Minister Pocharam Srinivasa Reddy
-
యుద్ధప్రాతిపదికన ‘కత్తెర’ నివారణ చర్యలు
సాక్షి, హైదరాబాద్: మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘కత్తెర కాటు’శీర్షికన ఈ నెల 18న ‘సాక్షి’ప్రచురించిన కథనంపై జిల్లా వ్యవసాయాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో మొక్కజొన్నకు కత్తెర పురుగు సోకినట్లు నివేదికలు వచ్చాయన్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి రైతుల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. కిందిస్థాయిలో రైతులను సమన్వయం చేసుకుని కత్తెర పురుగు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. కత్తెర పురుగును మన దేశంలో మొదట కర్ణాటకలో గుర్తించారని, ఇప్పుడు వేగంగా నాలుగు రాష్ట్రాలకు వ్యాపించిందని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పి.పార్థసారథి వివరించారు. మొదట మొక్కజొన్నపై ఆశించినా తదుపరి దశలో ఇతర అన్ని రకాల పంటలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని నివారణకు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల సహకారంతో ఐకార్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి, శాంపిళ్లను సేకరించి బెంగళూరులోని పరిశోధన శాలలకు పంపించినట్లు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ వి.ప్రవీణ్‌రావు తెలిపారు. దీని నివారణకు ఇయోమెట్ బెంజైట్ను లీటరుకు 0.4 గ్రాముల చొప్పున ఎకరాకు 80 గ్రాములను సాయంత్రం వేళలో పిచికారి చేయాలని సూచించారు. వరదల వల్ల పలుచోట్ల నష్టం.. ఇప్పటివరకు రాష్ట్రంలో 26.52 లక్షల మంది రైతులకు చెందిన రైతు బీమా బాండ్ల ముద్రణ, పంపిణీ జరిగిందని మంత్రి పోచారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 135 మంది రైతుల మరణాలు నమోదు కాగా, 110 మంది వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేశారన్నారు. వారిలో 107 మంది రైతుల వివరాలను ఎల్ఐసీకి పంపగా 75 మంది నామినీ ఖాతాల్లోకి బీమా కవరేజీ రూ.5 లక్షల చొప్పున జమ చేసినట్లు తెలిపారు. ఈ నెల చివరి వరకు వరి పంటకు బీమా గడువు ఉందన్నారు. రాష్ట్రంలో వర్షాకాలం సాగు 86 శాతానికి చేరుకుందని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో అధిక వర్షాలతో కొంత పంట నష్టం సంభవించినట్లు తెలిసిందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించి తక్షణమే బీమా కంపెనీలకు సమాచారం పంపించాలన్నారు. -
మొక్క ఎండిందా.. పదవి గోవిందా!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ చట్టం మరింత పదునుగా రూపొందుతోంది. హరితహారానికి రక్షణగా నిలవబోతోంది. హరితహారం మొక్కలు 75 శాతం బతక్కపోతే సర్పంచ్‌ని డిస్మిస్ చేసేలా పంచాయతీరాజ్ చట్టం రాబోతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన జిల్లా వ్యవసాయాధికారుల (డీఏవో)తో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ చట్టంలో అనేక ప్రతిపాదనలు రూపొందిస్తున్నారని పోచారం చెప్పారు. వ్యవసాయాధికారుల సాగు లెక్కలు, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ‘అవును... మేం ఇచ్చిన నివేదికల కంటే క్షేత్రస్థాయిలో ఎక్కువగానే సాగైనట్లుగా ఉంద’ని నిజామాబాద్ అధికారి ఒప్పుకోవడంతో మంత్రి ఇంకాస్త మండిపడ్డారు. తక్కువ సాగు చూపిస్తే ఆహార పంటల ఉత్పత్తులు కూడా అదేస్థాయిలో తక్కువగా నమోదవుతాయని పేర్కొ న్నారు. ఈ రబీలో సాధారణంగా 32 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతాయని చెబుతున్నారని, అది 40 లక్షల ఎకరాలకు మించి ఉంటుందని మంత్రి అంచనా వేశారు. వారం రోజుల్లో కొత్త లెక్కలు నమోదు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో కొత్తగా 851 మంది వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో)లు రాబోతున్నారని, మొత్తం వారి సంఖ్య 2,638 అవుతుందన్నారు. దీర్ఘకాలంగా ఒకేచోట ఉద్యోగం చేస్తున్న ఏఈవోలకు స్థానచలనం చేసి కొత్తవారిని నియమించాలని ఉన్నతాధికారులకు సూచించారు. రుణాలు తీసుకునే రైతులందరి నుంచీ బీమా చేయించాలన్నారు. ట్రాక్టర్ల కోసం నా వద్దకు పంపుతారా? సబ్సిడీ ట్రాక్టర్ల కోసం ఎమ్మెల్యేలను తన వద్దకు డీఏవోలు పంపుతుండటంపై పోచారం ఆగ్రహం వ్యక్తంచేశారు. వారంతా వచ్చి ప్రత్యేక కోటా కింద ట్రాక్టర్లు అడుగుతున్నారని, ఫలితంగా తాను హైదరాబాద్ రావడానికే జంకాల్సి వస్తోందన్నారు. పూర్వ జిల్లాల ప్రకారం ట్రాక్టర్ల మేళా పెడితే బాగుంటుందని, ఒకేచోట ట్రాక్టర్లను పంపిణీ చేయాలన్నారు. ఖమ్మంలో ఒకేసారి వెయ్యి ట్రాక్టర్లు పంచుతున్నామని చెప్పారు. ఈసారి వ్యవసాయశాఖకు ప్రత్యేక బడ్జెట్ పెట్టబోతున్నామని, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ సొమ్ము రూ.5 వేల కోట్లు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ డీఏవోలను మంత్రి సన్మానించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, అడిషనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వాళ్ల వల్లే పేదలకు ఇళ్లు లేవు:మంత్రి
సాక్షి, నిజామాబాద్ : గత పాలకుల విధానాల కారణంగానే పేదలకు సొంతిళ్లు లేవని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. లేని వారి పేరు చెప్పి ఉన్న వాళ్లు ఇళ్లు కట్టుకున్నారని అన్నారు. గత పాలకులు ఇళ్లు కట్టకుండా బిల్లులు కూడా తీసుకున్నారని ఆరోపించారు. అన్ని వసతులతో కూడిన ఇళ్లు పేదలకు ఇవ్వాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తెలిపారు. పేదలకు ఇండ్లు మంజూరు చేస్తున్నా, ఇండ్లు కట్టే వాళ్లు దొరకడం లేదని చెప్పారు. వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు అంటే రాష్ట్రంలోని కోటి ఎకరాలకు ఎనిమిది వేల కోట్లు రైతు పెట్టుబడుల కోసం డబ్బును సర్కార్ ఇవ్వనుందని వివరించారు. వచ్చే ఏడాది నుంచి పుష్కలంగా సాగునీరు కూడా వస్తుందన్నారు. టీఆర్ఎస్ పరిపాలన దేశానికే దిక్సూచి అని చెప్పారు. -
నేడు జిల్లాకు మంత్రి ‘పోచారం’
ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటన అశోక్‌నగర్‌లో మిర్చి పరిశోధన కేంద్రం స్థల పరిశీలన హన్మకొండ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట మండలాల్లో ఏకధాటిగా ఉదయం నుంచి రాత్రి వరకు క్షేత్రస్థాయి పరిశీలనలు, సమీక్షలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు దుగ్గొండి మండలం గొల్లపల్లి గ్రామంలో సేంద్రియ పద్ధతిలో నిర్వహిస్తున్న ఆదర్శ రైతు తోట మల్లికార్జున గుప్తకు చెందిన 130 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం చెన్నారావుపేట మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అక్కడ బహిరంగ సభ నిర్వహించి, లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, హిటాచీ యంత్రాన్ని అందజేయనున్నారు. తర్వాత ఖానాపురం మండలంలోని అత్యంత కీలమైన పాకాల సరస్సును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పాకాల సమీపంలోని గిరక తాటిచెట్లను మంత్రి పరిశీలించనున్నారు. అనంతరం నర్సంపేటలోని ఓ ఫంక్షన్హాల్లో పీఏసీఎస్ సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తర్వాత వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మిర్చి పరిశోధన కేంద్రం స్థల పరిశీలన.. ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ వద్ద ఏర్పాటు చేయనున్న మిర్చి పరిశోధన కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని మంత్రి పోచారం పరిశీలించనున్నారు. మిర్చి పరిశోధన కేంద్రం కోసం ఇప్పటికే అశోక్‌నగర్‌లో 90 ఎకరాల స్థలం కేటాయించారు. ఇందుకు సంబంధించి డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపాలని కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాగా, ఈ భూమి అటవీశాఖ ఆధీనంలో ఉండడంతో ఇందుకు సంబంధించి మంత్రి అన్ని వివరాలు సేకరించనున్నారు. మంత్రి పోచారం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. -
ప్రీమియాన్ని బీమా సంస్థలకు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలు తీసుకునే రైతుల నుంచి బీమా ప్రీమియం సొమ్మును మినహాయించుకుని పెద్ద మొత్తంలో తమ వద్దే దాచిపెట్టుకున్న బ్యాంకులు తక్షణమే ఆ సొమ్మును బీమా కంపెనీలకు చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ఆదేశించింది. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, బీమా కంపెనీలతో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రైతులు రుణాలు తీసుకునే సమయంలో పంటల బీమా ప్రీమియాన్ని మినహాయించుకుని బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఆ సొమ్మును జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ)కి చెల్లించాలి. కానీ కొన్నేళ్లుగా పెద్ద మొత్తంలో ప్రీమియం సొమ్మును బ్యాంకులు తమ వద్దే దాచుకుంటున్నాయని సర్కారు నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, జిల్లాల్లో ప్రతీ బ్యాంకు బ్రాంచీలో ఎంత ప్రీమియం సొమ్మును ఈ రకంగా దాచిపెట్టుకున్నారో వెంటనే తెలపాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. బ్యాంకుల ద్వారానే చెల్లించాలి... ఇప్పటివరకు పంట రుణాలు తీసుకునే రైతుల నుంచి ప్రీమియం సొమ్మును బ్యాంకులు మినహాయించి బీమా సంస్థలకు చెల్లిస్తున్నాయి. ఇకనుంచి బ్యాంకు రుణాలు తీసుకోని రైతుల నుంచి బ్యాంకులు ప్రీమియాన్ని వసూలు చేసి బీమా కంపెనీలకు చెల్లించాలని..ఆమేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్త రుణాల ఆలస్యంపై అసంతృప్తి... ప్రభుత్వం రుణమాఫీ సొమ్మును విడతల వారీగా ఇస్తున్నప్పటికీ బ్యాంకులు మాత్రం అనుకున్న స్థాయిలో రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదని మంత్రి పోచారం అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఈ సారి పంట రుణాల లక్ష్యం రూ. 15 వేల కోట్లు పైగా ఉండగా... ఇప్పటివరకు 35 శాతానికి మించి రుణాలు ఇవ్వలేకపోయాయని మంత్రి పేర్కొన్నారు. తక్షణమే కొత్త రుణాలు ఇవ్వాల్సిందిగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.