ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియేల్ అటల్ నియమితులయ్యారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తమ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి గాబ్రియేల్ అటల్(35)ను తన కొత్త ప్రధానిగా నియమించారు. యుద్ధానంతర ఫ్రాన్స్‌కు గాబ్రియేల్ అటల్ అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు.
గాబ్రియేల్ అటల్‌కు ముందు లారెంట్ ఫాబియస్ తన 37 ఏళ్ల వయస్సులో అతి పిన్నవయసు ప్రధాని అయ్యారు. 1984లో ఫ్రాంకోయిస్ మిత్రాండ్ ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు. తాజాగా ఎలిజబెత్ బోర్న్ స్థానంలో గాబ్రియెల్ నియమితులయ్యారు. గాబ్రియేల్ అటల్ బహిరంగంగా తాను స్వలింగ సంపర్కుడినని (గే) ప్రకటించుకున్నారు.
గాబ్రియేల్ అటల్ 2018లో మాక్రాన్ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా ఉన్నప్పుడు చర్చల్లో నిలిచారు. ఆ సమయంలో అటల్.. మాక్రాన్ మాజీ రాజకీయ సలహాదారు స్టెఫాన్ సెజోర్న్‌తో సంబంధం ఏర్పరుచుకున్నారు. గాబ్రియేల్ అటల్ మాజీ క్లాస్‌మేట్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కరోనా మహమ్మారి సమయంలో గాబ్రియేల్ అటల్ ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పనిచేశారు. అప్పటి నుండి ఫ్రెంచ్ రాజకీయాల్లో కీలకనేతగా మారారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు అటల్ ఆయనకు సలహాదారునిగా ఉన్నారు. అలాగే ఐదేళ్లపాటు ఆరోగ్య మంత్రికి సలహాదారుగానూ పనిచేశారు. దశాబ్ద కాలంలోనే ఫ్రాన్స్ ప్రధానమంత్రి పదవిని అందిపుచ్చుకున్నారు. అటల్ 2027 జూన్ 18న ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు
అటల్ 1989 మార్చి 16న పారిస్ సమీపంలోని క్లామార్ట్‌లో జన్మించారు. అటల్ ట్యునీషియా యూదు న్యాయవాది, చిత్రనిర్మాత వైవ్స్ అటల్ కుమారుడు. అటల్ తండ్రి 2015లో కన్నుమూశారు. అటల్ తన ముగ్గురు చెల్లెళ్లతోపాటు పారిస్‌లో పెరిగారు. అతని తల్లి మేరీ డి కోర్రిస్ ఒక చిత్ర నిర్మాణ సంస్థలో పనిచేశారు.
అటల్ పారిస్‌లోని ఎకోల్ అల్సాసిన్ పాఠశాలలో చదువుకున్నారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాక, ప్రతిష్టాత్మక సైన్సెస్ పో విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అనంతరం పబ్లిక్ అఫైర్స్‌లో పీజీ పట్టా పొందారు. అటల్ రాజకీయ జీవితం 2006లో సోషలిస్టు పార్టీలో చేరడంతో ప్రారంభమయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment