలో కార్మికుల అంకితభావం దాగుందని మేక్రాన్ జాతి నుద్దేశించి ప్రసంగంలో చెప్పారు. కోర్సియా పర్యటనలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన లేదు.
2,000 మంది నిపుణులతో..
2019 ఏప్రిల్ 15న ఘోర అగ్నిప్రమాదంలో చర్చి పై కప్పు, శిఖరం, అంతర్గత దారు నిర్మాణాలన్నీ కాలి బూడిదయ్యాయి. షాట్ సర్క్యూటో, కాల్చేసిన సిగరెట్ పీకో ఇందుకు కారణమంటారు. చర్చి పునఃనిర్మాణ వ్యయాన్ని భరిస్తామంటూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ముందుకొచ్చారు. వేలాది కోట్ల విరాళాలిచ్చారు. చర్చి నిర్మాణ ఖర్చంతా ఇలా సమకూరిందే! పునర్నిర్మాణ క్రతువులో ఏకంగా 2,000 మంది నిపుణులు భాగస్వాములయ్యారు. అత్యంత నాణ్యమైన కలపను ఇచ్చే 2,000 ఓక్ చెట్ల నుంచి సేకరించిన కలపను ఈ నిర్మాణంలో వాడారు.
భారీ సంగీత విభావరితో..
చర్చి ప్రారంభోత్సవంలో భాగంగా ప్రముఖ సంగీతకళాకారులతో భారీ సంగీత విభావరి నిర్వహించారు. ఒపెరా గాయకులు ప్రెటీ యేండీ, జూలీ ఫచ్, పియానిస్ట్ లాంగ్ లాంగ్ తదితరుల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. పారిస్‌లోని సీన్ నదీ తీరం వెంట ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ తెరల్లో కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంచేశారు. ప్రత్యక్షంగా 40,000 మంది, పరోక్షంగా కోట్లాది మంది వాటిని వీక్షించనున్నారు. ఆరుబయట కార్యక్రమం నిర్వహిద్దామనుకున్నా భారీ ఈదురుగాలుల వల్ల లోనికి మార్చారు. ఆదివారం నుంచి చర్చిలో ప్రార్థనలను అనుమతిస్తారు.
సామ్యవాదంతో సంబంధం
మతసంబంధ ప్రదేశంగా మాత్రమే గాక ఫ్రాన్స్ రాజకీయాలతోనూ నోట్రేడామ్ చర్చి ముడిపడి ఉంది. ఫ్రెంచ్ విప్లవానికి, రెండు ప్రపంచయుద్ధాలకు ఇది సజీవ సాక్షి. 1302లో రాజు నాలుగో ఫిలిప్ ఎస్టేట్ చట్టాన్ని ఈ చర్చిలోనే చర్చించి ఖరారు చేశారు. పన్నులు, రాజ్య పరిపాలనపై ఇక్కడే నిర్ణయాలు జరిగాయి. రోడ్లన్నీ రోమ్‌కే దారి తీస్తాయి (ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్) అనే సామెతకూ ఈ చర్చే మూలం. రోమన్ సామ్రాజ్యంలో రోడ్లన్నీ ఈ చర్చి సమీపంగా వెళ్లాలని చక్రవర్తి అగస్టస్ ఆదేశించారు.
ప్రత్యేకతలెన్నో..
→ పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లో నోట్రేడామ్ చర్చి ఒకటి.
→ ఫ్రాన్స్ చరిత్ర, సాంస్కృతిక వైభవంలో ఈ చర్చిది కీలక పాత్ర.
→ దీన్ని ఏటా ఏకంగా 1.3 కోట్ల మంది విదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు.
→ ఈఫిల్ టవర్ కంటే ఈ చర్చిని చూడ్డానికి పారిస్‌లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువ.
→ సీన్ నదిలో అత్యంత చిన్న ద్వీపమైన ‘ ది లే డీ లా సిట్’లో ఈ అద్భుత చర్చి నిర్మాణాన్ని నాటి బిషప్ మారీస్ డి సలీ ఆదేశాల మేరకు 1163లో పూర్తి చేశారు.
→ 64 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ చర్చి 12వ శతాబ్దం దాకా యూరప్ ఖండంలో అతి పెద్ద మానవ నిర్మాణం.
→ మేరోవియన్, కారోవియన్, రోమన్ల, గోథిక్ నిర్మాణ శైలిలో దీనిని కట్టారు.
→ మన తల కంటే ముంజేయి పొడవు సరిగ్గా 1.61803399 రెట్లు పెద్దగా ఉంటుందని గణిత సూత్రం. దీన్నే గోల్డెన్ రేషియో అంటారు.
→ చర్చి నిర్మాణంలో ఈ గణిత సూత్రాన్ని అణువణువునా వాడారు. చర్చిలో అంతర్నిర్మాణాల మధ్య కూడా ఇవే కొలతలను పాటించడంతో ఏ వైపు నుంచి చూసినా చర్చి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment