సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ చట్టం మరింత పదునుగా రూపొందుతోంది. హరితహారానికి రక్షణగా నిలవబోతోంది. హరితహారం మొక్కలు 75 శాతం బతక్కపోతే సర్పంచ్‌ని డిస్మిస్ చేసేలా పంచాయతీరాజ్ చట్టం రాబోతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన జిల్లా వ్యవసాయాధికారుల (డీఏవో)తో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ చట్టంలో అనేక ప్రతిపాదనలు రూపొందిస్తున్నారని పోచారం చెప్పారు.
వ్యవసాయాధికారుల సాగు లెక్కలు, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ‘అవును... మేం ఇచ్చిన నివేదికల కంటే క్షేత్రస్థాయిలో ఎక్కువగానే సాగైనట్లుగా ఉంద’ని నిజామాబాద్ అధికారి ఒప్పుకోవడంతో మంత్రి ఇంకాస్త మండిపడ్డారు. తక్కువ సాగు చూపిస్తే ఆహార పంటల ఉత్పత్తులు కూడా అదేస్థాయిలో తక్కువగా నమోదవుతాయని పేర్కొ న్నారు. ఈ రబీలో సాధారణంగా 32 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతాయని చెబుతున్నారని, అది 40 లక్షల ఎకరాలకు మించి ఉంటుందని మంత్రి అంచనా వేశారు. వారం రోజుల్లో కొత్త లెక్కలు నమోదు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో కొత్తగా 851 మంది వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో)లు రాబోతున్నారని, మొత్తం వారి సంఖ్య 2,638 అవుతుందన్నారు. దీర్ఘకాలంగా ఒకేచోట ఉద్యోగం చేస్తున్న ఏఈవోలకు స్థానచలనం చేసి కొత్తవారిని నియమించాలని ఉన్నతాధికారులకు సూచించారు. రుణాలు తీసుకునే రైతులందరి నుంచీ బీమా చేయించాలన్నారు.
ట్రాక్టర్ల కోసం నా వద్దకు పంపుతారా?
సబ్సిడీ ట్రాక్టర్ల కోసం ఎమ్మెల్యేలను తన వద్దకు డీఏవోలు పంపుతుండటంపై పోచారం ఆగ్రహం వ్యక్తంచేశారు. వారంతా వచ్చి ప్రత్యేక కోటా కింద ట్రాక్టర్లు అడుగుతున్నారని, ఫలితంగా తాను హైదరాబాద్ రావడానికే జంకాల్సి వస్తోందన్నారు. పూర్వ జిల్లాల ప్రకారం ట్రాక్టర్ల మేళా పెడితే బాగుంటుందని, ఒకేచోట ట్రాక్టర్లను పంపిణీ చేయాలన్నారు. ఖమ్మంలో ఒకేసారి వెయ్యి ట్రాక్టర్లు పంచుతున్నామని చెప్పారు. ఈసారి వ్యవసాయశాఖకు ప్రత్యేక బడ్జెట్ పెట్టబోతున్నామని, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ సొమ్ము రూ.5 వేల కోట్లు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ డీఏవోలను మంత్రి సన్మానించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ డాక్టర్ జగన్‌మోహన్, అడిషనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మొక్క ఎండిందా.. పదవి గోవిందా!
Published Sun, Jan 28 2018 3:46 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment