ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కులను లాక్కున్న బీజేపీ నుంచి ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఆశించడం మూర్ఖత్వమని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. అయితే బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై తమ పార్టీ వైఖరి మారబోదన్నారు. ఆర్టికల్ 370పై మాట్లాడబోమని కానీ, అదిప్పుడు సమస్య కాదని తామెప్పుడూ చెప్పలేదని అబ్దుల్లా స్పష్టం చేశారు.
భవిష్యత్‌లో దేశంలో ప్రభుత్వం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఒమర్... అప్పుడు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించే కొత్త వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తున్నామన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేస్తుందని తెలిపారు. ఢిల్లీ తరహాలో కాకుండా జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం సజావుగా నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీకి జమ్మూకశ్మీర్‌కు చాలా తేడా ఉందని, 2019కు ముందు జమ్మూకశ్మీర్ ఒక రాష్ట్రమని గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్‌లో మూడు చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రధాని, హోంమంత్రి, సీనియర్ మంత్రులు చెప్పారని, డీలిమిటేషన్, ఎన్నికలు జరిగాయని, రాష్ట్ర హోదా మాత్రమే మిగిలి ఉందని, దానిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ఘర్షణ పడటం వల్ల సమస్యలను పరిష్కరించలేమన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్సీ గురువారం శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని అబ్దుల్లా చెప్పారు. ఆ తర్వాత కూటమి సమావేశంలో నాయకుడిని ఎన్నుకుంటారని, ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కును కోరుతామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో పీడీపీ భాగస్వామ్యం అవుతుందా అన్న ప్రశ్నకు ఎన్సీ నేత సమాధానమిస్తూ ప్రస్తుతానికి దానిపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.
హిందువుల్లో విశ్వాసాన్నిపెంచుతాం: ఫరూక్
జమ్మూకశ్మీర్ మధ్య బీజేపీ సృష్టించిన విభేదాలను తగ్గించి, హిందువుల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రెండు ప్రాంతాల మధ్య భేదం చూపబోమని తెలిపారు. కొత్త ప్రభుత్వం ముందు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అతిపెద్ద సవాళ్లున్నాయన్నారు. యువతకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది కూటమి నిర్ణయిస్తుందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించడంపై ఫరూక్ స్పందిస్తూ.. తాను నిర్ణయించిందే జరుగుతుందని స్పష్టం చేశారు. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అభ్యర్థని ఫరూక్ అబ్దుల్లా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment