ప్రీమియాన్ని బీమా సంస్థలకు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలు తీసుకునే రైతుల నుంచి బీమా ప్రీమియం సొమ్మును మినహాయించుకుని పెద్ద మొత్తంలో తమ వద్దే దాచిపెట్టుకున్న బ్యాంకులు తక్షణమే ఆ సొమ్మును బీమా కంపెనీలకు చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ఆదేశించింది. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, బీమా కంపెనీలతో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రైతులు రుణాలు తీసుకునే సమయంలో పంటల బీమా ప్రీమియాన్ని మినహాయించుకుని బ్యాంకులు రుణాలు ఇస్తాయి.
ఆ సొమ్మును జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ)కి చెల్లించాలి. కానీ కొన్నేళ్లుగా పెద్ద మొత్తంలో ప్రీమియం సొమ్మును బ్యాంకులు తమ వద్దే దాచుకుంటున్నాయని సర్కారు నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, జిల్లాల్లో ప్రతీ బ్యాంకు బ్రాంచీలో ఎంత ప్రీమియం సొమ్మును ఈ రకంగా దాచిపెట్టుకున్నారో వెంటనే తెలపాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం.
బ్యాంకుల ద్వారానే చెల్లించాలి...
ఇప్పటివరకు పంట రుణాలు తీసుకునే రైతుల నుంచి ప్రీమియం సొమ్మును బ్యాంకులు మినహాయించి బీమా సంస్థలకు చెల్లిస్తున్నాయి. ఇకనుంచి బ్యాంకు రుణాలు తీసుకోని రైతుల నుంచి బ్యాంకులు ప్రీమియాన్ని వసూలు చేసి బీమా కంపెనీలకు చెల్లించాలని..ఆమేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కొత్త రుణాల ఆలస్యంపై అసంతృప్తి...
ప్రభుత్వం రుణమాఫీ సొమ్మును విడతల వారీగా ఇస్తున్నప్పటికీ బ్యాంకులు మాత్రం అనుకున్న స్థాయిలో రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదని మంత్రి పోచారం అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఈ సారి పంట రుణాల లక్ష్యం రూ. 15 వేల కోట్లు పైగా ఉండగా... ఇప్పటివరకు 35 శాతానికి మించి రుణాలు ఇవ్వలేకపోయాయని మంత్రి పేర్కొన్నారు. తక్షణమే కొత్త రుణాలు ఇవ్వాల్సిందిగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.