vechcle
-
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల జోరు.. వెహికల్ లోన్స్‌లో సరికొత్త రికార్డ్‌లు
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వాహన రుణ పుస్తకం గణనీయంగా పెరిగి 2025 మార్చి నాటికి రూ.8.1 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 2023 మార్చి నాటికి ఇది రూ.5.9 లక్షల కోట్లుగా ఉంది. వాణిజ్య వాహనాలు, కార్లు, యుటిలిటీ వాహనాలు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు డిమాండ్‌కు తోడు.. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడాన్ని అనుకూలమైన అంశాలుగా పేర్కొంది. రుణ చెల్లింపులు మెరుగ్గా ఉండడంతో, ఆస్తుల నాణ్యత మరింత బలపడుతుందని తెలిపింది. 2023 నాటికి మొత్తం వాహన రుణాల్లో 50 శాతం వాణిజ్య వాహనాల కోసం తీసుకున్నవేనని పేర్కొంది. ఆ తర్వాత కార్లు, యుటిలిటీ వాహన రుణాలు 29 శాతం, ద్విచక్ర/త్రిచక్ర వాహన రుణాలు 11 శాతం, ట్రాక్టర్ల కోసం తీసుకున్న రుణాలు 10 శాతంగా ఉన్నాయి. ‘‘వాణిజ్య వాహనాల ఫైనాన్స్ ఏటా 12–14 శాతం చొప్పున 2023–25 మధ్య కాలంలో వృద్ధి చెందుతుంది. వాణిజ్య వాహనాలను వినియోగించే సిమెంట్, స్టీల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో వినియోగం పెరగనుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు. కొత్త వాహనాల ధరలు పెరగడంతో, యూజ్డ్ (అప్పటికే ఒకరు వాడిన) వాహన రుణాలకు డిమాండ్ పెరుగుతున్నట్టు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఆస్తుల నాణ్యత మెరుగుపడడం వాహన రుణ సంస్థల పరపతికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. వాహన రుణాల మార్కెట్లో 90 శాతం వాటా కలిగిన సంస్థల బ్యాలన్స్ షీట్లను పరిశీలించినప్పుడు, 90 రోజులకు పైగా బకాయి ఉన్న రుణాల శాతం 1.2 శాతం తగ్గి 4.7 శాతానికి పరిమితమైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
బీమా.. నడిపినోళ్లకు నడిపినంత!
గుప్తా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఢిల్లీలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. వారానికి రెండు రోజులు ఆఫీస్‌కు వెళ్లి వస్తుంటాడు. మూడు రోజులు ఇంటి నుంచే పనిచేస్తుంటాడు. ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో నివాసం ఉంటున్నాడు. ఆఫీస్‌కు వెళ్లి వచ్చే సమయంలోనే అతడు కారును ఉపయోగిస్తుంటాడు. తన నివాసం నుంచి ఆఫీస్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 30 ఏళ్ల మణి సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంటాడు. రోజూ ఢిల్లీ నుంచి గురుగ్రామ్‌కు వెళ్లి రావడం అతడు ఉద్యోగంలో భాగం. అంతేకాదు, వారాంతంలో దూర ప్రయాణాలు (లాంగ్ డ్రైవ్) చేయడం అతడికి హాబీ. దీంతో ఏటా 30,000 కిలోమీటర్ల మేర అతడు ప్రయాణం చేస్తుంటాడు. కానీ, గుప్తా ఏడాది మొత్తం తిరిగేది 4,000 కిలోమీటర్లు మించదు. వీరిలో రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? సాధారణంగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ప్రమాదాల రిస్క్ ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి రిస్క్ ఉంటుంది. కానీ, ఇక్కడ ఇద్దరూ తమ కారు కోసం ఏటా చెల్లిస్తున్నది ఒకే రకమైన ప్రీమియం. నియమ నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటిస్తూ, పరిమిత వేగంతో, తక్కువ దూరం ప్రయాణించే వారిని.. ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిని ఒకే గాటన కట్టడం సహేతుకంగా అనిపించదు. అందుకే నడిపినంత దూరానికే, నడిపే తీరు ఆధారంగా ప్రీమియం చెల్లించే సదుపాయాన్ని బీమా సంస్థలు తీసుకొచ్చాయి. ‘‘రోజూ ఎక్కువ దూరం పాటు ప్రయాణించే వారు, దూర ప్రయాణాలకు తరచుగా వెళ్లే వారితో పోలిస్తే తక్కువ ప్రీమియం చెల్లించడానికే నా ప్రాధాన్యం. ఎందుకంటే నేను కారులో తిరిగేది చాలా తక్కువ దూరం. పైగా నేను ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను. అందుకే నేను చెల్లించే బీమా ప్రీమియం తక్కువగా ఉండాలని కోరుకున్నాను’’అని గుప్తా తెలిపారు. అందుకే ఆయన ‘పే యాజ్ యూ డ్రైవ్’ (పీఏవైడీ), ‘పే హౌ యూ యూజ్’ (పీహెచ్ఐయూ) యాడాన్స్ను ఎంపిక చేసుకుని, గతంతో పోలిస్తే తక్కువ ప్రీమియం చెల్లిస్తున్నారు. గుప్తా వంటి వారికి ఇప్పుడు పీఏవైడీ పాలసీలు ఒక మంచి ఎంపికగా, ఆకర్షణీయంగా మారాయనడంలో సందేహం లేదు. వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుందన్న దాని ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియం వసూలు చేయడం ఈ పాలసీల్లో ఉన్న వెసులుబాటు. అందుకే తక్కువ నడిపే వారికి, జాగ్రత్తగా నడిపే వారికి ఇవి పెద్ద ఊరటనిస్తున్నాయి. ఈ పీఏవైడీ, పీహెచ్యూఐ పాలసీలు ఎలా పనిచేస్తాయి? వీటిని తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు? ఈ వివరాలను అందించే కథనమే ఇది. నేపథ్యం.. మోటార్ బీమా పాలసీలకు సంబంధించి టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను ప్రవేశపెట్టేందుకు బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) 2022 జూలైలో అనుమతించింది. వినియోగ ఆధారిత వాహన బీమా ప్లాన్లు, రైడర్లు ఆ తర్వాత నుంచి మార్కెట్ ప్రవేశం చేశాయి. టెలీమ్యాటిక్స్ డివైజ్‌లు/గ్యాడ్జెట్ల (పరికరాలు) సాయంతో వాహన వినియోగాన్ని అంచనా వేసి, ఆ మేరకు ప్రీమియాన్ని సాధారణ బీమా సంస్థలు వసూలు చేస్తున్నాయి. కారు నడిపే తీరును కూడా అవి ఈ పరికరాల ద్వారా పరిశీలిస్తాయి. దీంతో సంబంధిత వాహనదారుడి డ్రైవింగ్ తీరు, దూరంపై బీమా కంపెనీలకు కచి్చతమైన సమాచారం లభిస్తుంది. వీటిని విశ్లేషించిన అనంతరం, రిస్క్ ఆధారంగా ప్రీమియం నిర్ణయిస్తాయి. పీఏవైడీ ప్లాన్ల/రైడర్లలో వాహనం తక్కువ నడిపే వారికి ప్రీమియం భారం ఎలా అయితే తగ్గుతుందో.. వాహనం ఎక్కువగా వినియోగించే వారికి ప్రీమియం భారం పెరుగుతుంది. పీఏవైడీ, పీహెచ్ఐయూ యాడాన్లుగా లభిస్తాయి. ప్రస్తుత ప్లాన్‌కు అనుసంధానంగా తీసుకోవచ్చు. రెన్యువల్ సమయంలో బీమా కంపెనీకి ఈ విషయాన్ని చెబితే చాలు. బీమా ఏజెంట్ లేదంటే నేరుగా బీమా కంపెనీ పోర్టల్ నుంచే వీటిని తీసుకోవచ్చు. దరఖాస్తు పత్రాన్ని నింపి, అప్పటికే కలిగి ఉన్న బీమా ప్లాన్ వివరాలను సమరి్పస్తే చాలు. దూరం ఆధారంగా.. పాలసీ కొనుగోలు సమయంలో ఎంపిక చేసుకున్న కిలోమీటర్ల ఆధారంగా పీఏవైడీ పాలసీల ప్రీమియం ఆధారపడి ఉంటుంది. పలు రకాల ప్రీమియం శ్లాబులు ఉంటాయి. వీటి నుంచి పాలసీదారుడు ఎంపిక చేసుకోవచ్చు. ‘‘మన దేశంలో టెలీమ్యాటిక్స్ డివైజ్‌లు కేవలం కొన్ని రకాల కార్ల మోడళ్లకే అందుబాటులో ఉన్నాయి. అందుకని మేము తీసుకొచి్చన పాలసీలో, ఓడోమీటర్ సాయంతో దూరాన్ని లెక్కిస్తున్నాం. ఓడోమీటర్ రీడింగ్‌ను టెలీమ్యాటిక్స్ డివైజ్ లేదంటే మొబైల్ యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చు’’అని హెచ్డీఎఫ్సీ ఎర్గో రిటైల్ బిజినెస్ ప్రెసిడెంట్ పార్థానిల్ ఘోష్ తెలిపారు. సాధారణ ప్రీమియంతో పోలిస్తే బీమా సంస్థలు పీఏవైడీ ప్లాన్ కింద.. 2,500 కిలోమీటర్ల వరకు తిరిగే కార్లకు ప్రీమియంలో 25 శాతం తగ్గింపునిస్తున్నాయి. ఏడాదికి 2,501 కిలోమీటర్ల నుంచి 5,000 కిలోమీటర్ల దూరానికి 17.50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఇక 5,001–7,000 కిలోమీటర్ల పరిధిలో తిరిగే వాహనాలకు ప్రీమియంలో 10 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. 7,501–10,000 కిలోమీటర్ల దూరం నడిచే కార్లకు ప్రీమియంలో 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఏడాదికి 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పాటు నడిచే కార్లకు ప్రీమియంలో ఎలాంటి రాయితీ ఉండదు. పాలసీ కొనుగోలు చేసే సమయంలో ఉన్న ఓడోమీటర్ రీడింగ్‌ను బీమా సంస్థలు నమోదు చేస్తాయి. తిరిగి రెన్యువల్ సమయానికి తిరిగిన దూరం ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తాయి. ‘‘ఇలా ఏడాదిలో తిరిగిన దూరం ఆధారంగా మరుసటి ఏడాది ప్రీమియంలో బీమా కంపెనీలు తగ్గింపును ఇస్తాయి. ఒకవేళ పాలసీదారుడు అదే కంపెనీ వద్ద రెన్యువల్ చేసుకోకుండా, మరొక కంపెనీ వద్ద పాలసీ తీసుకున్నా సరే, గడిచిన ఏడాదికి సంబంధించిన డిస్కౌంట్‌ను నెఫ్ట్ ద్వారా పాలసీదారు ఖాతాకు బదిలీ చేస్తాయి. అదే కంపెనీతో కొనసాగితే రెన్యువల్ ప్రీమియంలో తగ్గించి, మిగిలినది చెల్లిస్తే సరిపోతుంది’’అని పార్థానిల్ ఘోష్ వివరించారు. పాలసీ తీసుకునే సమయంలో ఎంపిక చేసుకున్న కిలోమీటర్లను ఏడాది కాక ముందే అధిగమించేశారనుకుంటే, అప్పుడు టాపప్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఏడాదికి 6,000 కిలోమీటర్ల కోసం పాలసీ తీసుకుని, రెన్యువల్ గడువుకు ముందే ఈ దూరం దాటేస్తే, అప్పుడు దీన్ని పెంచుకోవచ్చు. ‘‘ఒకటికి మించిన కార్లు ఉన్నవారు లేదా తక్కువ దూరం ప్రయాణించే వారికి పీఏవైడీ ప్లాన్లు మంచి ప్రయోజనాన్నిస్తాయి. ప్రీమియంలో తగ్గింపు అనేది కారు మోడల్, దాని వయసు, రిజి్రస్టేషన్ అయిన ప్రాంతం ఆధారంగా నిర్ణయం అవుతుంది. కొన్ని బీమా సంస్థలు రెన్యువల్ సమయంలో అదనపు రివార్డులను కూడా ఇస్తున్నాయి. పాలసీ సంవత్సరంలో కారు తక్కువ వినియోగిస్తాననే స్పష్టత యజమానికి ఉంటే, వాస్తంగా వినియోగించుకున్న మేరకే ప్రీమియం చెల్లించడం సహేతుకంగా ఉంటుంది’’అని పాలసీబజార్ మోటార్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల హెడ్ ఆకర్‡్ష శర్మ సూచించారు. నడిపే తీరు కూడా ముఖ్యమే గుప్తా మాదిరే తాము కూడా డ్రైవింగ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తామని అనుకునే వారు ‘పే హౌ యూ యూజ్’ (పీహెచ్ఐయూ) ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో వాహనం నడిపే తీరు ఆధారంగా ప్రీమియం చార్జ్ చేస్తారు. పీఏవైడీ మాదిరే, పీహెచ్వైయూ (పే హౌ యు యూజ్) కూడా యాడాన్‌గా వస్తోంది. ‘‘నడిపే తీరు ఆధారితంగా ఆల్గోరిథమ్ ఇంటర్నల్ స్కోర్‌ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా అండర్‌రైటర్స్ (బీమా అధికారులు) ప్రీమియంను కచి్చతంగా లెక్కిస్తారు. దేశంలో కనెక్టెడ్ కార్లను ప్రారంభించడం పీఏవైడీ ఆఫర్ చేయడానికి అనుకూలం. అవి డ్రైవింగ్ తీరుపై బీమా సంస్థలకు నాణ్యమైన సమాచారాన్ని ఇస్తాయి’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ మోటార్ డి్రస్టిబ్యూషన్ హెడ్ సుభాశిష్ మజుందార్ తెలిపారు. కనెక్టెడ్ కార్స్ అంటే ఇంటర్నెట్తో అనుసంధానమైనవి. వీటిల్లో కమ్యూనికేషన్ డివైజ్‌లు, సెన్సార్లు కూడా ఉంటాయి. ఈ ప్లాన్లను తమకు కావాల్సిన విధంగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. పాలసీని ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. జునో జనరల్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్న ‘స్విచ్’ అనేది ఆన్ డిమాండ్ పాలసీ. పట్టణానికి వెలుపల ఉండి, కారును నడపని సమయంలో పాలసీని ఆఫ్ చేసుకోవచ్చు. దీనివల్ల బీమా ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు. కానీ, ఇలా ఆఫ్ చేసుకున్న సమయంలో కారుకు ఏదైనా నష్టం ఏర్పడితే అందుకు బీమా కంపెనీ నుంచి పరిహారం రాదని (కొన్ని మినహాయింపులు) గుర్తుంచుకోవాలి. కస్టమర్ కారు నడుపుతున్న తీరు ఆధారంగా డ్రైవింగ్ స్కోర్‌ను బీమా సంస్థలు కేటాయిస్తాయి. అధిక వేగం, పరధాన్యంతో డ్రైవింగ్, ఉన్నట్టుండి బ్రేక్‌లు కొట్టడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ స్కోర్ కేటాయిస్తాయి. ఒకవేళ పాలసీని స్విచాఫ్ చేసుకున్న తర్వాత, కారును వినియోగించినట్టయితే ఆ సమయంలో స్విచాన్ చేయడం మర్చిపోయినా.. వారి తరఫున యాప్ ఆ పనిచేస్తుంది. అన్నింటిపై కాదు.. నడిపినంత దూరం, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంపై వచ్చే డిస్కౌంట్ ఆధారపడి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఓన్ డ్యామేజ్ అంటే వాహనానికి ఏదైనా కారణం వల్ల నష్టం వాటిల్లినా లేదా చోరీకి గురైనా పరిహారం ఇచ్చేదని అర్థం చేసుకోవాలి. థర్డ్ పార్టీ అంటే తమ వాహనం వల్ల ఎదుటి వాహనానికి, వ్యక్తులకు జరిగే నష్టానికి రక్షణనిచ్చే కవరేజీ. కొన్ని బీమా కంపెనీలు కేవలం ఓన్ డ్యామేజ్ వరకే ఈ డిస్కౌంట్‌ను ఇస్తున్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి సంస్థలు థర్డ్ పార్టీ కవరేజీపైనా డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. కనుక మొత్తంమీద డిస్కౌంట్ ఎంత వస్తుందన్నది ముందే విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు కారు ప్రీమియం రూ.5,000 చెల్లిస్తున్నారనుకుంటే.. అందులో రూ.3,000 ఓన్ డ్యామేజ్ కోసం, రూ.2,000 థర్డ్ పార్టీ కోసం అయితే, ఓన్ డ్యామేజ్ రూ.3,000పై 5–25 శాతం వరకు డిస్కౌంట్ అంటే రూ.150–750 వరకు తగ్గుతుందని అర్థం. ఇక్కడ వాహనదారుడి ప్రయాణ సమాచారం ఎప్పటికప్పుడు బీమా కంపెనీలకు తెలుస్తుందని గుర్తు పెట్టుకోవాలి. గోప్యత కోరుకునే వారు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ డేటా ఆధారంగానే బీమా సంస్థలు ప్రీమియంపై నిర్ణయానికి వస్తాయి. డిస్కౌంట్ పొందే వారి డ్రైవింగ్ తీరు సైతం బీమా కంపెనీలకు తెలిసిపోతుంది. భవిష్యత్తులో ప్రమాదాల క్లెయిమ్‌లు వచి్చన సమయంలో ఈ డేటా వాటికి ఉపకరించొచ్చు. రద్దీ సమయాల్లో డ్రైవింగ్, ప్రమాదాలకు అధిక రిస్క్ ఉన్న ప్రాంతాల్లో డ్రైవింగ్‌కు సంబంధించి బీమా కంపెనీలు కొన్ని పరిమితులు విధించే అవకాశం లేకపోలేదు. బీమా కంపెనీ కోరినట్టు టెలీమ్యాటిక్స్, ఇతర పరికరాలు అమర్చుకోవాలంటే, అందుకు కొంత అదనపు వ్యయం అవుతుంది. ఈ పరికరాలకు మెయింటెనెన్స్, మరమ్మతుల ఖర్చు కూడా వాహనదారుడిపైనే పడుతుంది. వాహనంలో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే.. అందుకు సంబంధించి పాలసీ నియమ, నిబంధనలు ఏంటో ముందే తెలుసుకోవాలి. వీటికి కవరేజీ.. ► సంప్రదాయ బీమాలో మాదిరే అన్ని రకాల రిస్క్‌లను పీఏవైడీ కవర్ చేస్తుంది. అయితే ప్రీమియం చెల్లింపుల్లో వ్యత్యాసం ఉంటుంది. ► ప్రమాదం జరిగితే కారు రీపేర్ లేదంటే రీప్లేస్‌కు అయ్యే ఖర్చును బీమా కంపెనీ భరిస్తుంది. ► చోరీకి గురైతే లేదా చోరీ కారణంగా కారు డ్యామేజ్ అయినా పరిహారం లభిస్తుంది. ► వరదలు, భూకంపాలు తదితర విపత్తుల వల్ల కారుకు నష్టం ఏర్పడినా పరిహారం వస్తుంది. ► థర్డ్ పార్టీ కవరేజీ కూడా పీఏవైడీలతో వస్తుంది. ► కొన్ని పీఏవైడీ పాలసీలు గాయాల రక్షణ కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. మినహాయింపులు.. ► ఉద్దేశపూర్వకంగా చేసుకునే నష్టానికి పరిహారం రాదు. ► మద్యం, డ్రగ్స్ ప్రభావంతో కారు నడుపుతూ ప్రమాదం, నష్టం వాటిల్లితే బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. ► డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడపడం వల్ల ఎదురయ్యే నష్టానికి పరిహారం రాదు. ► రోజువారీ వినియోగం వల్ల వాహనంలో విడిభాగాలను మార్చాల్సి వస్తే వాటికి పరిహారం రాదు. ► ఎలక్ట్రికల్, మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల నష్టం ఏర్పడితే పరిహారం చెల్లించవు. ప్రీమియం తగ్గించుకునే టిప్స్.. ► తక్కువ దూరం నడిపే వారికి పీఏవైడీతో ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. దగ్గరి దూరానికి కారును ఉపయోగించుకోకుండా ఉండాలి. కార్యాలయానికి వెళ్లేవారు సహచర ఉద్యోగితో కలసి చెరొక రోజు కారును వినియోగించుకోవడం వల్ల ఆదా చేసుకోవచ్చు. ► చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఏ సందర్భంలోనూ ట్రాఫిక్ నియామాలు ఉల్లంఘించకూడదు. పరిమిత వేగాన్ని మించకుండా ఉండాలి. సడెన్ బ్రేక్‌లు వేయడం, రిస్క్ తీసుకుని క్రాస్ చేయడం ఇలా ప్రమాదాలకు దారితీసే చర్యలకు దూరంగా ఉండాలి. ► ఎయిర్ బ్యాగ్‌ల వంటి భద్రతా ఫీచర్లు ఎక్కువగా ఉన్న కారును ఎంపిక చేసుకోవడం వల్ల కూడా ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు. ► మద్యపానం సేవించే వారు ఆ సమయంలో క్యాబ్ సేవలు వినియోగించుకుని, వ్యక్తిగత డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి. -
హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం..పెరుగుతున్న వాహనాల ధరలు
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరోమోటో కార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన మోటర్ సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్ - షోరూం ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు అక్టోబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఎంత శాతం మేర పెరుగుతుందనే అంశంపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వెహికల్స్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్, మోడల్స్ ఆధారంగా ఒక శాతం పెరిగే అవకాశం ఉందని సమాచారం. పెరిగిపోతున్న ధరలు, కాంపిటీషన్, ద్రవ్యోల్బణం కారణంగా వాహనాల ధరల్ని పెరుగుదలకు కారణమని హీరో మోటో కార్ప్ తన రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. పెరిగే ఎక్స్ షోరూం ధర ఎంతంటే? ఇంతకుముందు, కొత్తగా ప్రారంభించిన ఫ్లాగ్షిప్ కరిజ్మా ఎక్స్ఎంఆర్ ప్రమోషనల్ ఆఫర్ ముగిసినందున అక్టోబర్ 1 నుండి ఎక్స్ షోరూం ధరను రూ.7,000కు (ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.1,79,900) పెంచుతున్నట్లు ప్రకటించింది. హీరో కరిజ్మా ఎక్స్ ఎంఆర్ ప్రస్తుత బుకింగ్ విండో రూ.1,72,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది నేటితో ముగియనుంది. ఇకపై పెంచిన ధరలతో సేల్స్ నిర్వహిస్తామని హీరో కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పెరుగుతున్న ఎగుమతులు కాగా, హీరో మోటోకార్ప్ ఆగస్టు నెలలో మొత్తం వాహనాల అమ్మకాలు 6 శాతం పెరిగి 4,88,717 యూనిట్లుగా నమోదయ్యాయి. డొమెస్టిక్ సేల్స్ 4,50,740 యునిట్లుగా ఉండగా 2022 ఇదే ఆగస్టు నెలతో పోలిస్తే దేశీయ విక్రయాలు 5 శాతం వృద్ధితో 4,72,947 యూనిట్లుగా ఉన్నాయి. అయితే ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 11,868 యూనిట్ల నుంచి 15,770 యూనిట్లకు పెరిగడం విశేషం. చదవండి👉 హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతీ గ్రాండ్ విటారా కార్లు! -
కరోనా మృతుల కోసం ‘లాస్ట్ రైడ్ సర్వీస్’
రాయదుర్గం: కరోనాతో చనిపోయిన వారిని ఖనన స్థలానికి తరలించేందుకు వీలుగా ఏర్పాటుచేసిన ‘లాస్ట్ రైడ్ సర్వీస్’అంబులెన్స్ వాహనాన్ని శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో కమిషనర్ వీసీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. సజ్జనార్ మాట్లాడుతూ కరోనాతో మృతిచెందిన వారిని ఆస్పత్రి నుంచి ఖననానికి తీసుకెళ్లడం, ఖననం చేయడం సమస్యగా మారిందన్నారు. అటువంటి సమయంలో ఫీడ్ ది నీడీ టీమ్ కరోనా, నాన్ కరోనా మృతుల ఖననం కోసం ఈ వాహన సేవలను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయకుమార్, ఫీడ్ ది నీడీ టీమ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, ఎన్జీఓ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ప్రతినిధి కళ్యాణ్ రూ.50 వేల చెక్కును సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు అందించారు. లాస్ట్ రైడ్ సర్వీస్ సేవలిలా.. కరోనాతో లేదా ఇతరత్రా చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేసే స్థలానికి అంబులెన్స్ ద్వారా ఉచితంగానే తరలిస్తారు. రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వర కు ఈ వాహనం అందుబాటులో ఉంటుంది. సంప్రదించాల్సిన నంబర్: 84998 43545. -
ఇంధనానికి తగ్గ రంగు స్టిక్కర్లు
న్యూఢిల్లీ: దేశరాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో నడిచే వాహనాలకు అధికారులు ఇకపై ఇంధనాన్ని బట్టి స్టిక్కర్లు ఏర్పాటు చేయనున్నారు. హోలోగ్రామ్ స్టిక్కర్ రంగును బట్టి ఆ వాహనం పెట్రోల్, సీఎన్జీ, డీజిల్, విద్యుత్‌లలో దేంతో నడుస్తోందో కనిపెట్టేయవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఎన్సీఆర్లో శీతాకాలంలో కాలుష్యం బెడదను తగ్గించేందుకు తీసుకునే చర్యలపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తాజా ప్రతిపాదనల ప్రకారం పెట్రోల్, సీఎన్జీ వాహనాలకు లేత నీలిరంగు, డీజిల్‌తో నడిచే వాహనాలకు ఆరెంజ్ కలర్ హోలోగ్రామ్ స్టిక్కర్లుంటాయి. దీంతోపాటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు గ్రీన్ నంబర్ ప్లేట్లను లేదా గ్రీన్ హోలోగ్రామ్ స్టిక్కర్లను వాడేలా చూడాలని సూచించింది. -
బలగాల వాహనం పేల్చివేత
రాయ్‌పూర్ / చర్ల / చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు గస్తీ నిర్వహిస్తున్న బలగాల వాహనాన్ని ఆదివారం మందుపాతరతో పేల్చివేశారు. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు దుర్మరణం చెందారు. మావోల దాడిని పిరికిపందల చర్యగా ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ అభివర్ణించారు. దంతేవాడ జిల్లాలోని బచేలి–చోల్నార్ రోడ్డు నిర్మాణ పనులకు సామగ్రిని తరలిస్తున్న వాహనాలకు ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్(సీఏఎఫ్), డిస్ట్రిక్ ఫోర్స్(డీఎఫ్) సంయుక్త బలగాలు రక్షణ కల్పిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందులోభాగంగా గస్తీ నిర్వహిస్తున్న బలగాల వాహనం చోల్నార్ గ్రామ సమీపంలోకి రాగానే మావోలు శక్తిమంతమైన మందుపాతరను పేల్చారన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ దాడిలో బలగాల వాహనం తునాతునకలైందని వెల్లడించారు. ల్యాండ్‌మైన్ పేలుడు అనంతరం దాదాపు 200 మంది మావోలు బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారన్నారు. ఐదుగురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారని పేర్కొన్నారు. మృతుల్లో డీఎఫ్ బలగాలకు చెందిన హెడ్‌కానిస్టేబుల్ రామ్‌కుమార్, కానిస్టేబుల్ తికేశ్వర్ ధ్రువ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ షాలిక్‌రామ్, సీఏఎఫ్ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ విక్రమ్ యాదవ్, కానిస్టేబుళ్లు రాజేశ్ కుమార్, రవినాథ్ పటేల్, అర్జున్ రాజ్భర్లు ఉన్నారు. దాడి అనంతరం బలగాల దగ్గరున్న ఆయుధాల్ని మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. ఇటీవల గడ్చిరోలీ, మల్కన్‌గిరితో పాటు బీజాపూర్‌లో భద్రతాబలగాల దాడిలో భారీగా నష్టపోయిన మావోలు.. ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. -
అ‘గమ్య’ గోచరం
చుంచుపల్లి : ‘4 ఇన్ ఆల్’.. ‘పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు’.. ఆటోలు, ఇతర వాహనాల రిజిస్ట్రేషన్ సందర్భంగా రవాణా శాఖ అధికారులు విధించే నిబంధనలు ఇవీ. కానీ ఇవి రాతలకు మాత్రమే. ప్రైవేటు వాహనదారులు లాభాపేక్షతో ఇష్టారాజ్యంగా ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. పరిమితికి మించి ప్రయాణికులతో పాటు మితిమీరిన వేగం.. ఇలా జిల్లాలో నిత్యం పలు ప్రమాదాలు జరుగుతున్నా.. రవాణా శాఖ అధికారులు చూసీచూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఆటోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజల అవసరాల మేరకు ఆర్టీసీ బస్సులు నడపకపోవడం, ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించాల్సి వస్తోంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే కూలీలు.. ఇలా అన్ని వర్గాల వారికీ ఆటోలే దిక్కుగా మారాయి. జిల్లాలోని అనేక గ్రామాలకు రోడ్లు సరిగా లేవనే సాకుతో అధికారులు ఆర్టీసీ బస్సులు నడపటం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలు ఎక్కి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. జిల్లాలో రవాణా పరిస్థితి ఇదీ.. జిల్లాలో 205 గ్రామ పంచాయతీలు, వీటి పరిధిలో 1,321 ఆవాస గ్రామాలు ఉన్నాయి. వీటిలో జిల్లాలో 411 గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. రోడ్లు సక్రమంగానే ఉన్నా.. తమ గ్రామాలకు బస్సు రావడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల పరిధిలో 289 ఆర్టీసీ బస్సులున్నాయి. వీటి ద్వారా నిత్యం 1.02 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో 30 నుంచి 40 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 13, 330 ఆటోలు, 1,461 ట్రాలీ ఆటోలు, 6,704 కార్లు, 69 ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఈ వాహనాల్లో ఎక్కువ శాతం పర్మిట్ నిబంధనలను అతిక్రమిస్తున్నవే కావడం గమనార్హం. ఆటోల్లో అయితే పరిస్థితి మరీ దారుణం. వివిధ కంపెనీలు తయారు చేసిన వాహనాలకు అదనంగా సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడంతో పాటు అతి వేగంతో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. ఆటోల్లో 10 మందికి పైగానే... నిబంధనల ప్రకారం ఆటోలో డ్రైవర్‌తో కలిపి నలుగురు మాత్రమే ప్రయాణించాలి. కానీ ఏ ఆటో చూసినా 10 – 15 మంది వరకు కుక్కేస్తున్నారు. ఎక్కువ మంది కూర్చునేలా అదనపు సీట్లు ఏర్పాటుచేస్తున్నారు. సకాలంలో బస్సులు రాకపోవడంతో వేచి చూసి, విసిగి వేసారుతున్న ప్రయాణికులు త్వరగా గమ్యం చేరాలనే హడావిడిలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పలు గ్రామాలకు బస్సులే లేకపోగా, మారుమూల గ్రామాలకు ఉదయం ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు మాత్రమే నడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలే శరణ్యం అవుతున్నాయి. ప్రజల్లో మార్పు రావాలి ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. అయితే మానవతా ధృక్పథంతో పూర్తిస్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టలేకపోతున్నాం. ఈ విషయమై అనేక సార్లు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. ప్రధానంగా ప్రజల్లోనే మార్పు రావాలి. ప్రైవేటు వాహనాల వల్ల జరిగే ప్రమాదాల విషయంలో భయం ఏర్పడాలి. ప్రాణం చాలా విలువైనది. దానిని గమనించి ప్రతి ఒక్కరు సురక్షితమైన ప్రయాణాన్ని చూసుకోవాలి. జిల్లాలోని ప్రైవేటు వాహనాల డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించేలా చర్యలు చేపడతాం. – బి.కృష్ణారెడ్డి, రవాణా శాఖాధికారి చీకటే మిగిలింది.. బూర్గంపాడు మండల కేంద్రానికి చెందిన రావులపల్లి నర్సింహారావు(38) జనవరి 14న నాగినేనిప్రోలు రెడ్డిపాలెం బస్టాప్ మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మోటార్‌సైకిల్‌పై వస్తున్న నర్సింహారావు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబం దిక్కులేనిదైంది. తాపీపనులు చేస్తూ భార్యాపిల్లలతో సంతోషంగా గడిపై నర్సింహారావు మరణంతో ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆయన భార్య స్వప్న కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇద్దరు కుమార్తెలు సంధ్య, నందినిని చదివిస్తోంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని ఆమె కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తన భర్త ఉన్నప్పుడు పిల్లలు ఏదడిగినా తెచ్చిపెట్టేవారని, ఇప్పుడు చాలా కష్టమవుతోందని స్వప్న రోదిస్తోంది. ప్రమాదం జరిగి రెండున్నర నెలలు కావస్తున్నా తనకు ఎలాంటి పరిహారమందలేదని చెపుతోంది. -
వేపపుల్ల అందుకోబోయి ఒకరి మృతి
ఎల్లారెడ్డిపేట : పళ్లు తోమడానికి వేపపుల్ల తెంపుకోబోయిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. ఎల్లారెడ్డిపేటకు చెందిన గుండాడి నర్సింహరెడ్డి(66) కుటుంబంతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని కుకట్పల్లి హౌసింగ్‌బోర్డులో నివాసం ఉంటున్నాడు. అక్కడి యోగా కేంద్రానికి నర్సింహరెడ్డి ముఖ్య సలహాదారుడు, శిక్షకుడిగా పనిచేస్తున్నారు. తన ఇంటి సమీపంలోని ఓ పార్కులో నిత్యం వ్యాయామంతోపాటు యోగా చేస్తారు. రోజు లాగే మంగళవారం వ్యాయామం ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో ఓ వేపచెట్టు కొమ్మను తెంపడానికి ద్విచక్ర వాహనంపైకి ఎక్కాడు. కొమ్మ అందుకునే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నర్సింహరెడ్డి మృతదేహాన్ని ఎల్లారెడ్డిపేటకు తీసుకురాగా.. ఆయన అభిమానులు, బంధువులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. కేడీసీసీబీ వైస్ చైర్మన్ ఉచ్చిడి మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ తోట ఆగయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, వ్యాపారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుడికి భార్య రాధమ్మ, కుమారుడు మల్లారెడ్డి, కూతుళ్లు ఉన్నారు.