సంక్షేమ నిధి స్వాహా
సంక్షేమ నిధి స్వాహా
Published Sat, Nov 19 2016 11:41 PM | Last Updated on Sat, Jul 28 2018 5:42 PM
-కార్మికుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం
-దారిమళ్లిన రూ.250 కోట్ల సంక్షేమ నిధి
- చంద్రన్న బీమాలో విలీనానికి యత్నాలు
-ప్రభుత్వ రంగ సంస్థల బకాయి రూ.150 కోట్లు
ఆకివీడు : తాజ్‌మహల్‌కు రాళ్లెత్తింది ఎవరో తెలియదు కానీ దాని నిర్మాణం వెనుక కార్మికుల శ్రమ ఎంతో దాగి ఉంది. అటువంటి కార్మికుల శ్రమనూ ప్రభుత్వం దోచుకుంటోంది. కార్మిక సంక్షేమ నిధిలో నిల్వ ఉన్న రూ.1,300 కోట్లు శ్రామికుడి శ్రేయస్సు కోసం ఉపయోగపడటంలేదు. ఆరుగాలం కష్టించి పనిచేసిన కార్మికుడు ప్రమాదవశాత్తూ చనిపోతే అతనికి అందాల్సిన బీమా సొమ్ము సకాలంలో అందడంలేదు. కోట్లకు కోట్లు పేరుకుపోతున్న సంక్షేమ నిధిని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధిని వినియోగించకుండా ఇతర అవసరాలకు తరలిస్తుంది. ఇటీవల రాష్ట్రంలో వివిధ అవసరాల నిమిత్తం రూ.250 కోట్లు బదలాయించారు. వేసవిలో మజ్జిగ సఫరాకూ కార్మిక సంక్షేమ నిధినే ప్రభుత్వం వినియోగించింది.
చట్టానికి తూట్లు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టానికి తూట్లు పొడుస్తోంది. సంక్షేమ బోర్డును చంద్రన్న బీమా పథకంలోకి విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని భవన నిర్మాణ కార్మిక సంఘం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కార్మికులకు బీమాగా చెల్లించే నిధి రూ.80 వేలను రూ.30 వేలకు కుందించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సంక్షేమ నిధిని పెంచుతూ జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మెమో విడుదల చేసిందని కార్మిక సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1.72 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు
జిల్లాలో 1.72 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులున్నారు. వీరిలో అధిక శాతం చదువుకున్న నిరుద్యోగులే ఉన్నారు. దీనిలో 85 లక్షల మంది మహిళా కార్మికులున్నారు. కూలి ధర సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో భవన నిర్మాణ పనులు తగ్గిపోవడంతో పని దినాలు తగ్గాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధరల పెరుగుదల, రద్దు నోట్ల ప్రభావం
భవన నిర్మాణ ముడి సరుకుల ధరలు పెరగడం, పెద్ద నోట్ల రద్దు ప్రభావం నిర్మాణ రంగంపై పడింది. దీంతో కార్మికులకు పనులు తగ్గిపోయాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇసుక అమ్మకాలపై ఆంక్షలు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇటీవల ఇసుకపై ఆంక్షలు ఎత్తివేసినా ఇసుక మాఫియాతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
ప్రభుత్వ బకాయి రూ.150 కోట్లు
సంక్షేమ నిధికి ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించాల్సిన బకాయి రూ.150 కోట్లు పైబడే ఉంది. వివిధ కట్టడాలు, వంతెనలు, సీసీ రోడ్లు, ఆనకట్టలు, ప్రభుత్వ భవనాలు వంటి వాటి నుంచి ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఈ పన్నును చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి.
కార్మికుల చెంతకు చేరని క్లైయిమ్‌లు
నిర్మాణ సమయంలో కార్మికులు ప్రమాదవశాత్తూ మరణించినా, గాయపడినా వాటికి క్లైయిమ్‌లు చెల్లించాల్సి ఉంది. దీనికోసం కార్మికుల బంధువులు లేబర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో 16 మంది సహాయ కార్మికశాఖ అధికారులున్నప్పటికీ ఆయా గ్రామాల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన రికార్డులు పూర్తి చేయడానికి ఘటనా స్థలాలకు వెళ్లడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్‌కు కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు.
ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధిని చంద్రన్న బీమాలోకి విలీనం చేయాలనే యోచనపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. త్వరలోనే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని రాష్ట్ర సంఘం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది.
కేంద్ర పథకానికి రాష్ట్రం తూట్లు
కేంద్ర పభుత్వం అమలు జరిపే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఈ పథకాన్ని చంద్రన్న బీమాలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కార్మిక సంక్షేమ నిధిని ఇతర అవçసరాలకు తరలించడం దారుణం. ప్రమాద బీమా రూ.5 లక్షలు ఉండగా దానిని తగ్గించేందుకు మెమో జరీ చేయడం విడ్డూరంగా ఉంది.
నారపల్లి రమణారావు, జిల్లా కార్యదర్శి, భవన నిర్మాణ కార్మిక సంఘం
రూ.2.50 కోట్లు చెల్లించాం
భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదం ఎక్కడ జరిగితే అక్కడకు వెళ్లి తమ ఏఎల్‌ఓలు క్లయిమ్‌లు రాస్తారు. రెన్యూవల్స్ కూడా చేస్తారు. జిల్లాలో ఇప్పటి వరకూ సుమారు 1150 మంది కార్మికులకు రూ.2.50 కోట్లు సంక్షేమ నిధులు చెల్లించాం. భవన నిర్మాణ కార్మికులు తమ సభ్యత్వాలను ప్రతి రెండేళ్లకొకసారి రెన్యూవల్ చేయించుకోవాలి. రెండేళ్లు పూర్తయిన తరువాత రెన్యూవల్ చేయించుకోకపోతే సభ్యత్వం రద్దవుతుంది.
ఎన్.రామారావు, జిల్లా కార్మిక శాఖాధికారి, ఏలూరు
Advertisement
Advertisement