సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లకు అతి తక్కువ ప్రీమియంతో బీమా సదుపాయం కల్పించేందుకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకు వచ్చింది. ఉత్సవాల సమయంలో ఉగ్రవాద సంస్థలు ఏ రూపంలోనైనా దాడులు చేసే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో మండపాలకు, అక్కడ విధులు నిర్వహించే కార్యకర్తలు, దర్శనానికి వచ్చే భక్తులకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఉట్టి ఉత్సవాల సమయంలో ఇదివరకే ఈ ఇన్సూరెన్స్ క ంపెనీ సార్వజనిక గోవిందా బృందాలకు అతి తక్కువ ప్రీమియంతో బీమా సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో గణేశ్ ఉత్సవాల సమయంలో సార్వజనిక మండళ్లకు బీమా కల్పించాలని బృహత్తర నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంపై నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రూ.50, రూ.100ల ప్రీమియంతో కార్యకర్తలకు రూ.50వేల నుంచి రూ.లక్షా వరకు ప్రమాద బీమా వర్తిస్తుందని ఇన్సూరెన్స్ కంపెనీ పరిపాలన విభాగం అధికారి సచిన్ ఖాన్విల్కర్ తెలిపారు చెప్పారు. ‘ఉత్సవాల సమయంలో విద్యుత్ తోరణాలు, ప్లడ్ లైట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. దీంతో విద్యుద్ఘాతం జరిగి ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ఆస్కారముంటుంది. దీంతో మండళ్లకు బీమా సౌకర్య కల్పించి అండగా నిలవాల’ని నిర్ణయించామని తెలిపారు. ఈ అవకాశాన్ని ముంబైతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే ఈ బీమా సౌకర్యం కేవలం రిజిస్ట్రేషన్ మండళ్లకు మాత్రమే వర్తిస్తుందన్నారు.
ప్రధాన ప్రవేశ ద్వారం నుంచి మొదలుకుని గణేశ్ మండపం పరిధి వరకు, సెప్టెంబర్ తొమ్మిదో తేదీ నుంచి ఉత్సవాలు ముగిసేవరకు వర్తిస్తుందన్నారు. ఏదైన ప్రమాదం జరిగి బీమా పాలసీ డబ్బులు పొందాలంటే స్థానిక పోలీసు స్టేషన్‌లో కచ్చితంగా కేసు నమోదై ఉండాలని ఇన్సూరెన్స్ కంపెనీ జనరల్ మేనేజర్ ఆసావరి దేశాయి చెప్పారు. బాంబు పేలుళ్లు, ఉగ్రవాదుల దాడులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనం, దోపిడీలు, తొక్కిసలాటలతో పాటు భూకంపం, ఈదురు గాలులు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు, గణేశ్ విగ్రహంపై అలంకరించిన ఖరీదైన నగలు, భక్తులు సమర్పించుకున్న కానుకలు, హుండీలో నగదు, మండపం నుంచి బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్లే డబ్బులు తదితర రిస్కు పనులన్నింటికి కూడా ఈ బీమా వర్తిస్తుందన్నారు.
గణేశ్ మండళ్లకూ ఇన్సూరెన్స్
Published Wed, Aug 28 2013 1:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement