గుప్తా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఢిల్లీలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. వారానికి రెండు రోజులు ఆఫీస్‌కు వెళ్లి వస్తుంటాడు. మూడు రోజులు ఇంటి నుంచే పనిచేస్తుంటాడు. ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో నివాసం ఉంటున్నాడు. ఆఫీస్‌కు వెళ్లి వచ్చే సమయంలోనే అతడు కారును ఉపయోగిస్తుంటాడు. తన నివాసం నుంచి ఆఫీస్ 20 కిలోమీటర్ల
దూరంలో ఉంది.
30 ఏళ్ల మణి సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంటాడు. రోజూ ఢిల్లీ నుంచి గురుగ్రామ్‌కు వెళ్లి రావడం అతడు ఉద్యోగంలో భాగం. అంతేకాదు, వారాంతంలో దూర ప్రయాణాలు (లాంగ్ డ్రైవ్) చేయడం అతడికి హాబీ. దీంతో ఏటా 30,000 కిలోమీటర్ల మేర అతడు ప్రయాణం చేస్తుంటాడు. కానీ, గుప్తా ఏడాది మొత్తం తిరిగేది 4,000 కిలోమీటర్లు మించదు.
వీరిలో రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? సాధారణంగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ప్రమాదాల రిస్క్ ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి రిస్క్ ఉంటుంది. కానీ, ఇక్కడ ఇద్దరూ తమ కారు కోసం ఏటా చెల్లిస్తున్నది ఒకే రకమైన ప్రీమియం. నియమ నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటిస్తూ, పరిమిత వేగంతో, తక్కువ దూరం ప్రయాణించే వారిని.. ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిని ఒకే గాటన కట్టడం సహేతుకంగా అనిపించదు. అందుకే నడిపినంత దూరానికే, నడిపే తీరు ఆధారంగా ప్రీమియం చెల్లించే సదుపాయాన్ని బీమా సంస్థలు తీసుకొచ్చాయి.
‘‘రోజూ ఎక్కువ దూరం పాటు ప్రయాణించే వారు, దూర ప్రయాణాలకు తరచుగా వెళ్లే వారితో పోలిస్తే తక్కువ ప్రీమియం చెల్లించడానికే నా ప్రాధాన్యం. ఎందుకంటే నేను కారులో తిరిగేది చాలా తక్కువ దూరం. పైగా నేను ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను. అందుకే నేను చెల్లించే బీమా ప్రీమియం తక్కువగా ఉండాలని కోరుకున్నాను’’అని గుప్తా తెలిపారు.
అందుకే ఆయన ‘పే యాజ్ యూ డ్రైవ్’ (పీఏవైడీ), ‘పే హౌ యూ యూజ్’ (పీహెచ్‌ఐయూ) యాడాన్స్‌ను ఎంపిక చేసుకుని, గతంతో పోలిస్తే తక్కువ ప్రీమియం చెల్లిస్తున్నారు.
గుప్తా వంటి వారికి ఇప్పుడు పీఏవైడీ పాలసీలు ఒక మంచి ఎంపికగా, ఆకర్షణీయంగా మారాయనడంలో సందేహం లేదు. వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుందన్న దాని ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియం వసూలు చేయడం ఈ పాలసీల్లో ఉన్న వెసులుబాటు. అందుకే తక్కువ నడిపే వారికి, జాగ్రత్తగా నడిపే వారికి ఇవి పెద్ద ఊరటనిస్తున్నాయి. ఈ పీఏవైడీ, పీహెచ్‌యూఐ పాలసీలు ఎలా పనిచేస్తాయి? వీటిని తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు? ఈ వివరాలను అందించే కథనమే ఇది.
నేపథ్యం..
మోటార్ బీమా పాలసీలకు సంబంధించి టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను ప్రవేశపెట్టేందుకు బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) 2022 జూలైలో అనుమతించింది. వినియోగ ఆధారిత వాహన బీమా ప్లాన్లు, రైడర్లు ఆ తర్వాత నుంచి మార్కెట్ ప్రవేశం చేశాయి. టెలీమ్యాటిక్స్ డివైజ్‌లు/గ్యాడ్జెట్ల (పరికరాలు) సాయంతో వాహన వినియోగాన్ని అంచనా వేసి, ఆ మేరకు ప్రీమియాన్ని సాధారణ బీమా సంస్థలు వసూలు చేస్తున్నాయి. కారు నడిపే తీరును కూడా అవి ఈ పరికరాల ద్వారా పరిశీలిస్తాయి. దీంతో సంబంధిత వాహనదారుడి డ్రైవింగ్ తీరు, దూరంపై బీమా కంపెనీలకు కచి్చతమైన సమాచారం లభిస్తుంది.
వీటిని విశ్లేషించిన అనంతరం, రిస్క్ ఆధారంగా ప్రీమియం నిర్ణయిస్తాయి. పీఏవైడీ ప్లాన్ల/రైడర్లలో వాహనం తక్కువ నడిపే వారికి ప్రీమియం భారం ఎలా అయితే తగ్గుతుందో.. వాహనం ఎక్కువగా వినియోగించే వారికి ప్రీమియం భారం పెరుగుతుంది. పీఏవైడీ, పీహెచ్‌ఐయూ యాడాన్‌లుగా లభిస్తాయి. ప్రస్తుత ప్లాన్‌కు అనుసంధానంగా తీసుకోవచ్చు. రెన్యువల్ సమయంలో బీమా కంపెనీకి ఈ విషయాన్ని చెబితే చాలు. బీమా ఏజెంట్ లేదంటే నేరుగా బీమా కంపెనీ పోర్టల్ నుంచే వీటిని తీసుకోవచ్చు. దరఖాస్తు పత్రాన్ని నింపి, అప్పటికే కలిగి ఉన్న బీమా ప్లాన్ వివరాలను సమరి్పస్తే చాలు.
దూరం ఆధారంగా..
పాలసీ కొనుగోలు సమయంలో ఎంపిక చేసుకున్న కిలోమీటర్ల ఆధారంగా పీఏవైడీ పాలసీల ప్రీమియం ఆధారపడి ఉంటుంది. పలు రకాల ప్రీమియం శ్లాబులు ఉంటాయి. వీటి నుంచి పాలసీదారుడు ఎంపిక చేసుకోవచ్చు. ‘‘మన దేశంలో టెలీమ్యాటిక్స్ డివైజ్‌లు కేవలం కొన్ని రకాల కార్ల మోడళ్లకే అందుబాటులో ఉన్నాయి. అందుకని మేము తీసుకొచి్చన పాలసీలో, ఓడోమీటర్ సాయంతో దూరాన్ని లెక్కిస్తున్నాం.
ఓడోమీటర్ రీడింగ్‌ను టెలీమ్యాటిక్స్ డివైజ్ లేదంటే మొబైల్ యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చు’’అని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో రిటైల్ బిజినెస్ ప్రెసిడెంట్ పార్థానిల్ ఘోష్ తెలిపారు. సాధారణ ప్రీమియంతో పోలిస్తే బీమా సంస్థలు పీఏవైడీ ప్లాన్ కింద.. 2,500 కిలోమీటర్ల వరకు తిరిగే కార్లకు ప్రీమియంలో 25 శాతం తగ్గింపునిస్తున్నాయి. ఏడాదికి 2,501 కిలోమీటర్ల నుంచి 5,000 కిలోమీటర్ల దూరానికి 17.50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి.
ఇక 5,001–7,000 కిలోమీటర్ల పరిధిలో తిరిగే వాహనాలకు ప్రీమియంలో 10 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. 7,501–10,000 కిలోమీటర్ల దూరం నడిచే కార్లకు ప్రీమియంలో 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఏడాదికి 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పాటు నడిచే కార్లకు ప్రీమియంలో ఎలాంటి రాయితీ ఉండదు. పాలసీ కొనుగోలు చేసే సమయంలో ఉన్న ఓడోమీటర్ రీడింగ్‌ను బీమా సంస్థలు నమోదు చేస్తాయి. తిరిగి రెన్యువల్ సమయానికి తిరిగిన దూరం ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తాయి.
‘‘ఇలా ఏడాదిలో తిరిగిన దూరం ఆధారంగా మరుసటి ఏడాది ప్రీమియంలో బీమా కంపెనీలు తగ్గింపును ఇస్తాయి. ఒకవేళ పాలసీదారుడు అదే కంపెనీ వద్ద రెన్యువల్ చేసుకోకుండా, మరొక కంపెనీ వద్ద పాలసీ తీసుకున్నా సరే, గడిచిన ఏడాదికి సంబంధించిన డిస్కౌంట్‌ను నెఫ్ట్ ద్వారా పాలసీదారు ఖాతాకు బదిలీ చేస్తాయి. అదే కంపెనీతో కొనసాగితే రెన్యువల్ ప్రీమియంలో తగ్గించి, మిగిలినది చెల్లిస్తే సరిపోతుంది’’అని పార్థానిల్ ఘోష్ వివరించారు.
పాలసీ తీసుకునే సమయంలో ఎంపిక చేసుకున్న కిలోమీటర్లను ఏడాది కాక ముందే అధిగమించేశారనుకుంటే, అప్పుడు టాపప్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏడాదికి 6,000 కిలోమీటర్ల కోసం పాలసీ తీసుకుని, రెన్యువల్ గడువుకు ముందే ఈ దూరం దాటేస్తే, అప్పుడు దీన్ని పెంచుకోవచ్చు. ‘‘ఒకటికి మించిన కార్లు ఉన్నవారు లేదా తక్కువ దూరం ప్రయాణించే వారికి పీఏవైడీ ప్లాన్లు మంచి ప్రయోజనాన్నిస్తాయి.
ప్రీమియంలో తగ్గింపు అనేది కారు మోడల్, దాని వయసు, రిజి్రస్టేషన్ అయిన ప్రాంతం ఆధారంగా నిర్ణయం అవుతుంది. కొన్ని బీమా సంస్థలు రెన్యువల్ సమయంలో అదనపు రివార్డులను కూడా ఇస్తున్నాయి. పాలసీ సంవత్సరంలో కారు తక్కువ వినియోగిస్తాననే స్పష్టత యజమానికి ఉంటే, వాస్తంగా వినియోగించుకున్న మేరకే ప్రీమియం చెల్లించడం సహేతుకంగా ఉంటుంది’’అని పాలసీబజార్ మోటార్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల హెడ్ ఆకర్‡్ష శర్మ సూచించారు.
నడిపే తీరు కూడా ముఖ్యమే
గుప్తా మాదిరే తాము కూడా డ్రైవింగ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తామని అనుకునే వారు ‘పే హౌ యూ యూజ్’ (పీహెచ్‌ఐయూ) ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో వాహనం నడిపే తీరు ఆధారంగా ప్రీమియం చార్జ్ చేస్తారు. పీఏవైడీ మాదిరే, పీహెచ్‌వైయూ (పే హౌ యు యూజ్) కూడా యాడాన్‌గా వస్తోంది. ‘‘నడిపే తీరు ఆధారితంగా ఆల్గోరిథమ్ ఇంటర్నల్ స్కోర్‌ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా అండర్‌రైటర్స్ (బీమా అధికారులు) ప్రీమియంను కచి్చతంగా లెక్కిస్తారు. దేశంలో కనెక్టెడ్ కార్లను ప్రారంభించడం పీఏవైడీ ఆఫర్ చేయడానికి అనుకూలం.
అవి డ్రైవింగ్ తీరుపై బీమా సంస్థలకు నాణ్యమైన సమాచారాన్ని ఇస్తాయి’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ మోటార్ డి్రస్టిబ్యూషన్ హెడ్ సుభాశిష్ మజుందార్ తెలిపారు. కనెక్టెడ్ కార్స్ అంటే ఇంటర్నెట్‌తో అనుసంధానమైనవి. వీటిల్లో కమ్యూనికేషన్ డివైజ్‌లు, సెన్సార్లు కూడా ఉంటాయి. ఈ ప్లాన్లను తమకు కావాల్సిన విధంగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. పాలసీని ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. జునో జనరల్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్న ‘స్విచ్’ అనేది ఆన్ డిమాండ్ పాలసీ. పట్టణానికి వెలుపల ఉండి, కారును నడపని సమయంలో పాలసీని ఆఫ్ చేసుకోవచ్చు. దీనివల్ల బీమా ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు.
కానీ, ఇలా ఆఫ్ చేసుకున్న సమయంలో కారుకు ఏదైనా నష్టం ఏర్పడితే అందుకు బీమా కంపెనీ నుంచి పరిహారం రాదని (కొన్ని మినహాయింపులు) గుర్తుంచుకోవాలి. కస్టమర్ కారు నడుపుతున్న తీరు ఆధారంగా డ్రైవింగ్ స్కోర్‌ను బీమా సంస్థలు కేటాయిస్తాయి. అధిక వేగం, పరధాన్యంతో డ్రైవింగ్, ఉన్నట్టుండి బ్రేక్‌లు కొట్టడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ స్కోర్ కేటాయిస్తాయి. ఒకవేళ పాలసీని స్విచాఫ్ చేసుకున్న తర్వాత, కారును వినియోగించినట్టయితే ఆ సమయంలో స్విచాన్ చేయడం మర్చిపోయినా.. వారి తరఫున యాప్ ఆ పనిచేస్తుంది.
అన్నింటిపై కాదు..
నడిపినంత దూరం, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంపై వచ్చే డిస్కౌంట్ ఆధారపడి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఓన్ డ్యామేజ్ అంటే వాహనానికి ఏదైనా కారణం వల్ల నష్టం వాటిల్లినా లేదా చోరీకి గురైనా పరిహారం ఇచ్చేదని అర్థం చేసుకోవాలి. థర్డ్ పార్టీ అంటే తమ వాహనం వల్ల ఎదుటి వాహనానికి, వ్యక్తులకు జరిగే నష్టానికి రక్షణనిచ్చే కవరేజీ. కొన్ని బీమా కంపెనీలు కేవలం ఓన్ డ్యామేజ్ వరకే ఈ డిస్కౌంట్‌ను ఇస్తున్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి సంస్థలు థర్డ్ పార్టీ కవరేజీపైనా డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
కనుక మొత్తంమీద డిస్కౌంట్ ఎంత వస్తుందన్నది ముందే విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు కారు ప్రీమియం రూ.5,000 చెల్లిస్తున్నారనుకుంటే.. అందులో రూ.3,000 ఓన్ డ్యామేజ్ కోసం, రూ.2,000 థర్డ్ పార్టీ కోసం అయితే, ఓన్ డ్యామేజ్ రూ.3,000పై 5–25 శాతం వరకు డిస్కౌంట్ అంటే రూ.150–750 వరకు తగ్గుతుందని అర్థం. ఇక్కడ వాహనదారుడి ప్రయాణ సమాచారం ఎప్పటికప్పుడు బీమా కంపెనీలకు తెలుస్తుందని గుర్తు పెట్టుకోవాలి. గోప్యత కోరుకునే వారు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ డేటా ఆధారంగానే బీమా సంస్థలు ప్రీమియంపై నిర్ణయానికి వస్తాయి.
డిస్కౌంట్ పొందే వారి డ్రైవింగ్ తీరు సైతం బీమా కంపెనీలకు తెలిసిపోతుంది. భవిష్యత్తులో ప్రమాదాల క్లెయిమ్‌లు వచి్చన సమయంలో ఈ డేటా వాటికి ఉపకరించొచ్చు. రద్దీ సమయాల్లో డ్రైవింగ్, ప్రమాదాలకు అధిక రిస్క్ ఉన్న ప్రాంతాల్లో డ్రైవింగ్‌కు సంబంధించి బీమా కంపెనీలు కొన్ని పరిమితులు విధించే అవకాశం లేకపోలేదు. బీమా కంపెనీ కోరినట్టు టెలీమ్యాటిక్స్, ఇతర పరికరాలు అమర్చుకోవాలంటే, అందుకు కొంత అదనపు వ్యయం అవుతుంది. ఈ పరికరాలకు మెయింటెనెన్స్, మరమ్మతుల ఖర్చు కూడా వాహనదారుడిపైనే పడుతుంది. వాహనంలో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే.. అందుకు సంబంధించి పాలసీ నియమ, నిబంధనలు ఏంటో ముందే తెలుసుకోవాలి.
వీటికి కవరేజీ..
► సంప్రదాయ బీమాలో మాదిరే అన్ని రకాల రిస్క్‌లను పీఏవైడీ కవర్ చేస్తుంది. అయితే ప్రీమియం చెల్లింపుల్లో వ్యత్యాసం ఉంటుంది.
► ప్రమాదం జరిగితే కారు రీపేర్ లేదంటే రీప్లేస్‌కు అయ్యే ఖర్చును బీమా కంపెనీ భరిస్తుంది.
► చోరీకి గురైతే లేదా చోరీ కారణంగా కారు డ్యామేజ్ అయినా పరిహారం లభిస్తుంది.
► వరదలు, భూకంపాలు తదితర విపత్తుల వల్ల కారుకు నష్టం ఏర్పడినా పరిహారం వస్తుంది.
► థర్డ్ పార్టీ కవరేజీ కూడా పీఏవైడీలతో వస్తుంది.
► కొన్ని పీఏవైడీ పాలసీలు గాయాల రక్షణ కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి.
మినహాయింపులు..
► ఉద్దేశపూర్వకంగా చేసుకునే
నష్టానికి పరిహారం రాదు.
► మద్యం, డ్రగ్స్ ప్రభావంతో కారు నడుపుతూ ప్రమాదం, నష్టం వాటిల్లితే బీమా సంస్థలు పరిహారం చెల్లించవు.
► డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడపడం వల్ల ఎదురయ్యే నష్టానికి పరిహారం రాదు.
► రోజువారీ వినియోగం వల్ల వాహనంలో
విడిభాగాలను మార్చాల్సి వస్తే వాటికి పరిహారం రాదు.
► ఎలక్ట్రికల్, మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల నష్టం ఏర్పడితే పరిహారం చెల్లించవు.
ప్రీమియం తగ్గించుకునే టిప్స్..
► తక్కువ దూరం నడిపే వారికి పీఏవైడీతో ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. దగ్గరి దూరానికి కారును ఉపయోగించుకోకుండా ఉండాలి. కార్యాలయానికి వెళ్లేవారు సహచర ఉద్యోగితో కలసి చెరొక రోజు కారును వినియోగించుకోవడం వల్ల ఆదా చేసుకోవచ్చు.
► చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఏ సందర్భంలోనూ ట్రాఫిక్ నియామాలు ఉల్లంఘించకూడదు. పరిమిత వేగాన్ని మించకుండా ఉండాలి. సడెన్ బ్రేక్‌లు వేయడం, రిస్క్ తీసుకుని క్రాస్ చేయడం ఇలా ప్రమాదాలకు దారితీసే చర్యలకు దూరంగా ఉండాలి.
► ఎయిర్ బ్యాగ్‌ల వంటి భద్రతా ఫీచర్లు ఎక్కువగా ఉన్న కారును ఎంపిక చేసుకోవడం వల్ల కూడా ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు.
► మద్యపానం సేవించే వారు ఆ సమయంలో క్యాబ్ సేవలు వినియోగించుకుని, వ్యక్తిగత డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment