–నేటి నుండి చంద్రన్న భీమా
–జిల్లాలో 12లక్షల 30వేల మంది లబ్ధిదారుల
–గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభం
–లాంఛనంగా నేడు బాండ్ల పంపిణీ
–ఏలూరు (మెట్రో)
అసంఘటిత రంగ కార్మికుల జీవితాలకు భద్రత కల్పించేందుకు ఉద్ధేశించిన చంద్రన్న భీమా గాంధీ జయంతి సందర్భంగా నేటి నుండి ప్రారంభం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజధానిలో దీన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలోనూ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ అధికారులు, కార్మిక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ అసంఘటిత రంగ కార్మికులకు ఎలాంటి భధ్రత లేకపోవడంతో ప్రమాదవశాత్తూ మతి చెందితే కుటుంబాలు ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోతున్నారు. ఇలాంటి కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించే మూడు పథకాలను విలీనం చేసి చంద్రన్న భీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో సభ్యులను చేర్చే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ప్రజాధికారిత సర్వేలో గుర్తింపు ః
ప్రజాధికారిత సర్వే జరుగుతున్న తరుణంలో చంద్రన్న భీమా పథకానికి అర్హులను గుర్తించేలా ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. జిల్లాలో శుక్రవారం నాటికి 12లక్షల 30వేల మందిని గుర్తించి వారికి కనీస ప్రీమియంగా నిర్ధారించిన రు.15లను లబ్ధిదారుని వద్ద నుండి వసూలు చేస్తూ ప్రభుత్వం చేర్పించింది. వీరందరికీ అక్టోబరు 2వ తేదీ నుండి భీమా అమలులోకి వస్తుంది. ఇదిలా ఉండగా మరో వీరిలో ఇప్పటికే 10లక్షల 92వేల మంది బ్యాంకు ఖాతాలను భీమాలకు అనుసంధానం చేసుకున్నారు. ఇంకా లక్షా 38వేల మంది బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసుకోవాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు బాజాలు ః
వాస్తవానికి ఈ భీమా పథకం చంద్రబాబు సర్కారుది కానే కాదు. ఈ పథకం ఇప్పటికే ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, ప్రదానమంత్రి సురక్ష భీమా యోజన, ఆమ్ ఆద్మీ పథకం ఈ మూడు పథకాలను కలిపి రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న భీమాగా నామకరణం చేసి బాజాలు కొట్టుకుంటుంది.
పథకం ప్రయోజనాలు ఇవీ ః
– భీమా పథకం ద్వారా నమోదైన సభ్యుల్లో ఎవరికైనా సహజ మరణం సంభవిస్తే రు.30వేలు భీమా సొమ్మును కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.
– ప్రమాద వశాత్తూ మతి చెందితే కుటుంబ సభ్యులకు రు.5లక్షలు భీమా సొమ్మును చెల్లిస్తారు.
– ఏదైనా ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం సంభవించిన వారికి రు.5లక్షలు చెల్లిస్తారు.
– పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే 3.75లక్షలు బాధిత కుటుంబానికి చెల్లిస్తారు.
నేడు బాండ్ల పంపిణీ ః
జిల్లాలో సుమారు 600 మంది లబ్ధిదారులకు నేడు కార్మిక శాఖ, గ్రామీణాభివద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బాండ్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. సిఆర్‌ఆర్ కళాశాలలో లాంఛనంగా నేడు ప్రారంభించి బాండ్లను లబ్ధిదారులకు అందిస్తారు.
లాంఛనంగా నేడు ప్రారంభం
కె.శ్రీనివాస్, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్
కార్మికశాఖ, డిఆర్‌డిఎ శాఖలు సంయుక్తంగా నేడు లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా నేడు 600 మందికి భీమా బాండ్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. అక్టోబరు 10వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు బాండ్ల పంపిణీ ప్రక్రియ పూర్తవుతోంది.