నిబంధనల వ్యథ.. చంద్రన్న బీమా కథ!
⇒ నమోదైన లబ్ధిదారులు 16.57 లక్షలు
⇒ బీమా చెల్లించాల్సింది 3,004 మందికి
⇒ ఇప్పటి వరకు చెల్లించింది 2084 కుటుంబాలకు..
పల్స్ సర్వేలో వివరాలు సక్రమంగా లేకపోవటంతో ఇక్కట్లు
బందరు మండలం చిరివెళ్లపాలెంలో ఓ యువకుడు ట్రాక్టర్ ఢీకొని గత ఏడాది నవంబరులో మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబానికి చంద్రన్న బీమా నేటికీ అందలేదు. ఈ ఒక్క సంఘటనే కాదు.. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ పరిస్థితి లబ్ధిదారులను వేదన పెడుతోంది. చంద్రన్న బీమా పథకంలో నిబంధనల మోత నిరుపేదల మతిపోగొడుతోంది. ఒక్కోసారి ఒక్కో రకం రూల్ అని చెబుతూ బాధితులతో ఆటలాడుకుంటున్నారు. పాలకులు పట్టనట్టు వ్యవహరిస్తుండడం లబ్ధిదారులకు శాపంగా మారింది.
మచిలీపట్నం : అసంఘటిత రంగంలో పనిచేసే బాధిత కార్మికులకు చంద్రన్న బీమా సకాలంలో అందక ఆవేదన పెడుతోంది. ప్రభుత్వం రకరకాల నిబంధనలు విధిస్తుండటంతో బీమా సొమ్ము కోసం నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. 2016 అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ పథకం రాష్ట్రంలో ప్రారంభమైంది. జిల్లాలో ఇప్పటి వరకు 16.57 లక్షల మంది ఈ బీమా పథకంలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటి వరకు 3,004 మంది వివిధ కారణాలతో మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2,084 మందికి బీమా సొమ్మును చెల్లించినట్లు వెలుగు ప్రాజెక్టు అధికారులు వెల్లడిస్తున్నారు.
వీటిలో 139 ప్రమాదం కారణంగా మరణించిన కేసులు, సహజ మరణాలు 1943, పాక్షికంగా వికలాంగులైన వారు ఇద్దరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదవశాత్తు మరణించిన వారికి బీమా సొమ్ము అందించటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆధార్‌కార్డు ఆన్‌లైన్ కాకపోవటం, రేషన్‌కార్డులో తప్పులు దొర్లటం, ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాసాధికార సర్వే వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడం, పల్స్ సర్వే ఇంకా పూర్తికాకపోవటం తదితర కారణాలతో మృతుల కుటుంబ సభ్యులకు బీమా సొమ్ము సకాలంలో చేతికి అందని పరిస్థితి నెలకొంది.
రెండు బీమా కంపెనీల ద్వారా నగదు చెల్లింపులు..
డ్వాక్రా సంఘాలు, కార్మిక సంఘాలతో పాటు ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పల్స్ సర్వే సమయంలోనూ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల నుంచి చంద్రన్న బీమా ప్రీమియంగా రూ.15 వసూలు చేశారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి ఆమ్ ఆద్మీ బీమా యోజన (ఏఏబీవై) ద్వారా సహజ మరణం పొందితే రూ.30 వేలు, ప్రమాదంలో మరణించినా, పూర్తి అంగవైకల్యానికి గురైనా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంది. పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ.3,62,500 ఇవ్వాలి. మృతుని కుటుంబ సభ్యుల్లో చదువుకునే పిల్లలు ఉంటే ఇద్దరికి ఏడాదికి రూ.1200 స్కాలర్‌షిప్ అందించాల్సి ఉంది.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) ద్వారా 60 నుంచి 70 ఏళ్ల వయసుఉన్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.4.25 లక్షలు, పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ.3.25 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులకు లైఫ్ ఇన్సూరె న్స్ కార్పొరేషన్ ద్వారా రూ.75 వేలు ముందస్తుగా చెల్లించటంలో ఇబ్బంది ఉండటం లేదు. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రూ.4.25 లక్షలు చెల్లించే సమయంలోనే నిబంధనలతో జాప్యం జరుగుతోందని వెలుగు అధికారులు చెబుతున్నారు. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు సంబంధిత కుటుంబం వద్దకు వెళ్లి వివరాలను నమోదు చేసుకున్న తరువాతే ఈ మొత్తాన్ని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.