పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ.. ఆకస్మిక ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అతిత్వరలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారాయన.
యూరోపియన్ యూనియన్(EU) పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీ భారీ ఓటమి చవిచూస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. జూన్ 30న తొలి విడత, రెండో విడత ఎన్నికలు జూలై 7న జరగనున్నాయని మేక్రాన్ ప్రకటించారు.
అయితే.. ఈయూ ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీ 31.5 శాతం ఓట్లు, మాక్రేన్ రెనాయిసెన్స్ పార్టీకి 15.2 శాతం ఓట్లు.. పైగా సగం ఓట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అలాగే.. సోషలిస్ట్ పార్టీ 14.3 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలుస్తుందని పోల్ సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆయన పార్లమెంట్ రద్దును ప్రకటించి.. ఆ వెంటనే ఆకస్మిక ఎన్నికల ప్రకటన చేశారు.
‘రైట్ పార్టీలు పలు చోట్ల పుంజుకుంటున్నాయి. అయితే నేను రాజీనామా చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ రాత్రి(ఆదివారం)కే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నా. ఈ నిర్ణయం చాలా పెద్దది. ఫ్రాన్స్ ప్రజలపై ఉన్న నమ్మకంతో, భవిష్యత్తు తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మేక్రాన్ అన్నారు.
ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 577 మంది దిగువ సభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. వాస్తవానికి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు 2027లో జరగాల్సి ఉంది.
ఇక.. ఈయూ ఎన్నికలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నిక విధానం. 720 మంది ప్రతినిధులు ఉండే యూరోపియన్ పార్లమెంట్‌ను ఎన్నుకునేందుకు 40 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాలు.. యూరోపియన్ యూనియన్ నిర్ణయాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే.. వాతావరణ మార్పులు, రక్షణ, వలసలు, అంతర్జాతీయ దౌత్యం లాంటి అంశాలు.. అదీ చైనా, అమెరికా లాంటి దేశాల దౌత్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment