‘గోవాడ’లో గోల్‌మాల్?
చోడవరం : గోవాడ చక్కెర మిల్లులో తడిసిన పంచదార అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి కాసులు కురిపించినట్టు చెప్పుకుంటున్నారు. సుమారు రూ.8కోట్లు మేర అవినీతి జరిగిందన్న వాదన వ్యక్తమవుతోంది. ఈ కర్మాగారం గతేడాది వరకు లాభాల బాటలో పయనించింది. పాలకవర్గం నిర్లక్ష్యంతో గతేడాది ప్రారంభంలో క్వింటా రూ.2900 ధర ఉన్నప్పుడు పంచదార అమ్మకుండా గోడౌన్లలో నిల్వ ఉంచేశారు. సుమారు 5.2లక్షల క్వింటాళ్ల పంచదారను వడ్లపూడి, కశింకోటల్లోని ప్రైవేటు గోడౌన్లతోపాటు ఫ్యాక్టరీ గోడౌన్లలో నిల్వ చేశారు. ఇంతలో హుద్‌హుద్ ధాటికి గోడౌన్ల పైకప్పులు గతేడాది ఎగిరిపోయాయి.
సుమారు 2.61లక్షల క్వింటాళ్ల పంచదార తడిసిపోయింది.దీనివల్ల రూ.80కోట్లు వరకు నష్టం వచ్చిందని పాలకవర్గం, యాజమాన్యం అప్పట్లో గగ్గోలుపెట్టాయి. ఈ నేపథ్యంలో తడిసిన పంచదార అమ్మకం,బీమా పరిహారం పొందడంలో కొంత హైడ్రామా సాగినట్టు తెలిసింది. నష్టాల బూచిని చూపి పాలకవర్గం, యాజమాన్యం కుమ్మక్కయి రూ.కోట్లు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఫ్యాక్టరీకి చెందిన ఓ అధికారి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని తెలిసింది. కశింకోట సీడబ్ల్యూసీ గోడౌన్లలోని 1.19లక్షల క్వింటాళ్ల అమ్మకాల్లో గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నా యి.
ఈ పంచదారకు యాజమాన్యం ఓరియంటల్ ఇన్సూరెన్సు కంపెనీకి పూర్తిగా ప్రీమియం చెల్లించకపోవడం, తర్వాత ఏదోలా పూర్తిసరకుకు బీమా వర్తించేలా తంటాలు పడినట్టు చెప్పుకుంటున్నారు. తడిసిన పంచదారను పరిశీలించేందుకు బీమా కంపెనీ అధికారులు రావడం, బస్తాలన్నింటినీ టెండరు ద్వారా అమ్మేసి, మిగతాది ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరకు జోడించి నష్టపరిహారం ఇస్తామని వారు చెప్పడం జరిగింది. దీంతో ఫ్యాక్టరీకి గోనెలు సరఫరా చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌మింట్ ఇండియా అగ్రిటెక్‌ప్రైవేటు పేరున ఈ వ్యవహారంలో కీలక పాత్రపోషిస్తున్న అధికారే బీమా టెండరు వేసి తర్వాత క్వింటా రూ.1070కి కోడ్ చేసి, టెండరును దక్కించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం బయటకు పొక్కడంతో ఎకాయెకిన యా జమాన్యం, పాలకవర్గంలో మెజార్టీ సభ్యులు ఏకమై మధ్యంతరంగా తీర్మానించి పంచదారను వివిధ ధరలకు బహిరంగమార్కెట్లో విక్రయించినట్టు తెలిసింది. ఈక్రమంలో సుమారు రూ.8కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ పేరున వేసిన టెండరు మేరకు సరకు అప్పగించాలని సంబంధిత కంపెనీ యజమాని ఇన్సూరెన్సు సంస్ధకు కోర్టు నోటీసులు కూడా పంపినట్టు తెలిసింది. కాగా అక్రమాల విషయం ఎక్కడ బయటపడుతుందోనని బీమా పరిహా రం రూ.4కోట్లు వద్దంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు ఇందులో కీలకపాత్రవహిస్తున్న వారు నానా తంటాలు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.